శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Nov 27, 2020 , 00:30:09

అనుమతులు సులభతరం..

అనుమతులు సులభతరం..

బోధన్‌: భవన నిర్మాణ అనుమతుల్లో రాష్ట్ర ప్రభు త్వం విప్లవాత్మకమైన విధానాన్ని తీసుకువచ్చింది. ఆ విధానమే ‘తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ అనుమతి స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (టీఎస్‌ బీపాస్‌). గత నెలలో అసెంబ్లీ ఆమోదం పొంది ఇపుడు చట్టంగా అమల్లోకి రావడంతో నగర, పట్టణ ప్రజ ల్లో హర్షం వ్యక్తమవుతున్నది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారు అనుమతి కోసం నెలల తరబడి మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఈ విప్లవాత్మక టీఎస్‌ బీపాస్‌తో తప్పింది. ఇప్పటివరకు మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో భవనాల నిర్మాణాలకు అనుమతులు పొందే ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా ఉండడంతో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేది కాదు. బిల్డింగ్‌ పర్మిషన్‌ పొందాలంటే పైరవీకారులను ఆశ్రయించాల్సిందే.. ఇదే అదనుగా బిల్డింగ్‌ పర్మిషన్ల కోసం అధికారులు సైతం సామాన్య ప్రజల్ని ముప్పుతిప్ప లు పెట్టేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన టీఎస్‌ బీపాస్‌ ఈ అక్రమాలకు చెక్‌పెట్టనుంది. భవన నిర్మాణ అనుమతుల్లో గతంలో జాప్యానికి ఇకమీదట ఆస్కారం ఎంతమాత్రం ఉండదు. భవన నిర్మాణాలకు అనుమతులు నిర్ధిష్టకాలంలో త్వరితగతిన పొందేందుకు, పైరవీలకు ఏమాత్రం తావులేకుండా సామాన్యుడు సైతం సులువుగా బిల్డింగ్‌ పర్మిషన్లు పొందేలా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. టీఎస్‌ బీపాస్‌ అమలు నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని బోధన్‌, ఆర్మూర్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో ప్రారంభమైంది. ఈ విధానంలో అనుమతులు ఇచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నది. మున్సిపాలిటీలవారీగా టీఎస్‌ బీపాస్‌ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్‌లో పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూశాఖ నుంచి ప్రత్యేక అధికారులు ఉంటారు. మున్సిపాలిటీ పాలనా వ్యవస్థల్లో గత కొంతకాలంగా జరుగుతున్న సంస్కరణల్లో భాగం గా ప్రస్తుతం అమలుకానున్న టీఎస్‌ బీపాస్‌తో సొంత గూటి కోసం పరితపించే పేదలకు ఎంతో మేలు జరుగుతుండగా, ఇకమీదట అక్రమ నిర్మాణాలకు చోటులేకపోవడంతో మున్సిపాలిటీలకు ఆస్తిపన్నుల రూపంలో ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది.  

ఆన్‌లైన్‌లో.. స్వీయధ్రువీకరణతో.. 

టీఎస్‌ బీపాస్‌ ఒక సరళీకృత, ఏకీకృత విధానం.. ఈ సింగిల్‌విండో విధానంలో భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమతులు పొందవచ్చన్న మాట..ఇక్కడ భవన యజమాని సమర్పించే స్వీయ ధ్రువీకరణ పత్రం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉన్నది ఉన్నట్టు చూపించి, నిజాయితీగా సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ ఇచ్చి భవన నిర్మాణం అనుమతు లు పొందవచ్చు. అన్ని రకాల భవనాల అనుమతులకు మున్సిపాలిటీ కార్యాలయాలకు వెళ్లనవసరం లేకుండానే.. ఆన్‌లైన్‌లో ఇంటి  నుంచే పొందే సౌలభ్యం ఉండడం.. టీఎస్‌ బీపాస్‌ ప్రత్యేకత.

75 గజాల్లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలంటే కేవలం రిజిస్ట్రేషన్‌ పత్రాలు సమర్పించి.. నిర్మాణాలు మొదలు పెట్టుకోవచ్చు. ఒక ప్లాట్‌లో స్థలం అభివృద్ధికి అనుమతి, ఎల్‌వోసీ కోసం ఒకే కామన్‌ దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉంది. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని టీఎస్‌ బీపాస్‌ కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లోనే అనుమతులను మంజూరుచేస్తుంది. 

మూడు కేటగిరీల్లో అనుమతులు: 

టీఎస్‌ బీపాస్‌ విధానంలో భవనాల నిర్మాణ అనుమతులను మూడు కేటగిరీలుగా విభజించారు. 75 గజాలలోపు స్థలంలో నిర్మాణాల కోసం నివాసప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలతో ఆన్‌లైన్‌ చేసుకోవాలి. ఆ ప్లాట్‌లో నిర్మించే భవనం ఎత్తు 7 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుందని ఆన్‌లైన్‌లో స్వీయధ్రువీకరణపత్రం సమర్పిస్తే చాలు.. అనుమతి పత్రం లభించినట్టే లెక్క. ఇక్కడ రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ అప్‌లోడ్‌ చేస్తే.. ఇక అనుమతి లభించినట్టు భావించి అనుమతి పత్రం కోసం ఎదురుచూడాల్సిన అవసరంలేదు. 

598 గజాల వరకు పది మీటర్ల ఎత్తులో ఉండే భవనాలకు (జీ ప్లస్‌ 2) ఇదే విధంగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌తో అనుమతులు పొందవచ్చు. అయితే, ఈ భవనాల నిర్మాణం పొందిన తర్వాత ఆక్యూపెన్సీ సర్టిఫికెట్‌ను పొందాల్సి ఉంటుంది. ఇక, 598 గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం, జీ ప్లస్‌ 2 కం టే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలోనూ, నివాసేతర భవనాలకు సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు ఇస్తారు. ఎన్‌వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరంలేదు. దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో అనుమతులు ఇస్తారు. ఒకవేళ అనుమతులు ఇవ్వకపోతే.. 22వ రోజున డీమ్డ్‌ అఫ్రూవల్‌ ప్రకారం అనుమతి లభించినట్లుగానే సర్టిఫికెట్‌ను పొందవచ్చు. ఇదే విధంగా, ఆయా స్థలాల కొలతల ప్రకారం బిల్డింగ్‌ పర్మిషన్లను సులభతరంగా పొందే అవకాశం టీఎస్‌ బీపాస్‌తో కలగనుంది. 

ఉల్లంఘనలు జరిగితే.. కూల్చివేత..

టీఎస్‌ బీపాస్‌ కోసం తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చినట్టు తేలితే సదరు భవనాల నిర్మాణాలను ఆపడమో.. అప్పటికే నిర్మాణం పూర్తయితే కూల్చివేయడమో జరుగుతుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ చర్యలకు ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వరు. అయితే, వాస్తవాలతో స్వీయ ధ్రువీకరణపత్రం ఇచ్చేవారికి ఎంతో మేలు జరుగుతుంది. చట్టంలో ఇటువంటి కఠిన నిబంధన ఉండడంతో ఇకపై అక్రమాలకు తావుండదని, అనుమతుల మే రకు భవన నిర్మాణాలు జరిగే అవకాశం ఉండడంతో అక్రమ నిర్మాణాలకు చెక్‌పడుతుందని పలువురు అంటున్నారు.  

ఇంటి అనుమతులు ఇక సులభతరం

ఇంతవరకు భవన నిర్మాణాలకు అనుమతులు పొందడంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు టీఎస్‌ బీపాస్‌ విధానంలో తొలగిపోతాయి. ఇకమీదట పట్టణ ప్రజలు ఇంటి నిర్మాణాల అనుమతులు సులభంగా పొందవచ్చు. మున్సిపల్‌ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే.. స్వీయ ధ్రువీకరణతో భవన నిర్మాణాల అనుమతులు తీసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో ఇటువంటి విప్లవాత్మక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం హర్షణీయం.. పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతకు టీఎస్‌ బీపాస్‌ ఎంతో దోహదం చేస్తుంది. 

- తూము పద్మశరత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, బోధన్‌ logo