బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Nov 28, 2020 , 01:09:53

ఇక రొయ్య పిల్లలు..

ఇక రొయ్య పిల్లలు..

  • రొయ్య పిల్లల విడుదలకు ప్రభుత్వ ఆమోదం 
  • కామారెడ్డి జిల్లాలోని నాలుగు జలాశయాలకు అనుమతి 
  • వారం రోజుల్లో 28 లక్షల రొయ్యపిల్లలు విడుదల చేసేందుకు చర్యలు 
  • హర్షం వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు 

నిజాంసాగర్‌: కామారెడ్డి జిల్లాలోని ఆయా చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో వంద శాతం రాయితీపై చేప పిల్లలను విడుదల చేసిన ప్రభుత్వం రొయ్య పిల్లలను సైతం విడుదల చేసేందుకు ప్రభుత్వం అమోదం తెలుపడంతో మత్స్యకార్మికుల్లో ఆనందం వెల్లివిరిస్తున్నది. చేపపిల్లల విడుదలతో జీవనోపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న కార్మికులు రొయ్య పిల్లల విడుదలతో మరింత సంతోషంగా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం రొయ్య పిల్లలను కూడా విడుదల చేస్తుండడంతో ఇక తమ బతుకులు బాగు పడ్డట్టేనంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమైక్య పాలనలో అణగారిన కులాలు రాష్ట్ర అవతరణతో అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. కులవృత్తులను నమ్ముకున్న వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. ఈయేడు వర్షాలు పుష్కలంగా కురియడంతో జిల్లాలోని ఆయా మండలాల్లో నెల రోజుల కిందటే 3.35 కోట్ల చేప పిల్లలను వంద శాతం రాయితీపై విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యింది. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

నాలుగు జలాశయాల్లో రొయ్య పిల్లల విడుదల

జిల్లాలోని ఆరు జలాశయాల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందించగా.. ప్రభుత్వం నాలుగింటిలో మాత్రమే విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది. నిజాంసాగర్‌, కౌలాస్‌నాలా, కామారెడ్డి పెద్దచెరువు, అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువుల్లో 28 లక్షల రొయ్యలను విడుదల చేయనున్నారు. రొయ్యలు చేతికి రావడానికి ఏడు నెలల సమయం పడుతుందని, ఏడు నెలల పాటు నీరు నిల్వ ఉన్న జలాశయాల్లోనే రొయ్యలను విడుదల చేస్తే అవి పెరిగి పెద్దవి అవుతాయని, నీరు తక్కువగా ఉన్న జలాశయాల్లో విడుదల చేస్తే రొయ్య పిల్లలను చేపలు తినేస్తాయని, అందుకే పెద్ద జలాశయాల్లోనే విడుదల చేస్తున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారిణి పూర్ణిమ తెలిపారు. ఆయా జలాశయాల్లో రోజన్‌బర్గ్‌ అనే మంచినీటి రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. గత సంవత్సరం రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఇతర రకానికి చెందిన పిల్లలను విడుదల చేసేందుకు ప్రయత్నించగా పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్రస్థాయి అధికారి గమనించి అడ్డుకున్నారు. మరో వారం రోజుల్లో ఆయా జలాశయాల్లో 28 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయనున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 24.09 లక్షలు, కౌలాస్‌నాలా ప్రాజెక్టులో 2.49 లక్షలు, కామారెడ్డి పెద్ద చెరువులో 0.64 లక్షలు, అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో 0.78 లక్షల పిల్లలను విడుదల చేయనున్నారు. 

చాలా సంతోషంగా ఉంది.. 

ప్రభుత్వం ఉచితంగా నెల రోజుల కిందటే మా గ్రామంలోని చెరువులతో పాటు నిజాంసాగర్‌ ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసింది. మళ్లీ ఇప్పుడు రొయ్య పిల్లలను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో చేపలను దళారుల వద్ద తీసుకొచ్చి చెరువులో వేసేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వమే ఉచితంగా చేప పిల్లలను, రొయ్య పిల్లలను చెరువులు, ప్రాజెక్టుల్లో వేస్తున్నది. 

మైశబోయి, మత్స్యకారుడు, బుర్గుల్‌.  

ప్రాజెక్టును నమ్ముకొని బతుకుతున్నాం.. 

మా కుటుంబం మొత్తం నిజాంసాగర్‌ ప్రాజెక్టును నమ్ముకొని బతుకుతున్నాం. ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తుండడంతో వాటిని వేటాడుతూ మంచి ధర వచ్చేలా విక్రయించుకుంటూ సంతోషంగా మా కుటుంబం ముందు కు సాగుతున్నాం. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. 

- సాయిలు, మత్స్యకారుడు, నిజాంసాగర్‌. 

వారం రోజుల్లో విడుదల చేస్తాం.. 

జిల్లాలోని నాలుగు జలాశయాల్లో రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వారం రోజుల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశాం. నాలుగింట్లో కూడా రోజన్‌బర్గ్‌ రకానికి చెందిన రొయ్యలను విడుదల చేస్తాం. నిజాంసాగర్‌ ప్రాజెక్టును నమ్ముకొని వెయ్యి మత్స్యకార్మిక కుటుంబాలు, కౌలాస్‌నాలాపై 250 మత్స్యకార్మిక కుటుంబాలు, కామారెడ్డి పెద్ద చెరువుపై వంద కుటుంబాలు, అడ్లూర్‌ ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై ఆధారపడి వంద కుటుంబాలు జీవిస్తున్నాయి.  

- పూర్ణిమ,

జిల్లా మత్స్యశాఖ అధికారిణి, కామారెడ్డి.


logo