గురువారం 28 జనవరి 2021
Nizamabad - Dec 01, 2020 , 01:02:15

కాల్చొద్దు.. కలియదున్నండి..

కాల్చొద్దు.. కలియదున్నండి..

  • వరి కోతలకు యంత్రాల వినియోగం
  • మిగిలిన కొయ్యలను కాల్చేస్తున్న రైతులు
  • పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం
  • సారం కోల్పోతున్న భూములువరి మొదళ్లను కలియదున్నడమేమేలంటున్న వ్యవసాయాధికారులు

లింగంపేట : వానకాలం, యాసంగిలో వరి సాగు చేసిన తర్వాత మిగిలిన వరి మొదళ్లను కలియదున్నాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. కూలీల కొరత అధికంగా ఉండడంతో రైతు లు పంటల సాగులో యంత్రాలను వినియోగిస్తున్నారు. వరి పంట కోతలను ఎక్కువగా యంత్రాల ద్వారా నిర్వహిస్తున్నారు. వరి కుదుళ్లు 30 సెంటీ మీటర్ల పైభాగంలో కోయడంతో పొలంలో కొయ్య లు అలాగే ఉండిపోతున్నాయి. వరి కోతల తర్వాత కొయ్యలను కాల్చి వేయడంతో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నది. కార్బన్‌మోనాక్సైడ్‌తోపాటు కార్బన్‌డయాక్సైడ్‌ గాలిలోకి అధిక మోతాదు లో విడుదల అవుతున్నది. దూళి, బూడిద గాలిలో కలవడం ద్వారా పర్యావరణం దెబ్బతింటున్నది. దీంతో భూమిలో సిలికాన్‌ పేరుకుపోవడంతోపాటు భూసారం తగ్గి పంటలకు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. వరి మొదళ్లకు నిప్పంటించడంతో భూమిలో తేమ శాతం తగ్గి దిగుబడులపై ప్రభావం పడుతున్నది. టన్ను గడ్డి పెరగడానికి భూమి నుంచి 6.2 కిలోల నత్రజని, 1.1 కిలోల భాస్వరం, 19 కిలోల పొటాషియం అవసరమవుతాయి. వీటిని కలియదున్నడం ద్వారా పోషకాలు తిరిగి భూమిలోకి చేరుతాయి. వరి మొదళ్లను కలియదున్నడం ద్వారా భూమిలోని తేమ శాతం కారణంగా కుళ్లిపోయి తిరిగి నేలలోకి చేరుతుంది. ఫలితంగా భూమి పగుళ్లు రాకుండా ఉండడంతోపాటు తేమ ఆవిరి కాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. వరి నాట్లు వేయడానికి ముందు దమ్ము చేసే సమయంలో ఎకరాకు 50 కిలోల సూపర్‌ ఫాస్ఫేట్‌ వేయడం ద్వారా కొయ్యలు త్వరగా కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. సేంద్రియ సాగుతో దిగుబడులు 5 నుంచి 10 శాతం వరకు పెరుగుతాయని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. పంటకు వేసిన పోషకాలను గ్రహించుకునే స్వభావం భూమికి పెరుగుతుంది. భూమి వేడెక్కడానికి ప్రధాన కారణమైన కార్బన్‌డయాక్సైడ్‌ సాంద్రత తగ్గించడానికి, నేలలో కర్బన శాతం పెరగడానికి వ్యవసాయ వ్యర్థాలను నేలకే చేర్చడం ఉత్తమమైన మార్గం అని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు.logo