మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 30, 2020 , 01:46:00

అడవుల అభివృద్ధికి ప్రణాళికలు

అడవుల అభివృద్ధికి ప్రణాళికలు

  • ఏప్రిల్‌ నుంచి పునరుద్ధరణ కార్యక్రమాలు
  • పీసీసీఎఫ్‌ శోభ

డిచ్‌పల్లి : అడవుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశామని, ఏప్రిల్‌ నుంచి నిజామాబాద్‌ జిల్లాలోని మంచిప్ప రిజర్వు ఫారెస్ట్‌లో అడవుల పునరుద్ధరణ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పీసీసీఎఫ్‌ ఆర్‌.శోభ అన్నారు. మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఉన్న శ్రీ సీతారాముల ఆలయాన్ని ఆమె ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్‌ మాట్లాడుతూ.. అడవుల పునరుద్ధరణ కోసం కేంద్రం నిధులను మంజూరు చేసిందని, జిల్లాలోని మంచిప్ప పరీవాహక ప్రాంతంలో ఏప్రిల్‌ 2021-22 కింద ఎస్‌ఎంసీ మెకానికల్‌ కన్జర్వేషన్‌ యాక్టివిటీస్‌లో భాగంగా ఆర్‌ఎఫ్‌డీ ర్యాప్‌ డీల్‌ డ్యామ్‌, పర్క్యులేషన్‌ ట్యాంకులు, చెక్‌ డ్యాములు, కందకాల తవ్వకాలు తదితర కార్యక్రమాలు చేపడుతామని చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కను నాటిన ఆమె ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఆమె వెంట అడిషనల్‌ పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌, నిజామాబాద్‌ డీఎఫ్‌వో సునీల్‌ హీరామత్‌, నిజామాబాద్‌ ఎఫ్‌డీవో రాంకిషన్‌, ఇందల్వాయి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారిణి హేమచందన, డిప్యూటీ రేంజ్‌ అధికారి ఆసిఫుద్దీన్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి, సెక్షన్‌ అధికారి లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి హరితవనం సందర్శన 

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి పట్టణ సమీపంలోని వడ్లూర్‌ శివారులో నిర్మిస్తున్న ఎస్పీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన హరితవనాన్ని తెలంగాణ పీసీసీఎఫ్‌ డాక్టర్‌ శోభ ఆదివారం సందర్శించారు. హరితవనంలో మొక్కను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా హరితవనాన్ని ఏర్పాటు చేసిన ఎస్పీ శ్వేతారెడ్డిని అభినందించారు. అడిషనల్‌ పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌, నిజామాబాద్‌ జిల్లా అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు పాల్గొన్నారు.