గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Nov 22, 2020 , 02:57:12

పకడ్బందీగా ఓటరునమోదు

పకడ్బందీగా ఓటరునమోదు

పోలింగ్‌ బూత్‌లను పరిశీలించిన కలెక్టర్‌, అధికారులు

ఇందూర్‌/నిజామాబాద్‌ రూరల్‌/రుద్రూర్‌ (వర్ని)/సిరికొండ/ఇందల్వాయి: ప్రత్యేక ఓటరు నమోదులో భాగంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శని, ఆదివారం రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్‌ నారాయణరెడ్డి నగరంలోని శంకర్‌భవన్‌ చైతన్యపబ్లిక్‌ స్కూల్‌లో పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని, మరణించిన, స్థానికంగా లేనివారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటే తొలగించాలన్నారు. కొత్తగా వచ్చిన వారుఉంటే వారి వివరాలను నమోదు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అన్ని వివరాలను రిజిస్ట్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. బూత్‌లెవల్‌ అధికారులు, సిబ్బంది ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 8 నుంచి అందుబాటులో ఉండాలన్నారు. అందుబాటులో లేనివారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌ ఉన్నారు.

 నగర శివారులోని గూపన్‌పల్లిలో పోలింగ్‌బూత్‌ కేంద్రాలను ఆర్డీవో రవి సందర్శించారు. తప్పులు లేకుండా ఓటరుజాబితాలో పేర్లు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట స్థానిక కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, గిర్దావర్‌ భూపతిప్రభు, వీఆర్వో సంధ్యారాణి, ప్రసన్నరాణి, రాణి, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.

 బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని తహసీల్దార్లతో వర్ని మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి, డీఆర్డీవో శ్రీనివాస్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, బాన్సువాడ, నిజామాబాద్‌ జిల్లాలోని రుద్రూర్‌, వర్ని, కోటగిరి, చందూర్‌, మోస్రా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని తాటిపల్లి పోలింగ్‌ కేంద్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌ సందర్శించారు. ఇందల్వాయి మండలంలోని పోలింగ్‌ స్టేషన్లను తహసీల్దార్‌ రమేశ్‌ తనిఖీ చేశారు. మల్లాపూర్‌, లోలం, ఎల్లారెడ్డిపల్లి, అన్సాన్‌పల్లిలోని పోలింగ్‌ స్టేషన్లలో ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.