శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Nov 28, 2020 , 00:57:15

పెట్టుబడి తగ్గించాలి.. దిగుబడి పెంచాలి...!

పెట్టుబడి తగ్గించాలి.. దిగుబడి పెంచాలి...!

  • ఆదర్శ సేద్యంపై నిజామాబాద్‌లో ప్రయోగాత్మక సాగుకు ప్రోత్సాహం
  • ఎరువుల వాడకంలో శాస్త్రీయతను అవలంబించేలా చర్యలు
  • సాగులో యాంత్రీకరణ వినియోగం పెంచేలా ప్రధాన దృష్టి
  • ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, ఏవోలతో ప్రత్యేక బృందాలు
  • మీడియా కాన్ఫరెన్సులో కలెక్టర్‌ నారాయణరెడ్డి 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వ్యవసాయ జిల్లాగా పేరొందిన నిజామాబాద్‌లో ఆదర్శ సేద్యాన్ని పెంపొందించేందుకు నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి ప్రయోగాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారు. యాసంగి సీజన్‌లో రైతుకు పెట్టుబడి ఖర్చులు తగ్గించేలా, దిగుబడి భారీగా పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మూస పద్ధతి వ్యవసాయానికి భిన్నంగా శాస్త్రీయ పద్ధతిలో వరి సాగును ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎరువుల వాడకంలో జాగ్రత్తలు, భూమి అవసరానికి అనుగుణంగానే ఫెర్టిలైజర్స్‌ వాడకం, సాగులో కూలీల కొరత, ఖర్చును తగ్గించేందుకు యాంత్రీకరణ వినియోగం ముఖ్యమని కలెక్టర్‌ పే ర్కొంటున్నారు. గ్రామానికి ఐదారుగురు ఆదర్శ రైతులను ఎంపిక చేసుకుని తొలుత ప్రయోగాత్మకంగా ఆదర్శ సేద్యాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్నారు. వచ్చే పంటల సీజన్‌ నాటికి జిల్లా వ్యాప్తం గా ఈ తరహా సేద్యానికి రైతులను మళ్లించాలనే ఆలోచనతో కలెక్టర్‌  ఉన్నారు. దీంతో పాటుగా బ్యాంకులో రుణాలు రీ పేమెంట్‌ విషయంలో రైతులకు ఉన్నటువంటి అపోహలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అనే క మంది రైతులు ఏడాది కాలంలో వ్యవసాయ రు ణాలు చెల్లించకపోవడంతో మొండి బకాయిల జాబితాలో కూరుకుపోయే ఆస్కారం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సెల్‌ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ నారాయణ రెడ్డి మరిన్ని వివరాలను వెల్లడించారు..  

ఎరువుల వాడకం...

నిజామాబాద్‌ వ్యవసాయ జిల్లా. ఇక్కడ రైతులం తా వ్యవసాయమే ఆధారంగా జీవిస్తారు. మంచి వ్యవసాయం చేస్తారు. 5లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఇందులో వరి 3.80 లక్షల ఎకరాలు ఉంది. రైతు బాగుపడాలంటే పెట్టుబడి తగ్గించాలి. దిగుబడి పెంచాలి. ఎరువుల వినియోగంలో శాస్త్రీయత లేకపోవడంతో  పెట్టుబడి పెరిగి... దిగుబడి తగ్గుతున్నది. నిజామాబాద్‌ జిల్లాలో ఏ మూ లకు వెళ్లినా మన భూమిలో భాస్వరం అనేది ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. భాస్వరం వాడాల్సిన అవసరం మనకు లేదు. మొక్కకు అందాల్సిన జింక్‌ అందకుండా పోవడం తో ఎదుగుదల తగ్గిపోతుంది. నత్రజని అనేది యూరియా, డీఏపీ, కాంప్లెక్స్‌లోనూ ఉంటుంది. రైతులు తెలియకుండానే వాడాల్సిన దాని కన్నా  ఎక్కువగా ఎరువులను వినియోగిస్తున్నారు. వ్యవసాయాధికారుల సలహా తప్పనిసరిగా పాటించాలి. వానకాలం సీజన్‌లో ఎరువుల వాడకంలో అశాస్త్రీయత మూలంగా ఎకరానికి 5బస్తాల దిగుబడి తగ్గింది. మోతాదు మించి ఎరువుల వాడకంతో   ఇతర రోగం రావడం, దాని కోసం మరో పురుగుల మందు వాడడంతో  రైతుకు ఖర్చులు పెరుగుతున్నాయి. పొలాల్లో పోటాపోటీగా ఎరువులు వాడుతున్నారు. ఈ సీజన్‌లో ఎకరాకు బస్తా ఎరువు తగ్గించినా 3.86లక్షల ఎకరాల్లో దాదాపుగా రూ.40కోట్లు ఆదా అవుతుంది. యూరియా విచక్షణారహితంగా వాడొద్దు. పంటకు మేలు చేసే జింక్‌ను రైతులు వాడడం లేదు.

బ్యాంకు రుణాలపై ప్రత్యేక డ్రైవ్‌...

బ్యాంకు రుణాల కోసం డ్రైవ్‌ మొదలు పెట్టాం. మండల స్థాయిలో ఎంపీడీవో, ఏపీవో, ఎంపీవో, ఏవో ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏర్పాటు చే శాం. గ్రామ పంచాయతీ సిబ్బందితో  కలిసి గ్రా మాల్లో రైతులకు వ్యవసాయ రుణాలు రెన్యువల్‌ చేసుకోవాలని అవగాహన కల్పిస్తాం. డిసెంబర్‌ 12, 2018 నాటికి పెండింగ్‌లో ఉన్న రుణాలకు రుణ మాఫీ తప్పక వర్తిస్తుంది. రీ పేమెంట్‌ చేసి కొ త్తగా తీసుకుంటే రుణ మాఫీ వర్తించదేమోనని అపోహ పడుతున్నారు. ఇది తప్పు. వ్యవసాయ రుణాలు రెన్యువల్‌ చేసుకోవడం ద్వారా రుణ మా ఫీ డబ్బులు ఆగవు. వాటికి వీటికి సంబంధం లేదు. కట్‌ ఆఫ్‌ డేట్‌ ప్రకారం రుణ మాఫీ డబ్బులు రైతు బ్యాంకు అకౌంట్‌లో పడిపోతాయి. 7శాతం వడ్డీ తో వ్యవసాయ రుణాలను ప్రభుత్వం ఇస్తున్నది. ఒక సంవత్సరం దాటితే వ్యవసాయ రుణాలు మొండి బకాయిలుగా మారుతుంది. రెన్యువల్‌ చేసుకుంటే 7శాతం వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తుంది. రెన్యువల్‌ చేసుకోకపోతే సర్కారు అందించే వడ్డీ రాయితీ వర్తించదు. సంవత్సరంలోపు రుణాలకు సున్నా వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఏడాది దాటితే 10 నుంచి 11శాతం వడ్డీ వర్తిస్తుంది. రెన్యువల్‌ చేయకపోతే లోన్‌ కెపాసిటీ కూడా తగ్గిపోతుం ది. లోన్‌ రెన్యువల్‌ చేసుకోకపోవడంతో నిజామాబాద్‌ జిల్లాలో సుమారు రూ.100 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది.

యాంత్రీకరణ...

సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలని నిర్ణయించాం. యాసంగిలో కొద్ది మందికైనా  అవగాహన కల్పించాలని భావిస్తున్నాం. యంత్రాల ద్వా రా వరి నాట్లు వేయాలంటే నారుమడుల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ట్రేలో పెంచాలి. టార్పాలిన్‌ వేసి మట్టిపై విత్తనాలు చల్లి ట్రే మాదిరిగా పెంచుతారు. నర్సరీ స్థాయిలో వర్క్‌ ఎక్కువగా ఉంటుంది. శాస్త్రీయంగా చేయాల్సి ఉంటుంది. యంత్రాల ద్వారా నాట్లు వేస్తే కూలీల కొరతను అధిగమించవచ్చు. 50శాతం ఖర్చు తగ్గుతుంది.  యాంత్రీకరణ ద్వారా నాటితే  చదరపు మీటరుకు 33 నుంచి 44 కుదుర్లుంటాయి. కూలీలతో నాటిస్తే 18 నుంచి 20 కుదుర్లు వస్తాయి. ఇందులో ఎరువులు సమానంగా మొక్కలకు చేరుతుంది. గాలి, వెలుతురు సులువుగా మొక్కకు అం దుతుంది. ఆరోగ్యంగా పంట ఎదుగుతుంది. ఉత్పత్తి పెరుగుతుంది. వరి కోసిన గడ్డిని తగులబెట్టకూడదు. భూమిలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. పొలంలో బ్యాక్టీరియా లేకపోవడంతో ఫెర్టిలైజర్‌పై ఆధారపడాల్సి వస్తుంది. సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌ వేస్తే అది భూమిలోనే మురిగిపోయి అదే ఎరువుగా మారుతుంది. రైతు ఎట్టి పరిస్థితిలో అగ్గి పెట్టకూడదు.

వారంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి...

వానకాలంలో ఇబ్బందులు లేకుండా ధాన్యం కొ నుగోళ్లు జరుగుతున్నాయి. కడ్తా అనే మాట లేకుండానే ధాన్యం సేకరిస్తున్నాం.  4లక్షల 49వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని గురువారం వరకు కొనుగోలు చేశాం. ఇందులో 2.46 లక్షల మెట్రిక్‌ టన్నులు సన్నాలు, 2.02 లక్షల మెట్రిక్‌ టన్నులు దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించాం. నిజామాబాద్‌ జిల్లాలో 445 సెంటర్లు ప్రారంభించగా ఇప్పటికే కొనుగోళ్లు పూర్తి కావడంతో 12 సెంటర్లు మూ సేశాం. నాలుగైదు రోజుల్లో 300 సెంటర్లు మూసేయ్యబోతున్నాం. వారం రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. రైతు నుంచి ధాన్యం సేకరించిన తర్వాత మూడు రోజుల్లో మొత్తం చెల్లింపులు పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసాం. రోజుకు రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు చెల్లింపులు చకచక జరుగుతున్నాయి.logo