శనివారం 23 జనవరి 2021
Nizamabad - Nov 27, 2020 , 00:43:45

ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలి

ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలి

  • యంత్రసాగుపై అవగాహన సదస్సులో కలెక్టర్‌ నారాయణరెడ్డి 

ఇందూర్‌ : పంటల సాగులో యంత్రాలను వినియోగించి ఖర్చు తగ్గించుకోవడంతోపాటు దిగుబడిని పెంచుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. గురువారం తన చాంబర్‌లో యంత్రసాగుపై జిల్లాస్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. పంటల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు అవలంబించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వ్యవసాయాధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు, శాస్త్రవేత్తలతో చర్చించారు. ముందుముందు కూలీల సమస్యను అదిగమించేందుకు యంత్రాల అవసరాన్ని గుర్తుచేశారు. పలు కంపెనీలు తయారు చేసే యంత్రాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. యంత్రాల వినియోగం పెరిగేలా రైతులకు రుణాలు ఇప్పిస్తామన్నారు. నాణ్యమైన పంట, దిగుబడిని పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, క్రిమిసంహారక, రసాయన ఎరువుల వినియోగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఏవో గోవింద్‌, శాస్త్రవేత్తలు బాలాజీనాయక్‌, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

‘సఖీ’ కేసులను త్వరగా పరిష్కరించాలి..

సఖీ సెంటర్‌కు వచ్చే కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి సఖీ వన్‌స్టాప్‌ సెంటర్‌ కమిటీ సమావేశాన్ని గురువారం  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 డిసెంబర్‌ 1 నుంచి 2020 అక్టోబర్‌ వరకు 1134 కేసులు వచ్చాయని తెలిపారు. డొమెస్టిక్‌ వయోలెన్స్‌పై 733 కేసులు, లైంగికదాడి 16, లైంగిక వేధింపులు 5, మైనర్లపై లైంగిక దాడులు 34, మిస్సింగ్‌ 37, సైబర్‌ క్రైమ్‌ 43, వరకట్న వేధింపు కేసులు 201తోపాటు 64 ఇతర కేసులు నమోదయ్యాయని వివరించారు. ఇందులో కొన్ని కేసులు వివిధ దశల్లో ప్రాసెస్‌లో ఉన్నట్లు చెప్పారు. పోలీసు శాఖ నుంచి వచ్చిన నివేదికలకు అనుగుణంగా బాధితులకు వెంటనే నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. సఖీ సెంటర్‌ నుంచి వచ్చిన కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కోర్టులో ఫైల్‌ అయిన కేసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశం ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీడీఎస్‌ పీడీ ఝాన్సీ, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, డీఎంహెచ్‌వో, పోలీసు శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


logo