శనివారం 23 జనవరి 2021
Nizamabad - Nov 19, 2020 , 01:12:33

వహ్వా.. అంకాపూర్‌

వహ్వా.. అంకాపూర్‌

సాగు పద్ధతులు భేష్‌

ఆధునిక వ్యవసాయం అద్భుతం

ఆదర్శంగా తీసుకొని ఆచరణలో పెడతాం..

సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి రైతుల వెల్లడి

అంకాపూర్‌లో వ్యవసాయ పాఠాలు

ఆర్మూర్‌ :

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని సీఎం కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి రైతులు, అధికారులు సీఎం సూచన మేరకు బుధవారం అంకాపూర్‌లో క్షేత్ర సందర్శనకు వచ్చారు. ఇక్కడి రైతులు అవలంబిస్తున్న సాగుపద్ధతులను ఆమూలాగ్రం అధ్యయనం చేశా రు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేయడం.. డ్రిప్‌ విధానంలో సాగు చేయడం.. పొలాల్లో నీటి నిల్వ కుండీలు ఏర్పాటు చేసుకొని అవసరమైనప్పుడు పంటలకు వాడుకోవడం.. వంటి పద్ధతులు వాసాలమర్రి రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పసుపు, ఎర్రజొన్న, కూరగాయలు, ఆకు కూరలు, పూల సాగులో అనుసరిస్తున్న మెళకువలను సవివరంగా అడిగి తెలుసుకున్నారు. సంకరజాతి పంటల సాగును పరిచయం చేసిన ఇక్కడి రైతుల నూతన ఒరవడిని వారు ప్రశంసించారు. గ్రామంలోని అన్ని కులాల వారు కలిసి సర్వసమాజ్‌గా ఏర్పాటై ఐకమత్యంతో ముందుకు వెళ్లడంపై అభినందించారు. అనంతరం పంట పొలాలకు అనువుగా వాహనాలు, కార్లు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న రోడ్లను, పంట భూములకు ఒడ్లు కూలకుండా రక్షణగా ఉండేందుకు ఏర్పాటు చేసిన బండరాళ్ల తెట్టెలను పరిశీలించారు. అంకాపూర్‌ గ్రామం కాదని పట్టణమని, అక్కడ అభివృద్ధిని మాటల్లో చెప్పలేమని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచించిన విధంగానే అంకాపూర్‌లో సాగు పద్ధతులు బాగున్నాయని చెప్పారు. క్రమశిక్షణ, పోటీతత్వం, అక్షరాస్యత అంకాపూర్‌ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించాయని సందర్శనకు వచ్చిన రైతులు పేర్కొన్నారు. కలిసిమెలిసి పోటీతత్వంతో పని చేయడమే అంకాపూర్‌ రైతుల విజయ రహస్యమని తెలుసుకున్నామని చెప్పారు. ఇక్కడి అభివృద్ధిని మాటల్లో చెప్పలేమని, ఇక్కడ నేర్చుకున్న ప్రతి అంశాన్ని ఆచరణలో పెడుతామని వాసాలమర్రి రైతులు స్పష్టం చేశారు. 

సాగు విధానం అద్భుతం

అంకాపూర్‌ రైతుల సాగు పద్ధతులు అద్భుతంగా ఉన్నాయని వాసాలమర్రి రైతులు తెలిపారు. ముందుగా అంకాపూర్‌లో వాసాలమర్రి గ్రామ రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడి రైతుల పట్టుదల, సాగు విధానాలు, సాగు పద్ధతులు, సమష్టితత్వం, మార్కెటింగ్‌ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు క్షేత్ర సందర్శన చేశారు. మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, సర్పంచ్‌ మచ్చర్ల పూజితారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, ఆర్మూర్‌ ఏడీఏ హరికృష్ణ, ఏఈవోలు వారి వెంట ఉన్నారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, వాసాలమర్రి సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ నవీన్‌, జక్రాన్‌పల్లి ఏవో దేవిక, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, భువనగిరి జిల్లా ఏవోలు దుర్గేశ్వరి, మాధవి, లావణ్య, నాగరాజు, యాదగిరిరావు, ఎజాజ్‌ఖాన్‌, ఏఈవో ఉమారాణి, 400 మంది సందర్శన రైతులు, అంకాపూర్‌ ఉపసర్పంచ్‌ మచ్చర్ల కిశోర్‌రెడ్డి, ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి, మంగ్లారం మహేందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు దేవేందర్‌రెడ్డి, రైతు సంఘం కార్యదర్శి బాజన్న, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.  

కలుపు మొక్కల నివారణ బాగుంది 

పంట పొలాల్లో కలుపు మొక్కల నివారణకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. ఎక్కడా కలుపు మొక్కలు కనబడ్తలేవు. కలుపు నివారణ చేపడితినే పంటకు ఎరువులు బాగా అందుతాయన్న ఉద్దేశంతో ఇక్కడి రైతులు కలుపు నివారణ పక్కాగా చేపడుతుండ్రు. కలుపు నివారణపై మా గ్రామ రైతులకు సైతం అవగాహన కల్పిస్తాం.

మెరుగు శోభ, రైతు, వాసాలమర్రి 

బంతిపూల సాగు బాగుంది

ఇక్కడి రైతులు బంతి పూల సాగు విధానం బాగుంది. తోటలోని పూలకు చీడపీడలు వ్యాపించకుండా విరబూయడం చూస్తే సంతోషంగా అనిపించింది. రైతును అడిగి పెట్టుబడి, దిగుబడి, ఆదాయం ఎంత వస్తుందనే వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాం. రానున్న రోజుల్లో మా గ్రామంలో సైతం బంతిపూల సాగు చేపడతాం.

పి.ఉమారాణి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్‌, భువనగిరి

మా గ్రామంలోనూ చేపడుతాం..

సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, ఎంపీటీసీ, అధికారులతో చర్చించి మా ఊరు వాసాలమర్రిలో సైతం అంకాపూర్‌ అభివృద్ధి ప్రణాళికను చేపడుతాం. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు మా దగ్గర సైతం జరిగేలా ప్రయత్నిస్తాం. ఇక్కడి రైతులు పోటీతత్వం, సమష్టి కృషితోనే అధిక దిగుబడులు సాధించి సక్సెస్‌ అయినట్లు తెలుస్తోంది. 

పి.కృష్ణ, రైతు, వాసాలమర్రి

పనికి తగ్గ ఫలితం

అంకాపూర్‌ గ్రామాభివృద్ధి వెనుక గ్రామస్తుల కృషి ఎంతో ఉంది. గ్రామస్తులు, రైతులకు పడ్డ కష్టానికి ఫలితం కళ్ల ముందు కనిపిస్తున్నది. వారు కష్టానికి వెరువకుండా క్రమశిక్షణ, పోటీతత్వంతో పనులను చక్కగా చేపడుతున్నరు. 

పి.నవీన్‌, ఎంపీటీసీ వాసాలమర్రి 

అంతర పంటల సాగు భేష్‌

అంతర పంటల సాగు విధానం బాగుంది. మా జిల్లాలో రైతులు వరి, మక్కజొన్న, జొన్న పంటలను మాత్రమే పండిస్తున్నారు. ఇక్కడి రైతులు మాత్రం ఒకే పంట క్షేత్రంలో వివిధ రకాల అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఒక పంటకు ధర రాకున్నా మరో పంటకు వచ్చే ధరతో రైతులు లాభాలు పొందుతున్నారు. 

లావణ్య, ఏవో, ఆలేరు

అభివృద్ధి మంచిగుంది..

సీఎం కేసీఆర్‌ సార్‌ సూచించినట్లే అంకాపూర్‌ గ్రామాభివృద్ధి మంచిగుంది. గ్రామస్తులు, రైతులు ఒకే మాట మీద ముందుకు సాగుతున్నారు. అభివృద్ధిని సాధించేందుకు ఐకమత్యంతో, సమష్టితత్వంతో పని చేస్తున్నారు. అంకాపూర్‌ గ్రామంలో ఒక పట్టణాన్ని తలపించేలా అత్యాధునిక భవంతులున్నాయి.

-ఆంజనేయులు, సర్పంచ్‌ వాసాలమర్రి


logo