శుక్రవారం 15 జనవరి 2021
Nizamabad - Nov 18, 2020 , 01:59:57

ఆర్టీసీలో ఆనందం..

ఆర్టీసీలో ఆనందం..

కోత విధించిన వేతనాల చెల్లింపుపై హర్షం 

లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా కార్మికులకు జీతాలను చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో టీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ఆర్టీసీ ఆదాయం పూర్తిగా పడిపోయింది. కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. రెండు నెలల పాటు కార్మికుల వేతనాల్లో 50 శాతం కోత విధించారు. ఆ డబ్బులను ప్రస్తుతం చెల్లించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయడంతో కార్మికుల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. సంస్థను, తమను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.  

అడుగక ముందే ఇస్తుండు.. 

ఆర్మూర్‌: ఆర్టీసీ ఉద్యోగులమైనా మాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగక ముందే అన్ని ఇస్తున్నడు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కోత విధించిన జీతాలను ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీకి ఎల్లప్పుడూ అండగా భద్రత కల్పిస్తున్నారు. కష్టకాలంలో ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలని సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలతో కార్మికులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటారు. 

- ధర్మరాజు, కంట్రోలర్‌, ఆర్మూర్‌ డిపో. 

చాలా ఆనందంగా ఉంది.. 

ఆర్మూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం ఎంతగానో పనిచేస్తున్నది. కరోనా సమయంలో కోత విధించిన సగం వేతనం ఇప్పుడు చెల్లిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. కరోనా కాలంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేతనాలు రావడంతో కొంత ఊరట లభిస్తున్నది. మేము అడుగక ముందే కోత విధించిన జీతాలు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. 

- మంజుల, కండక్టర్‌, ఆర్మూర్‌ డిపో 

ఆర్టీసీ బలోపేతానికి కేసీఆర్‌ కృషి.. 

విద్యానగర్‌: కరోనా సమయంలో ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంతి కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాట పట్టనుంది. గతంలో ఆర్టీసీని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. కేసీఆర్‌ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం సంస్థకు, ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతున్నది. 

- సాయిలు, కండక్టర్‌, కామారెడ్డి డిపో

సేవలకు గుర్తింపు లభించింది..

శక్కర్‌నగర్‌: కరోనా కష్టకాలంలో ఆర్టీసీని ఆదుకోవాలని, తమను తాము కాపాడుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించిన విధులకు తగిన గుర్తింపు లభించింది. మా సేవలను గుర్తించి సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన హర్షణీయం. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదని సీఎం స్పష్టమైన హామీని ఇవ్వడం మాకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా అదనపు విధులను నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. 

- సంజీవ్‌రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగి, కార్మిక నాయకుడు 

సీఎం నిర్ణయాలతో మంచి రోజులు.. 

విద్యానగర్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు మంచిరోజులు వస్తున్నాయి. గతంలో సంస్థలో పనిచేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉండేది. కరోనా సమయంలో రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మహిళా ఉద్యోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కేసీఆర్‌ నిజంగా మహావ్యక్తి. డే డ్యూటీలే కాకుండా వారి కోసం ప్రత్యేక వసతులు కల్పించిన గొప్ప వ్యక్తి కేసీఆర్‌. 

- సూర్యకళ, కండక్టర్‌, కామారెడ్డి డిపో 

సంస్థను ఆదుకోవడం హర్షణీయం 

విద్యానగర్‌: కరోనా కాలంలో విధించిన లాక్‌డౌన్‌ నుంచి ఆర్టీసీ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. బస్సులను తిరిగి రోడ్లపై తిప్పుతున్న ప్రయాణికులు ఇంతకు ముందు మాదిరిగా బస్సుల్లో ప్రయాణించడం లేదు. దీంతో ఆర్టీసీకి ఆదాయం తగ్గింది. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఆర్టీసీకి, కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వానికి కార్మికులందరం రుణపడి ఉంటాం. 

- రాజేశ్‌, కండక్టర్‌, కామారెడ్డి డిపో