శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 01, 2020 , 00:51:48

పల్లెకు ‘ప్రకృతి’ హారం...!

పల్లెకు ‘ప్రకృతి’ హారం...!

  • ఊరూరా ఏర్పాటైన పల్లె ప్రకృతి వనాలు
  • ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  రాష్ట్ర ప్రభుత్వం
  • ఆహ్లాదకర వాతావరణానికి కేరాఫ్‌గా గ్రామాలు
  • చిట్టడవిని తలపించేలా మొక్కల పెంపకానికి ప్రణాళిక
  • నిజామాబాద్‌లో 618 పల్లె ప్రకృతి వనాలకు 480 నిర్మాణాలు పూర్తి
  • కామారెడ్డిలో 660 లక్ష్యం కాగా ప్రారంభానికి సిద్ధమైన 653 పీపీవీలు
  • ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా తీర్చిదిద్దుతున్న వైనం

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుస్తున్న   రాష్ట్ర ప్రభుత్వం... ఊరూరా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. గ్రామాల్లో నివసించే ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు పల్లె ప్రకృతి వనాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఉపాధి హామీ పథకం, గ్రామ పంచాయతీ ప్రత్యేక నిధులతో గ్రామ పంచాయతీలు, ఆవాసాల్లోనూ ప్రకృతి వనాలు ఏర్పాటు అవుతున్నాయి. దీంతో గ్రామాలు పచ్చని శోభను సంతరించుకుంటున్నా యి. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం వేగంగా వీటి నిర్మాణాలను చకచకా పూర్తి చేస్తున్నది.  గ్రామీణ ప్రాంతవాసులకు ఆహ్లాదాన్ని చేరువ చే సేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. పల్లెలకు మణిహారంగా నిలిచే వి ధంగా పల్లె ప్రకృతి వనాలతో పల్లె జనాలు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే కేంద్రాలుగా ఇవీ పరిఢవిల్లనున్నాయి. వీటి ఏర్పాటుతో త్వరలోనే గ్రామాలు కొత్త శోభను సంతరించుకొంటున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఉభయ జిల్లాల్లో 1278 పల్లె ప్రకృతి వనాలు లక్ష్యం కాగా 1183 ఇప్పటికే పూర్తయ్యాయి. నిజామాబాద్‌లో 618 ప్రకృతి వనాలకు 480, కామారెడ్డిలో 660 టార్గెట్‌కు 653 పూర్తయ్యాయి. 

ప్రారంభానికి సిద్ధంగా...

గ్రామాల్లో పారిశుద్ధ్యం, మొక్కల పెంపకానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారించింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 1278 పల్లె ప్రకృతి వనాలను నిర్మించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు 1133 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో 530 గ్రామ పంచాయతీలు, 88 ఆవాసాలతో పాటు మొత్తం 618 చోట్ల పార్కులు నిర్మిస్తున్నా రు. ఇందులో 480 పూర్తి చేశారు. కామారెడ్డి జిల్లా లో 526 గ్రామ పంచాయతీలు, 134 ఆవాసాలతో మొత్తం 660 పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తుండగా ఇప్పటికే 653 చోట్ల పనులు పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల శరవేగంగా పనులు జరుగుతున్నా యి. పట్టణాల్లో ఉద్యానవనాలకు తీసిపోని విధం గా ఉపాధి హామీ పథకంలో పల్లె ప్రకృతి వనాలను అన్ని హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి చేసిన పల్లె ప్రకృతి వనాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటులో గుంతలు తవ్వ డం, మొక్కలు నాటడం వంటి పనులకు ఉపాధి హామీ నిధులు వెచ్చిస్తున్నారు. ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ నిధులతో తుది రూపునిస్తున్నారు. ప్రవేశ ద్వారం వద్ద గేట్లు బిగించడం, ఇటుకలతో వాకింగ్‌ ట్రాక్‌ నిర్మించడం, కూర్చోవడానికి బెంచీలు, వనం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం, అలంకరణ మొక్కలను నాటడం వంటి అదనపు పనులకు నిధులు వెచ్చిస్తూ సేదతీరడానికి సౌకర్యంగా మారుస్తున్నారు.  

చిట్టడవిని తలపించేలా...

పల్లెల్లో గుర్తించిన స్థల విస్తీర్ణానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. 20 గుంటల స్థలంలో 2వేల మొక్కలు నాటేందుకు రూ.3.69లక్షలు, ఎకరా స్థలంలో 4వేల మొక్కలు నాటేందుకు రూ.6.52 లక్షలతో అంచనాలు త యారు చేశారు. సేకరించిన స్థలంలో చుట్టూ ఆరు నుంచి ఏడు వరుసల్లో మొక్కలు నాటుతూ ఆ తర్వాత వరుసలో 3 నుంచి 5 మీటర్ల వెడల్పుతో వాకింగ్‌ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. మధ్యలో పచ్చద నం పరిఢవిల్లేలా, చిట్టడవిని తలపించేలా మొక్కలను పెంచుతున్నారు. పల్లె ప్రకృతివనం సరిహద్దు ల్లో వేప, అడవి బాదం వంటి పెద్ద జాతి మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మధ్య భాగంలో తుల సి, తంగేడు, గన్నేరు, మందార, టేకు, ఉసిరి, జామ, వెలగ, కుంకుడు, శమీ, అల్లనేరేడు, గులాబీ వంటి మొక్కలు నాటుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన మొక్కలకూ ఇందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలను నాటడంతో పాటు వాటిని పక్కాగా సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నారు. వివిధ రకాల మొక్కలతో పూర్తి రూపు సంతరించుకుంటున్న పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదాన్ని పంచే వేదికలుగా, పర్యావరణ కేంద్రాలుగా మారుతున్నాయి.

పల్లె ప్రజలకు నూతన అనుభూతి... 

పట్టణాలు, నగరాల్లోనే కనిపించే పార్కులు ఇప్పుడు ప్రతీ గ్రామంలో దర్శనం ఇవ్వబోతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు కొత్తందాలను తీసుకువస్తున్నాయి. ప్రభుత్వం అర ఎకరం నుంచి ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసేందుకు ఆదేశించింది. సగటున ఒక్కో వనంలో వెయ్యి నుంచి 4 వేల మొక్కల్ని నాటేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందుకు నర్సరీల్లోని మొక్కలను వినియోగిస్తున్నారు. 

పండ్లు, అలంకారానికి వినియోగించే 26 రకాల మొక్కలను నాటుతున్నారు.  మొక్కల చుట్టూ కంచె వేయించి మూగ జీవాల బారిన పడకుండా సంరక్షణ చర్యలు చేపట్టారు. నిరంతరం నీరు అందించేలా బోరు బావిని తవ్వించి పంచాయతీ కార్మికులకు పర్యవేక్షణ బాధ్యతల్ని కట్టబెడుతున్నారు. పల్లె ప్రకృతి వనంలో ఆకట్టుకునే మొక్కలు, విశాలమైన దారులను నడక కోసం అందుబాటులోకి తెచ్చారు. మరో నాలుగైదు నెలల్లో మొక్కలు పెరిగితే పట్టణాల్లోని ఉద్యానవనాలకు దీటుగా ఇవి అందుబాటులోకి రానున్నాయి.  గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు వనంలో నడక సాగించేందుకు, సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా సందర్శించేందుకు వీలుగా మారనుంది.

ఆకర్షణీయంగా పల్లె ప్రకృతి వనాలు...

పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు దాదాపుగా పూర్తయ్యాయి. రక్షణ కంచె వేయించాం, గ్రామస్తులు ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరేలా చిట్టడవిని రూపొందిస్తున్నాం. పల్లె ప్రకృతి వనంలో ఔషధ మొక్కలతో పాటు అన్ని రకాల మొక్కల్ని నాటించాము. ఆకట్టుకునేలా గ్రామాల్లో వినూత్నంగా పల్లె ప్రకృతి వనాన్ని నిర్మిస్తున్నాం. పల్లెలకు ఇవీ ప్రకృతి హారంగా మారబోతున్నాయి.

- లత, అదనపు కలెక్టర్‌, నిజామాబాద్‌ జిల్లా