టెన్షన్.. టెన్షన్..!

నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో అక్రమార్కులతో అంటకాగిన పోలీసుల తీరుపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతున్నది. ఇప్పటికే కామారెడ్డి పట్టణ సీఐ జగదీశ్‌తో పాటుగా మధ్యవర్తి సుజయ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ జగదీశ్ ఇచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ లక్ష్మీనారాయణ పాత్ర ఇందులో ఏమైనా ఉందా? అనే కోణం లో లోతుగా పరిశోధిస్తున్నారు. శుక్రవారం ఉదయం 9గంటల నుంచి మొదలైన ఏసీబీ సోదాలు వరుసగా శని, ఆదివారాల్లోనూ ఏకధాటిగా కొనసాగడంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు పోతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. డీఎస్పీ లక్ష్మీ నారాయణపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లుగా సమాచారం. సీఐ జగదీశ్‌ను విచారించిన క్రమంలో కీలకమైన విషయాలను ఏసీబీ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వ్యవహారంతో పాటుగా ఇతర లావాదేవీలు, కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులకు గురి చేసిన ఆనవాళ్లు వెల్లడి కావడంతో వాటిపైనా ఏసీబీ అధికారులు లోతుగా ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల్లో కలవరం..
ఐపీఎల్ వ్యవహారం కేవలం కామారెడ్డి పట్టణానికే పరిమితం కాలేదు. సెప్టెంబర్ రెండో వారంలో మొదలైన ఐపీఎల్ సీజన్ 13 ఏకంగా నవంబర్ 10వ తారీఖు వరకు సాగింది. సుమారు రెండు నెలల కాలంలో బె ట్టింగ్ రాయుళ్లతో పోలీసులు జోరుగా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు అధికారుల పేర్లు సైతం బయటికి పొక్కినట్లుగా తెలుస్తోంది. ఐపీఎల్ బెట్టింగ్ డీల్‌లో మధ్యవర్తిగా వ్యవహరించిన సుజయ్ అనే వ్యక్తి ఇతర చోట్ల జోరుగా నడిచిన బెట్టింగ్‌కు సంబంధించిన వ్యవహారాలను ఏసీబీ అధికారులకు పూస గుచ్చినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇతర ప్రాంతాల్లోనూ బెట్టింగ్‌కు సంబంధించిన విచారణ సాగుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగరంలోనూ పోలీసుల అండదండలతో జోరుగా బెట్టింగ్ నడిచినట్లుగా ఏసీబీకి సమాచారం ఉండడంతో పోలీసుల్లో కలవరం మొదలైంది. బెట్టింగ్ ముఠాలతో అంటకాగిన పోలీసులు తమకేమీ తెల్వదన్నట్లుగా గప్ చుప్ అయిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా కామారెడ్డి పట్టణ, రూరల్ ఏరియాలోని ఠాణాల్లోని పోలీసులు మూడు రోజులుగా తమ వ్యక్తిగత మొబైల్ నంబర్లతో పాటుగా ప్రభుత్వ మొబైల్ నంబర్లను స్విచ్ఛాఫ్ పెట్టుకోవడం గమనార్హం. కేవలం వైర్లెస్ నెట్వర్క్ ద్వారానే కమ్యూనికేషన్‌ను పాస్ చేసుకుంటున్నారు.
ఫిర్యాదుల వెల్లువ..
ఉమ్మడి జిల్లాలో పోలీస్ అధికారుల తీరుపై ఏసీబీకి కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నట్లుగా తెలుస్తున్నది. కేవలం 37 రోజుల కాల వ్యవధిలోనే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ముగ్గురు సీఐలు ఏసీబీ వలలో చిక్కడంతో ప్రజల్లోనూ తీవ్రంగా చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఎక్కడ చూసి నా... అవినీతి పోలీస్ అధికారుల తీరుపైనే చర్చించుకుంటున్నారు. ఏసీబీకి సమాచారం ఇచ్చి పట్టివ్వాలనే ఆలోచనతో ప్రజలు మల్లగుల్లాలు పడుతున్నారు. కామారెడ్డిలో సీఐ జగదీశ్ బాగోతం బట్టబయలు కావడంతో ఈ వ్యవహారంలో డీఎస్పీ విచారణ ఎదుర్కొంటుండడంతో పలువురు బాధితులు ఏసీబీ డీఎస్పీకి, ఏసీబీ డీజీ పూర్ణచందర్ రావుకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆధారాలతో సహా పలువురు బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఏసీబీ అధికారులను సంప్రదించినట్లుగా తెలుస్తున్నది.
ఆ ముగ్గురూ ఒకే బ్యాచ్...
కేవలం నెల రోజుల సమయంలోనే ఏసీబీకి చిక్కిన ముగ్గురు సీఐల వ్యవహారంలో కొత్త కోణం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్టోబర్ 13న రూ.10వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా ఏసీబీకి చిక్కిన సీఐ టాటాబాబు, అక్టోబర్ 31న రూ.50వేలు, విలువైన మొబైల్ ఫోన్‌తో పట్టుబడిన బోధన్ సీఐ పల్లె రాకేశ్ గౌడ్, నవంబర్ 20న ఐపీఎల్ బెట్టింగ్ గ్యాంగ్‌తో రూ.1.30లక్షలు తీసుకున్న వ్యవహారంలో అరెస్టయిన కామారెడ్డి సీఐ జగదీశ్ ఒకే బ్యాచ్‌కు చెందినవారీగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎస్సైలుగా 2007లో రిక్రూ ట్ అయ్యారు. ఒకేసారి వీరికి సీఐగా ప్రమోషన్ సైతం వచ్చినట్లు సమాచారం. ఈ ముగ్గురు సీఐలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువ కాలం పని చేశారు. కేవలం రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు విధి నిర్వహణలో అడ్డదారులు తొక్కుతూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడడంతో పోలీసుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతున్నది.
తాజావార్తలు
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
- ధరణి’లో ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు
- సమంత బాటలో కాజల్..ఇద్దరూ ఇద్దరే..!
- ఏపీలో కొత్తగా 137 కొవిడ్ కేసులు
- హెచ్-1బీపై ట్రంప్.. జో బైడెన్ వైఖరి ఒకటేనా?!
- నరేంద్ర చంచల్ మృతి.. ప్రధాని సంతాపం
- గంటవ్యవధిలో భార్యాభర్తల ఆత్మహత్య..