గురువారం 03 డిసెంబర్ 2020
Nizamabad - Nov 22, 2020 , 02:57:14

ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు పితృవియోగం

ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాకు పితృవియోగం

మాక్లూర్‌: నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి బి గాల కృష్ణమూర్తి గుప్తా మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందు తూ శనివారం మరణించారు. విష యం తెలుసుకున్న మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే బిగాలను పరామర్శించారు. మృతదేహాన్ని స్వగ్రామమైన జిల్లాలోని మాక్లూర్‌కు తరలించారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌, షకీల్‌, కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ, నిజామాబాద్‌ మేయర్‌ నీతూ కిరణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, రాష్ట్ర నాయకుడు పొతంగల్‌ కిషన్‌రావు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, రాష్ట్ర రైతు నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, మాజీ మేయర్‌ ఆకుల సుజాత, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పార్థివదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


బిగాలను ఓదార్చిన మంత్రి, ఎమ్మెల్యేలు

బిగాల కృష్ణమూర్తి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తన తండ్రి మృ తిని జీర్ణించుకోలేకపోతున్నానని, తమ కుటుంబానికి తీరని లోటు అంటూ ఎమ్మెల్యే బిగాల బోరున విలపించగా, మంత్రి వేములతోపాటు ఎమ్మెల్యే లు ఓదార్చారు. పలువురు నాయకులు కంటితడి పెట్టారు. కృష్ణమూర్తి గుప్తా మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామాభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేశారని గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు.

స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి

బాన్సువాడ: నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా తండ్రి కృష్ణమూర్తి గుప్తా మృతిపై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణమూర్తితో తనకు చాలా కాలంగా సాన్నిహిత్యం ఉన్నదని, మంచి మనస్సున్న ఆయన మరణం బాధాకరమని ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.