మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Nov 18, 2020 , 01:59:54

24 గంటల కరెంటు ఇస్తున్న ధీశాలి కేసీఆర్‌

24 గంటల కరెంటు ఇస్తున్న ధీశాలి కేసీఆర్‌

ఎస్సారెస్పీ పునరుజ్జీవం లాంటి పథకం దేశంలో ఎక్కడాలేదు

సీఎం సహకారంతో  సాధించిన మంత్రి వేముల

సురేందర్‌ రెడ్డి బతికుంటే రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడయ్యేవారు

రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన తండ్రి సురేందర్‌రెడ్డి స్మారకార్థం వేల్పూర్‌లో నిర్మించిన రైతువేదిక ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుకగాసాగింది.  మంగళవారం  నిర్వహించిన కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  మంత్రులతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథులకు డప్పువాయిద్యాలు, మంగళహారతులతో  ఘనస్వాగతం పలికారు. కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొన్నది. రైతు వేదికతోపాటు పల్లె ప్రకృతివనం, స్మృతివనం, కళా వేదికను ప్రారంభించారు. సాగునీటిరంగ అభివృద్ధికి అద్దంపట్టేలా రైతువేదిక గోడలపై వేసిన చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులు మాట్లాడుతూ..

 దివంగత సురేందర్‌రెడ్డి రైతు నాయకుడిగా చేసిన సేవలను, ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

వేల్పూర్‌ / కమ్మర్‌పల్లి : రైతుల నుంచి పైసా వసూలు చేయకుండా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్న ధీశాలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన తండ్రి దివంగత రైతు నేత వేముల సురేందర్‌ రెడ్డి స్మారకార్థం రూ.25 లక్షల తన సొంత ఖర్చులతో స్వగ్రామం వేల్పూర్‌ మండల కేంద్రంలో నిర్మించిన రైతు వేదిక భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తండ్రి సురేందర్‌ రెడ్డితో తనకు అనుబంధం ఉందన్నారు. సురేందర్‌ రెడ్డి బతికుంటే రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండే వారని అనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఇప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలపై చర్చ వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌ సురేందర్‌ రెడ్డిని తలుచుకుంటారని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం లాంటిది దేశంలోనే ఎక్కడా లేదన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎదురెక్కించే అవకాశాలను కేసీఆర్‌కు వివరించడంతో పునరుజ్జీవం పథకాన్ని సీఎం రచించారన్నారు. ఏటా రూ.10 వేల కోట్లు వెచ్చించి వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్నారని తెలిపారు. కాలువల వెంట అనధికార బోరు బావులను తీసి వేయకూడదని, నీరు లేనప్పుడు బోరు పెట్టుకోవడం రైతు హక్కుగా టీఆర్‌ఎస్‌ సర్కారు భావించిందన్నారు. రైతు కష్టాలు తీరాలని కేసీఆర్‌కు ఉన్న తపనకు ఇది నిదర్శనమన్నారు. కరోనా విపత్తు వేళ రైతుకు అండగా నిలవాలని తలచి ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదన్నారు. గుంట భూమి ఉన్నా రైతు దురదృష్ట వశాత్తు చనిపోతే వారంలోనే రూ.5 లక్షల బీమా డబ్బులు కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు. పంట పెట్టుబడి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. నష్టం వస్తుందని తెలిసినా రూ.2500 ధరతో తెల్ల జొన్నలు కొన్న ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రాష్ట్రంలో రూ.550 కోట్లతో 2,604 రైతు వేదిక భవనాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన తండ్రి స్మారకార్థం రైతులకు ఉపయోగపడే రైతు వేదిక భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 

రైతువేదిక, స్మృతివనం ప్రారంభం

వేల్పూర్‌: రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన తండ్రి, దివంగత రైతు నేత వేముల సురేందర్‌రెడ్డి స్మారకార్థం స్వగ్రామం వేల్పూర్‌లో రూ.25 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనాన్ని, స్మృతివనాన్ని మంగళవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంత్రి వేముల అందించిన రూ.10 లక్షలతో వేల్పూర్‌లో పల్లె ప్రకృతి వనం, వైకంఠధామంలో పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కళా వేదికను ఏర్పాటు చేశారు. వీటిని మంత్రులు ప్రారంభించారు. స్మృతివనం ప్రారంభం సందర్భంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి కంటతడిపెట్టారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ నగర మేయర్‌ నీతూ కిరణ్‌, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ మార గంగారెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కుంట రమేశ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షురాలు మలావత్‌ మంజుల, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకుడు కొత్తూర్‌ లక్ష్మారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు జైడి నాగధర్‌, వేల్పూర్‌ ఎంపీపీ బీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, సర్పంచ్‌ తీగల రాధ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్‌ మోహన్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ బోదెపల్లి సురేశ్‌, ఎంపీటీసీ మొండి మహేశ్‌, ఉప సర్పంచ్‌ పిట్ల సత్యం, టీఆర్‌ఎస్‌ నాయకులు సామ మహిపాల్‌, ఏలేటి మోహన్‌, సామ మహేందర్‌, వెంకటేశ్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

సురేందర్‌ రెడ్డికి మంత్రుల ఘన నివాళి

దివంగత వేముల సురేందర్‌రెడ్డికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. వేల్పూర్‌ ఎక్స్‌రోడ్డు వద్ద సురేందర్‌ రెడ్డి విగ్రహానికి మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పూలమాల వేశారు. అనంతరం సురేందర్‌ రెడ్డి ఘాట్‌ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

అతిథులకు ఘనస్వాగతం..

వేల్పూర్‌ : రైతువేదిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాలకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రోడ్లు-భవనాలు, హౌసింగ్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు రైతులు ఘన స్వాగతం పలికారు. సభకు హాజరైన రైతులందరూ ఆకు పచ్చ కండువాలు వేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమానికి హాజరైన అతిథులకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పచ్చ కండువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. మంత్రులు నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డికి  రైతులు నాగలిని బహూకరించి గజమాలతో సన్మానించారు.

సురేందర్‌ రెడ్డి తోడ్పాటు మరువలేను : గంప గోవర్ధన్‌

వేముల సురేందర్‌ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు అందించిన తోడ్పాటు మరువలేనని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. ఆయన అందించిన సలహాలు, సూచనలు, క్రమ శిక్షణే తనను ఈ స్థాయిలో ఉండడానికి దోహదపడ్డాయని తెలిపారు. మంత్రి తన తండ్రి స్మారకార్థం సొంత ఖర్చులతో నిర్మించిన రైతు వేదిక భవన ప్రారంభానికి తనను ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో మిగతా 28 రాష్ర్టాల్లో లేని అభివృద్ధి, సంక్షేమ  కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. బాల్కొండ, ఆర్మూర్‌ ప్రాంత రైతులు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.

క్రీడాకారుడిగా గుర్తుండి పోతారు : బీబీ పాటిల్‌

వేముల సురేందర్‌ రెడ్డి మంచి క్రీడాకారుడని, ఎంత వయసు వచ్చినా క్రీడలు అంటే యువకుడిగా మారి పోయే వారని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. తనతో కలిసి తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ తరఫున ఆడారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు రైతులంటే మక్కువని తెలిపారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నదని తెలిపారు. 

మారీచులు బండి సంజయ్‌, అర్వింద్‌ : బాజిరెడ్డి

లోక కల్యాణార్థం యజ్ఞాలు నిర్వహిస్తుంటే వాటికి భగ్నాలు తలపెట్టిన రాక్షసుల వంటి వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అర్వింద్‌ అని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. తనపై నిరాధార విమర్శలు చేస్తే పరువు నష్టం దావా వేస్తానన్నారు. పసుపు బోర్డు తెస్తానని మోసం చేశావేంటని రైతులు అడిగితే కొత్త నాటకం మొదలు పెట్టాడని విమర్శించారు. దుబ్బాక ఎన్నికల్లో అబద్ధాలతో మోసం చేసి గెలిచారని ఆరోపించారు. మంచి ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలని కోరారు.

కేసీఆర్‌ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నట్లే : షిండే

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ ప్రీతిపాత్రుడుగా ఉండడం బాల్కొండ నియోజకవర్గ ప్రజల అదృష్టమని జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే అన్నారు. దీంతో కేసీఆర్‌ బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నట్లేనన్నారు. తల్లిదండ్రులను మర్చిపోతున్న ఈ రోజుల్లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన తండ్రి సురేందర్‌ రెడ్డి స్మారకార్థం రైతు వేదిక నిర్మించడం హర్షణీయమన్నారు. 

అర్ధ రాత్రి ఫోన్‌ చేసినా స్పందిస్తున్న మంత్రి :  షకీల్‌

బోధన్‌ నియోజకవర్గంలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, తదితర సమస్యలపై అర్ధ రాత్రి ఫోన్‌ చేసినా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్పందించి పరిష్కరిస్తున్నారని బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అన్నారు. కేసీఆర్‌ రైతు సైన్యాన్ని తయారు చేస్తున్నారన్నారు. ఆరు తడి పంటలకు గిట్టు బాటు ధర ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. 

సురేందర్‌ రెడ్డితో అనుబంధం .. : వీజీ గౌడ్‌ 

వేముల సురేందర్‌రెడ్డితో కలిసి పని చేసిన అనుబంధం మరువలేనిదని ఎమ్మెల్సీ వీజీగౌడ్‌ అన్నారు. రైతు సంక్షేమం కోసం జీవితాంతం ఆకాంక్షించిన ఆయన స్మారకార్థం తనయుడు, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి రైతు వేదిక నిర్మించడం తండ్రిపై తనకున్న ప్రేమకు నిదర్శనమన్నారు. రూ.1200 కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని తీసుకొచ్చి ఇక్కడి రైతుల సాగునీటి గోస తీర్చారని మంత్రిని కొనియాడారు.

తండ్రి లాగే రైతుల కోసం తపిస్తాడు : రాజేశ్వర్‌

మంత్రి ప్రశాంత్‌ రెడ్డి తన తండ్రి లాగే రైతుల బాగు కోసం పరితపిస్తాడని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌ అన్నారు. కేసీఆర్‌ సహకారంతో రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని చెక్‌డ్యాంలు బాల్కొండ నియోజకవర్గంలో నిర్మింపజేశాడన్నారు. తెలంగాణ వచ్చాక తొలి టిక్కెట్‌ ప్రశాంత్‌ రెడ్డికే ప్రకటించారని గుర్తు చేశారు.          -ఎమ్మెల్సీ రాజేశ్వర్‌

తండ్రికి తగ్గ తనయుడు : ఆకుల లలిత

రైతులకు సేవలు అందించడంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారని ఎమ్మెల్సీ ఆకుల లలిత అన్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా రైతులు 60 ఏండ్లుగా పడుతున్న అరి గోసను కేసీఆర్‌ దూరం చేశారన్నారు. తండ్రి సురేందర్‌ రెడ్డి స్మారకార్థం సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మించిన మంత్రిని రైతులు మరువబోరన్నారు.

రైతాంగానికి సరైన వేదిక  : కలెక్టర్‌ నారాయణరెడ్డి

రైతాంగ చైతన్యానికి రై తు వేదికలు ఉపయోగపడతాయని నిజామాబాద్‌  కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అన్నారు. జిల్లాలో 105 వేదికలకు గానూ 96 రైతు వేదికలు పూర్తయ్యాయని, మరో తొమ్మిదింటి పనులు పూర్తికావాల్సిన దశలో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతికత, తదితర అంశాలపై అవగాహన పెంచేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఆర్మూర్‌, బాల్కొండ ప్రాంత రైతులు రాష్ట్రంలో, దేశంలో ఆదర్శంగా  నిలుస్తున్నారన్నారు.


logo