శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 02, 2020 , 00:29:35

జర భద్రం..

జర భద్రం..

  • బస్టాండ్లలో రెచ్చిపోతున్న చిల్లర దొంగలు
  • పర్సులు, సెల్‌ఫోన్లే టార్గెట్‌..
  • పట్టించుకోని పోలీసులు
  • నమోదు కాని కేసులు

ఆర్మూర్‌ : జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, మా ర్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో చోరీలు నిత్యకృత్యమయ్యాయి. ఏదో ఒక ఒక చోట తర చూ చోరీలు జరుగుతున్నాయి. దొంగలు రో జు రోజుకూ రెచ్చిపోతున్నా పోలీసులు మా త్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రద్దీ ప్రాం తాల్లో అదును చూసి చిల్లర దొంగలు తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యం గా సెల్‌ఫోన్లు, పర్సులను కాజేస్తున్నారు. సెల్‌ఫోన్‌, నగదు, విలువైన వస్తువులు పోగొట్టుకున్న బాధితులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదనే అపవాదు ఉంది. నెలలు గడుస్తున్నా తమ సెల్‌ఫోన్లు, వస్తువులు రికవరీ కాలేదని బాధితులు వాపోతున్నారు. చోరీలకు గురైన సెల్‌ఫోన్లకు సంబంధించిన ‘ఐఎంఈఐ’ నంబర్లు ఇవ్వాలని, ఆ నంబర్లను తీసుకుని కేసులు నమోదు చేయకుండా నెలల తరబడి పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అపహరణకు గురైన సెల్‌ఫోన్లు కానీ, నగదు కానీ ఇంతవరకు రికవరీ చేయడం లేదని   ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రద్దీ ప్రాంతాలే టార్గెట్‌

దొంగలు రద్దీ ప్రాంతాలను టార్గెట్‌ చేసుకొని సెల్‌ఫోన్‌ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్మూర్‌లో దీపావ ళి పండుగ రోజున పూలు, పూజ సా మగ్రి కొనుగోలు చేసే సమయంలో నలుగురు వ్యక్తుల నుంచి సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయి. బోధన్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో గ్రామాల నుంచి వచ్చే ప్రజల నుంచి తరచూ సెల్‌ఫోన్లు చోరీ అవుతున్నా యి. బోధన్‌ ఆర్టీసీ బస్టాండ్‌లో ఇదివరకు డ్యూటీలో ఉం డే లేడీ కానిస్టేబుల్‌, బ్లూకోర్ట్‌ కానిస్టేబుళ్లు ప్రస్తుతం విధుల్లో ఉండకపోవడంతో బస్టాండ్‌లో చోరీలు పెరిగాయని ప్రయాణికులు వాపోతున్నారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే స్వీకరించడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పలు చోట్ల సీసీ కెమెరాలు ఉండగా వీటిలో చోరీ దృశ్యాలు నమోదవుతున్నా నిందితుల వివరాలు స్పష్టంగా కనిపించడంలేదు. మసకగా ఉండి వారిని గుర్తుపట్టలేని విధంగా ఉంటున్నాయి. ఆర్మూర్‌ ఏరియాలోని అంగడిబజార్‌ కూరగాయల మార్కెట్‌లో సెల్‌ఫోన్ల చోరీ నిత్యకృత్యంగా మారింది. ఆర్మూర్‌ అంగడిబజార్‌లో శ్రీనివాస్‌గౌడ్‌ సెల్‌ఫోన్‌ చోరీ కాగా  విషయాన్ని సీపీ కార్తికేయకు ఫిర్యాదు చేశారు. అంగడిబజార్‌లో కమ్ములు గంగాధర్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లు సుమారు 20వేల విలువ గల వాటిని దొంగలు ఎత్తుకెళ్లగా ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఆగస్టులో ఫిర్యాదు చేయగా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని, సెల్‌ఫోన్‌ను రికవరీ చేయలేదని బాధితుడు వాపోతున్నాడు. పెర్కిట్‌ కూరగాయల మార్కెట్‌లో కర్తన్‌ శోభన్‌ రెండు సెల్‌ఫోన్లను పోగొట్టుకొని నెలలు గడుస్తున్నా, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు వాటి జాడ లేదు. పెర్కిట్‌కు చెందిన ఇట్టెడి లలిత రాజేందర్‌   మార్కెట్‌లో కూరగాయలను విక్రయిస్తుండగా 10 వేల రూపాయల విలువ గల సెల్‌ఫోన్‌, వెయ్యి రూపాయల నగదును దొంగలించారని బాధితురాలు తెలిపింది.

నిఘా కరువు

నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్లు, మార్కె ట్లు, ఇతర జనసమ్మర్ధ ప్రాంతాల్లో పోలీసుల నిఘా కొరవడింది. నిజామాబాద్‌ జిల్లా కేం ద్రంతోపాటు ఆర్మూర్‌, బోధన్‌ ఆర్టీసీ బస్టాం డ్లు అత్యంత రద్దీగా ఉంటాయి. ప్రతి రోజూ వేలాది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా అన్ని మండల కేంద్రాల్లోని బస్టాండ్ల ద్వారా వందలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్తుంటారు. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు కూరగాయల మార్కెట్లు ఎప్పుడూ బిజీగా ఉంటాయి. బస్టాండ్లు, మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో దొంగలు అదునుచూసి తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత తమ వస్తువులు పోయిన విషయాన్ని గమనించి ప్రజలు లబోదిబోమంటున్నారు. చేసేది లేక కొందరు మిన్నకుండిపోతున్నారు. మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ చోరీ చేసిన దుండగులు సెల్‌ఫోన్‌ రిపేర్‌ షాపులవారితో ఒప్పందం కుదుర్చుకొని ఐఎంఈఐ నంబ ర్లు మార్చేస్తున్నారు. వీటిని ఇతరులకు అమ్ముతున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి న అవసరముంది. జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్‌, బోధ న్‌, డిచ్‌పల్లి, భీమ్‌గల్‌, బాల్కొండ, జక్రాన్‌పల్లి, నందిపేట్‌ తదితర మండలాల్లో సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ షాపుల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి చోరీలకు పాల్పడుతున్నవారికి సహకరించొద్దని ఆదేశించాలి. అంతేకాకుండా ఐఎంఈఐ నంబర్లు మార్చడంపై కఠినంగా వ్యవహరించాలి. సెల్‌ఫోన్ల చోరీపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన  అవసరముంది. 

పోలీసులకు ఫిర్యాదు చేశా..

ఆర్మూర్‌లోని అంగడిబజార్‌లో ఉన్న కూరగాయల మార్కెట్‌లో నాలుగు నెలల క్రితం నా సెల్‌ఫోన్‌ పోయింది. సెల్‌ఫోన్‌ చోరీ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశా. సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నంబరు కూడా ఇచ్చా. ఇంతవరకు సెల్‌ఫోన్‌ను రికవరీ చేయలేదు.

-కమ్ములు గంగాధర్‌, బాధితుడు, ఆర్మూర్‌

సెల్‌ఫోన్‌ ఎత్తుకపోయిండ్రు

పెర్కిట్‌లోని మార్కెట్‌లో కూరగాయలు అమ్మేందుకు వెళ్లా. కూరగాయలు అమ్మే సమయంలో మాయమాటలతో 10వేల రూపాయల విలువైన దుబాయ్‌ ఫోన్‌, వెయ్యి రూపాయలు ఎత్తుకెళ్లిండ్రు. రద్దీగా ఉండే మార్కెట్‌లో పోలీసులు నిఘా పెట్టాలి. చోరీలకు పాల్పడుతున్న వారిని పట్టుకొని శిక్షించాలి.

-ఇట్టెడి లలితా రాజేందర్‌, బాధితురాలు, పెర్కిట్‌, ఆర్మూర్‌