బుధవారం 20 జనవరి 2021
Nizamabad - Nov 28, 2020 , 01:03:17

చకచకా ‘పునర్జీవం’

చకచకా ‘పునర్జీవం’

  • జోరుగా మూడో పంపు హౌస్‌ పనులు
  • కరోనా ఇబ్బందులను అధిగమిస్తూ...  
  • ఆరు మోటర్ల బిగింపు పూర్తి
  • సివిల్‌ పనులు 90 శాతం పూర్తి
  • మంత్రి వేముల ఆదేశాలతో చకచకా పనులు
  • డిసెంబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

కమ్మర్‌పల్లి : ఎస్సారెస్పీ పునర్జీవం పనులు చివ రి దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఈ పథకంలో ని మిగతా రెండు పంపు హౌస్‌ల ద్వారా కాళేశ్వరం జలాలు పలుమార్లు ఎస్సారెస్పీ గడపను ముద్దాడి వరద కాలువ ద్వారా యాసంగి, వానకాలం పంటలు పుష్కలంగా పండుతున్నాయి. సాగు నీరు లేక ఇబ్బందులతో ఎదురు చూస్తున్న రైతన్నలకు ముందుగా రెండు పంపు హౌస్‌లను పూర్తి చేసి రైతులకు వరద కాలువ గుండా పునర్జీవం పథకం ద్వారా నీటిని అందించాలని  సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  ఈ మేరకు రాంపూర్‌, రాజేశ్వర్‌ రావు పేట్‌ పంపు హౌస్‌లను పూర్తి చేసి ముప్కాల్‌ వద్ద మూడో పంపు హౌస్‌ పనులు పూర్తి కాకపోయినా  2019 సెప్టెంబరులోనే కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ వరకు చేర్చి వరద కాలువను నిండుగా నింపి పునర్జీవం పథకాన్ని విజయవంతం చేశారు.

కరోనాతో పనుల్లో జాప్యం..

మూడో పంపు హౌస్‌ పనులు ఊపందుకుంటున్న దశలో కరోనా కారణంగా పనులు చేసే సిబ్బంది కొరత నెలకొంది. దీంతో పనులు ఆలస్యమయ్యా యి.రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి పనుల పూర్తికి ఆదేశించారు. దీంతో ఇటీవల కరోనా ఇబ్బందులను అధిగమిస్తూ పనులను వేగవంతం చేశారు.

మూడు పంప్‌హౌస్‌ల ద్వారా..

ఎస్సారెస్పీ పునర్జీవం పథకంలో మూడు పంప్‌ హౌస్‌ల ద్వారా కాళేశ్వరం జలాలను వరద కాలువ గుండా ఎస్సారెస్పీకి తరలిస్తారు.ఈ పథకం ద్వారా ఎస్సారెస్పీలో నీటి లభ్యత బాగా తగ్గిపోయినప్పుడు అవసరమైన దశలో రోజుకు ఒక టీఎంసీ చొప్పున 69 రోజుల్లో 60 టీఎంసీలు తరలించుకునే వీలుంది.వరద కాలువను మూడు కాలాల పాటు నిండు కుండలా నింపుకునే వీలుంది. ఒక్కో పంపు హౌస్‌లో ఎనిమిది పంపు మోటర్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో పంపు ద్వారా 1450 క్యూసెక్కులు మొత్తం ఎనిమిది మోటర్ల ద్వారా 11 వేల 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసే సామర్థ్యముంటుంది. ఇలాంటి పంపు హౌస్‌ల్లో మొదటి పంపు హౌస్‌ను వరద కాలువ 73వ కి.మీ. వద్ద జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌ సమీపంలో, రెండవ పంపు హౌస్‌ను ఇబ్రహీం పట్నం మండలం రాజరాజేశ్వర్‌ రావు పేట్‌ సమీపంలో 34వ కి.మీ. వద్ద నిర్మించారు.ఈ రెండు పంపు హౌస్‌ల ద్వారా అవసరమైనప్పుడల్లా వరద కాలువను నింపుతూ వస్తున్నారు.

రైతులకు సకాలంలో నీరిందించేందుకు ఈ రెం డు పంపు హౌస్‌ల పనులు ముందుగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో మూ డోది నిజామాబాద్‌ జిల్లాలో ముప్కాల్‌ మండ ల కేంద్రం సమీపంలో ఎస్సారెస్పీ వద్ద 0.100 కి.మీ. వద్ద చేపట్టిన పనులు కొంత ఆలస్యంగా ఊపందుకున్నాయి. కానీ అంతలోనే కరోనా మహమ్మారి వ్యాపించడంతో పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చి పంపు హౌస్‌లో పని చేసే కార్మికులు తమ రాష్ర్టాలకు తరలి వెళ్లిపోయారు. దీంతో పనులు స్తంభించిపోయాయి. లాక్‌డౌన్‌తో రవాణా మార్గాలు బంద్‌ కావడంతో విదేశాల నుంచి వచ్చిన మోటర్లు సైతం నెలల తర్వా త గానీ చేరలేదు.ఇటీవల సిబ్బందిని, కార్మికులను కూడగట్టి పనులను మళ్లీ పట్టాలెక్కించారు. వడివడిగా పనులు కొనసాగించారు. దీంతో ఎనిమిది మోటర్లకు గాను ఆరు మోటర్ల బిగింపు పూర్తి స్థాయిలో ముగిసింది. మిగతా రెండు మోటర్ల బిగింపు పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన సివిల్‌ పనులు జరుగుతున్నాయి.

డిసెంబరు నాటికి పూర్తి చేసేలా కృషి 

డిసెంబర్‌ నాటికి  పంప్‌ హౌస్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. వరద కాలువ నుంచి పంప్‌హౌస్‌లోకి నీరు చేరే అప్రోచ్‌ కెనాల్‌, వరద కాలువ నుంచి పంప్‌ హౌస్‌లోకి నీటిని మళ్లించే గేట్లు, పంపు హౌస్‌ నుంచి ఎస్సారెస్పీ లోకి నీటిని తరలించే లీడ్‌ కెనాల్‌ పనులు పూర్తయ్యాయి.పంపు హౌస్‌ సబ్‌స్టేషన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి.  

- టి.తిరుపతి, డీఈ ఎస్సారెస్పీ వరద కాలువ


logo