మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Nov 20, 2020 , 02:59:48

రైతుల ఖాతాల్లోకి..రూ.650 కోట్లు

రైతుల ఖాతాల్లోకి..రూ.650 కోట్లు

ఉమ్మడి జిల్లాలోజోరుగా ధాన్యం సేకరణ

పంట అమ్ముకున్న రైతులకు నిర్ణీత సమయంలోనే నగదు జమ

ఉభయ జిల్లాల్లో 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి

ప్రైవేటు వ్యక్తుల మోసాలకుచెక్‌ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

కనీస మద్దతుధర రూ.1888 చెల్లింపు 

ధాన్యం సేకరణలో మెరుగైన ఫలితాలు రాబడుతున్న ఉభయ జిల్లాలు 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ :   స్వరాష్ట్రంలో రైతులకు వెతలు లేకుండా పోయాయి. ఆరేండ్ల కాలంలో కర్షకుల కన్నీళ్లు దూరమయ్యాయి. స్వీయ పాలనలో రైతులకు పెద్ద పీట దక్కింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌, సాగు నీరు  ఇలా చెప్పుకుంటూ పోతే రాయితీ విత్తనాలు, ఎరువులు సకాలంలో అన్నదాతలకు చేరడంతో సాగు సంబురంలా సాగుతున్నది.  ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా మోకాలడ్డు పెడుతున్నప్పటికీ సీఎం కేసీఆర్‌ మాత్రం ధైర్యంగా అన్నదాతల మేలు కో సం ముందడుగు వేస్తున్నారు. గడిచిన ఆరేండ్లలో   రైతులు స్వేచ్ఛగా విపణిలో తమ పంట ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. దళారుల బారి నుంచి తప్పించుకుని కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 2020 యాసంగి సీజన్‌లో రూ.1500 కోట్లతో ధాన్యం సేకరించగా వానకాలం సీజన్‌ 2020లో కూడా అదే స్థాయిలో ధాన్యపు రాశులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేకరించిన ధాన్యానికి సుమారుగా రూ.650 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి.రాష్ట్రంలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు మెరుగైన ఫలితాలు సాధిస్తుండడం విశేషం.

ఆర్థిక కష్టాలను ఈదుకుంటూ...

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తుల కు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడి పోయే దుస్థి తి గతంలో చూశాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా  ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర దక్కే అవకాశం ఉన్నప్పటికీ రైతులను దళారులు మాయాజాలంలో చుట్టేసేవారు. రైతుల వద్ద తక్కువ ధరకు పంట దిగుబడులను కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే  మద్దతు ధరకు విక్రయించే మోసాలు కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో కోకొల్లలుగా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా పరిస్థితి మారిపోయింది. వ్యాపారులు, ఇతర మధ్యవర్తులు రైతుల పేరున ధాన్యాన్ని విక్రయించకుండా ఉం డేందుకు పకడ్బందీ చర్యలను సీఎం కేసీఆర్‌ అమ లు చేశారు. ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకాలను అనుసంధానం చేసి రైతు ఖాతాల్లోనే చెల్లింపులు జరిగేలా చూస్తున్నా రు. కేవలం 48 గంటల్లోనే రైతులు విక్రయించిన పంటకు  మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తున్నది. గరిష్ఠంగా నాలుగైదు రోజుల్లోపే నగదు రైతు చేతికి అందుతుండడం విశేషం. ఓ వైపు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి తరుముతున్న సమయంలోనూ రాష్ట్రంలో జోరుగా పంట కొనుగోళ్లు జరుపుతోంది. దేశమే విస్తూ పోయేలా యాసంగి పంటలు సేకరించిన మన రాష్ట్ర సర్కారు... అదే స్ఫూర్తితో వానకాలం పంటలను సైతం ఇబ్బందుల్లేకుండా సేకరిస్తుండడం విశేషం.

ధాన్యాగారమవుతున్న ఉమ్మడి జిల్లా...

వానకాలం పంటలంటే గతంలో ఎంతో నిర్లక్ష్యం. రైతుల్లోనూ ఎడతెగని నిరాశ. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు నీళ్లకు, కరెంట్‌ కటకటతో పంటలు వేయాలంటేనే భయం. అలాంటి దుస్థితి నుంచి   రాష్ట్రంలో సాగు రంగం పరుగులు పెడుతున్నది.  వాతావరణం అనుకూలిస్తుండడంతో గడిచిన మూడేండ్లుగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ధాన్యాగారమై విరాజిల్లుతున్నది. దీనికి తోడుగా సర్కారు తీసుకు వచ్చిన సాగు ఏర్పాట్లతో రాష్ట్రం అంతటా పచ్చని తోరణమై నిలుస్తున్నది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు సమృద్ధిగా సాగు నీళ్లను కలిగి ఉండడంతో రెండు పంటలు భళా అనిపించేలా సాగుతున్నాయి. గడిచిన వానకాలం సీజన్‌ మొత్తం విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలం, చెరువుల్లో నీళ్లు పుష్కలంగా చేరాయి. పంటల సాగు భారీగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీడు భూములే కనిపించకుండా పంటలు సాగయ్యాయి. తద్వారా ధాన్యపు రాశులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. 

ఇదీ లెక్కా...

నిజామాబాద్‌ జిల్లాలో 7లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలున్నాయి. ధాన్యం సేకరణ కోసం 445 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. 3లక్షల 52వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ సేకరించింది. వీటి విలువ సరాసరి రూ.665 కోట్లు గా ఉంది. ఇందులో బుధవారం నాటికి రైతుల ఖాతాల్లో రూ.336 కోట్లు జమ చేశారు. కామారెడ్డి జిల్లాలో 4లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అధికారుల అంచనాలున్నాయి. ఇందుకోసం 341 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా 338 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు 48వేల మంది రైతుల నుంచి సుమారుగా 2లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలు వరూ.375 కోట్లుగా ఉంది. ఇందులో 37,094 మంది రైతులకు రూ.278 కోట్లు చెల్లింపులు పూర్తి చేశారు. ఉభయ జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపుగా 6లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.వేయి కోట్లుగా ఉంది. రైతుల ఖాతాల్లో మద్ధతు ధర రూ.650 కోట్లు జమ చేయ డం విశేషం.

సాఫీగా ధాన్యం సేకరణ... 

నిజామాబాద్‌ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా జరుగుతోంది. జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశాల మేరకు వేగవంతంగా ప్రక్రియను చేపడుతున్నాము. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇప్పటి వరకు 418 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము. రైతుల చెంతకు మేమే వెళ్లి పంట ఉత్పత్తులను నిబంధనల మేరకు సేకరిస్తున్నాము.

 అభిషేక్‌,  నిజామాబాద్‌ జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ

రైతుల బ్యాంక్‌ అకౌంట్లో మద్దతు ధర జమ 

కామారెడ్డి జిల్లాలో 338 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు రూ.375 కోట్ల ధాన్యాన్ని సేకరించాము. రూ.1888 కనీస మద్దతు ధరను కల్పిస్తూ రైతుల బ్యాంక్‌ అకౌంట్లో 48 గంటల్లోనే నగదును జమ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్‌ 19 జాగ్రత్తలతో పాటుగా రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో ఏర్పాట్లు చేశాము.  

 జితేంద్ర ప్రసాద్‌, కామారెడ్డి జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల సంస్థ