శనివారం 16 జనవరి 2021
Nizamabad - Nov 17, 2020 , 00:11:07

ఆర్టీసీకి ఊపిరి..

ఆర్టీసీకి ఊపిరి..

వెన్నుదన్నుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

ప్రభుత్వరంగ సంస్థను బతికించుకునేందుకు చర్యలు

సీఎం ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం

ఇప్పటికే విజయవంతంగా అమలవుతున్న పార్సిల్‌ సేవలు

కరోనా కష్టకాలంలోనూ ఆర్టీసీకి అండగా రాష్ట్ర ప్రభుత్వం 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:

కరోనా కష్టకాలంలో అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌ సడలింపుతో మెల్లిగా ఒక్కోటి గాడిలో పడుతోంది. ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుంచి తేరుకుంటోంది. ఈ దశలోనే ప్రభుత్వరంగ సంస్థ ఆర్టీసీపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. భౌతికదూరం పాటించడంలో భాగంగా ప్రజలు బస్సు ఎక్కక పోవడం, లాక్‌డౌన్‌ సమయంలో బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడం వంటి కారణాలతో ఆదాయం లేక ఆర్టీసీ విలవిల్లాడింది. ఉద్యోగులు, కార్మికులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీకి వెన్నుదన్నుగా నిలిచారు. సరిగ్గా ఏడాది క్రితం ఆర్టీసీ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మెతో తీవ్రంగా నష్టపోయిన సంస్థను ఆదుకోగా, తాజాగా కరోనా కాటు నుంచి కోలుకునేలా సీఎం ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్‌ సమయంలో కోతకుగురైన జీతాల చెల్లింపునకు నిధులు మంజూరు చేయడంతోపాటు సంస్థ బలోపేతం కోసం కేసీఆర్‌ దృష్టి పెట్టడంతో ఆర్టీసీ కార్మికుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. మరోవైపు సమ్మె విరమణ కాలంలో సీఎం ఇచ్చిన వాగ్దానాలు ఒక్కోటి అమలవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ మహిళా సిబ్బంది అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విధుల కేటాయింపులు, సౌకర్యాల లేమితో నిత్యం ఇబ్బంది పడేవారు. సీఎం కేసీఆర్‌ చొరవతో మహిళలకు డిపోల్లో సకల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. డ్యూటీలు కల్పించడంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేశారు. రీజియన్‌లోని అన్ని డిపోల్లో ఆర్టీసీ మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక గది, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. రీజియన్‌లోని తొమ్మిది డిపోల్లో వీటిని ఏర్పాటు చేశారు. విధులకు వెళ్లే మహిళా కండక్టర్లు భోజనం, అల్పాహారం తీసుకునేలా, సమయం ఉంటే విశ్రాంతి తీసుకునేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ‘డ్రాప్‌ బాక్స్‌' ఏర్పాటు చేశారు. ఈ పెట్టెలో వేసే ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారు. ఆరోగ్యం, కుటుంబపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాసి ఈ బాక్సులో వేయాలి. ప్రతి రోజూ సాయంత్రం 6గంటలకు ఈ బాక్సు తెరిచి విన్నపాలను పరిశీలిస్తారు. వారం చివరి రోజున కమిటీ సభ్యులతో జరిగే సమావేశంలో వీటిని పరిశీలిస్తారు. అందులో పరిష్కరించే స్థాయిలో ఉన్న వాటిని డీఎం సమక్షంలో డిపో స్థాయిలోనే పరిష్కరిస్తారు. రీజియన్‌ స్థాయిలో ఉండే రీజియన్‌ మేనేజర్‌కు విన్నవిస్తారు. రాష్ట్ర స్థాయివి ఉంటే బస్‌ భవన్‌కు నివేదిస్తారు. 

డిపో నుంచి బస్‌ భవన్‌ దాకా సంక్షేమ కమిటీలు

ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏడాది క్రితం సమ్మె చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్మికులతో సమావేశమై సమస్యలపై చర్చించారు. ఆర్టీసీ డిపో స్థాయిలో సంక్షేమ బోర్డు కమిటీలు ఏర్పాటు చేయాలని, రీజియన్‌ స్థాయిలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని బస్‌ భవన్‌ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రతి వారం ఈ కమిటీ సమావేశమై డిపో పరిధిలో ఉన్న సమస్యలపై చర్చిస్తున్నారు. నిజామాబాద్‌ రీజియన్‌లో ఐదు డిపోలున్నాయి. వీటి మొత్తానికి ఒక రీజియన్‌ కమిటీని నెలకొల్పారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు ఉద్యోగులను ఎంపిక చేసి సంక్షేమ బోర్డులో సభ్యులుగా నియమించారు. డిపో మేనేజర్లు ఆ కమిటీకి ముఖ్య అధికారిగా వ్యవహరించనున్నారు. డీఎంలతోపాటు సభ్యులుగా నియమించిన ఇద్దరు ఉద్యోగులు, డిపో గ్యారేజ్‌ ఇన్‌చార్జి, ట్రాఫిక్‌ ఇన్‌చార్జి ఇలా ఐదుగురు ప్రతి వారం డిపోలో సమావేశమై డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌ల సమస్యలపై చర్చిస్తారు. ఆర్టీసీలో సంక్షేమ బోర్డు కమిటీ కీలకంగా మారనుంది. ఇందులో నిర్ణయించిన అంశాలకు ప్రాధాన్యం దక్కనుంది. ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగులకు విధులు కేటాయింపు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగోన్నతులు, సెలవులు తదితర అంశాలపై సమస్యలుంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా డిపో, సంస్థ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందించవచ్చు. లోటుపాట్లను గుర్తించి పరిష్కార మార్గాలు చూపొచ్చు. డిపోలో వారానికి ఒక రోజు, నెలకు నాలుగు రోజులు సమావేశాలు నిర్వహిస్తారు. రెండు నెలలకోసారి జోనల్‌ స్థాయిలో సమావేశం నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో మూడు నెలలకు ఒక సారి అన్ని ఫిర్యాదులపై సమీక్షలు నిర్వహించి పరిష్కారం చూపిస్తారు.

నిజామాబాద్‌ రీజియన్‌లో ఇలా...

ఉమ్మడి జిల్లా పరిధిని ఆర్టీసీ నిజామాబాద్‌ రీజియన్‌గా పరిగణిస్తున్నారు. ఇందులో మొత్తం ఐదు డిపోలున్నాయి. నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, కామారెడ్డి, బాన్సువాడ డిపోల ద్వారా నిత్యం వందలాది బస్సులు తిరుగుతున్నాయి. కరోనా కాలం నుంచి ప్రజారవాణా నెమ్మదించినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ప్రజలను గమ్యాలకు ఆర్టీసీ చేరుస్తోంది. తక్కువ చార్జీల్లోనే సుదూర ప్రాంతాలకు సురక్షితంగా ప్రయాణికులను చేరవేస్తూ కీలక భూమికను ఆర్టీసీ పోషిస్తోంది. నిజామాబాద్‌ రీజియన్‌లో 1098 బస్సులుండగా 4,809 మంది ఉద్యోగులు, కార్మికులు పని చేస్తున్నారు. అత్యధికంగా నిజామాబాద్‌ 1, 2 డిపోల్లో 650 బస్సులుండగా 2800 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాన్సువాడలో 106 బస్సులుండగా 490 మంది, కామారెడ్డిలో 140 బస్సులు, 603 మంది కార్మికులున్నారు. ఆర్మూర్‌లో 88 బస్సులు, 460 మంది కార్మికులున్నారు. బోధన్‌లో 114 బస్సులుండగా 450 మంది సిబ్బంది ప్రజా రవాణాలో పాలుపంచుకుంటున్నారు.

ఉద్యోగ భద్రతపై మాకు కొండంత భరోసా..

బోధన్‌: 

ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రతపై సీఎం కేసీఆర్‌ కొండంత భరోసా ఇవ్వడం ఎంతో సంతోషకరం. మొదటి నుంచీ ఆర్టీసీ కార్మికులు ఉద్యోగభద్రతపై అనుమానాలతో ఆవేదన చెందేవారు. ఈ అనుమానాలన్నీ కేవలం అపోహలేనని సీఎం కేసీఆర్‌ ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టమైంది. ఆర్టీసీని కాపాడుకుంటానన్న ఆయన హామీ మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. రెండు నెలలకు సంబంధించిన 50 శాతం కోత వేతనాలను వెంటనే చెల్లిస్తామనడంతో కరోనా ప్రభావంతో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చింది. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు సిబ్బంది కష్టపడి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆర్టీసీ కార్గో సర్వీసులను సీఎం అభినందించడం ఆ సర్వీసులకు సంబంధించి ఎడపల్లి ఇన్‌చార్జిగా ఉన్న నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. -వైఆర్‌డీ రెడ్డి, ఎడపల్లి, కార్గో సర్వీస్‌ ఇన్‌చార్జి

ఆర్టీసీ బలోపేతానికి అనేక పథకాలు

ఖలీల్‌వాడి : 

ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయినప్పటికీ కార్మికుల కోసం, ప్రజల కోసం కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు కార్గో సేవలు ప్రారంభించారు. ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కృషి చేస్తున్న కేసీఆర్‌కు ధన్యవాదాలు.

- అంజనకుమార్‌, నిజామాబాద్‌ డిపో

ఆర్టీసీని చక్కదిద్దుతున్నారు..

ఖలీల్‌వాడి : 

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన ఆర్టీసీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చక్కదిద్దుతున్నారు. ఐదు నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు పలు పథకాలు తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచారు. ఎక్కడా లేనివిధంగా మొదటిసారిగా కార్గో సేవలు ప్రారంభించి ఆర్టీసీకి లాభాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. పార్సిల్‌, కొరియర్‌ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో ఆర్టీసీ ఆర్థికంగా బలోపేతం అవుతున్నది. లాక్‌డౌన్‌ తర్వాత కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బస్సు సర్వీసులు పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. 

  - ఎస్‌.సుదర్శన్‌, ఆర్యనగర్‌, నిజామాబాద్‌ డిపో

జీతాల చెల్లింపు నిర్ణయం హర్షణీయం

ఆర్మూర్‌ : 

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు పూర్తిస్థాయిలో చెల్లించాలని సీఎం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఆర్మూర్‌ ఆర్టీసీ డిపో పరిధిలో 460 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. లాక్‌డౌన్‌ సమయంలో బకాయి పడిన వేతనాలు చెల్లిస్తుండడంతో కార్మికులకు ఎంతో ఊరట కలుగుతుంది. 

-పోశెట్టి, టీఎంయూ అధ్యక్షుడు, ఆర్మూర్‌ డిపో

సీఎం నిర్ణయం సంతోషకరం..

ఆర్మూర్‌ : 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ ఉద్యోగుల బకాయి వేతనాలు చెల్లించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరం. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో చాలీ చాలని వేతనాలతో సతమతమయ్యే ఆర్టీసీ కార్మికులకు ఎంతో మేలు జరుగుతుంది. ఆర్టీసీని పూర్వస్థితికి తీసుకురావడంతోపాటు, ఉద్యోగుల సంక్షేమానికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. 

-రాధ, కండక్టర్‌, కొలిప్యాక్‌, ఆర్మూర్‌ డిపో

కేసీఆర్‌కు రుణపడి ఉంటాం..

విద్యానగర్‌ : 

కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేతనాల్లో కోత విధించారు. కోత విధించిన 50 శాతం వేతనాలను చెల్లించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు ఆదర్శంగా ఉన్నాయి. 

- జీఎస్‌కుమార్‌, డ్రైవర్‌, కామారెడ్డి డిపో

చాలా సంతోషంగా ఉంది

బాన్సువాడ: 

కరోనా కారణంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి. లాక్‌డౌన్‌తో బస్సులు నడువలేదు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్సులు నడుపకపోవడంతో మా పరిస్థితి ఆగమైంది. ఆర్టీసీ సంక్షోభ పరిస్థితుల్లో మా వేతనాల్లో కోత విధించారు. బకాయి వేతనాలు ప్రస్తుతం మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్‌ ఎనలేని ప్రేమను చూపుతున్నారు. 

-గిరిధర్‌, కండక్టర్‌, బాన్సువాడ డిపో (జేఏసీ నాయకుడు)

వేతనాలు ఇవ్వడం గొప్ప విషయం

బాన్సువాడ: 

లాక్‌డౌన్‌తో బస్సులు నడువలేదు. ఆర్టీసీకి ఆదాయం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో సగం వేతనాలు మాత్రమే చెల్లించారు. బకాయి పడిన రెండు నెలలకు సంబంధించి 50 శాతం వేతనాలు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమైన విషయం. కేసీఆర్‌ మంచి మనస్సుకు ఇదే నిదర్శనం. కార్మికుల పరిస్థితి అర్థం చేసుకొని ఆదుకోవడం గొప్ప విషయం. ఆపేసిన వేతనాలను ప్రస్తుతం చెల్లించడం ఆనందంగా ఉంది. 

-యూసుఫ్‌, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ అధ్యక్షుడు, బాన్సువాడ

అడుగకుండానే వేతనాలు

బాన్సువాడ: 

లాక్‌డౌన్‌ సమయంలో బస్సులు ఆర్టీసీ డిపోలకే పరిమితమయ్యాయి. అయినా సీఎం కేసీఆర్‌ వేతనాలు అందజేశారు. అప్పటి పరిస్థితుల్లో సగం వేతనం ఇవ్వడమే గొప్ప. అన్ని శాఖల ఉద్యోగులతోపాటు మా వేతనాల్లో కోత విధించారు. అప్పుడు ఆపేసిన వేతనాలను మేం అడుగకముందే చెల్లించాలని సీఎం ఆదేశించడం ఆనందంగా ఉంది. కేసీఆర్‌ సార్‌ ఆర్టీసీ పురోగతి కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు.

-శంకర్‌గౌడ్‌, డ్రైవర్‌, బాన్సువాడ డిపో

ప్రభుత్వరంగ సంస్థలు బలోపేతం

విద్యానగర్‌ : 

ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. సంక్షోభంలో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలు హర్షణీయం. కోత విధించిన వేతనాలు తిరిగి చెల్లించడం ఆనందంగా ఉంది. ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. 

-శంకర్‌గౌడ్‌, కస్టమర్‌ రిలేషన్‌ కో-ఆర్డినేటర్‌,

 కామారెడ్డి డిపో

కార్మికులకు కొండంత భరోసా

విద్యానగర్‌ : 

కరోనా సమయంలో బస్సులు నడువక తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి వరాలు ప్రకటించి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. కరోనా సమయంలో కేసీఆర్‌ కార్మికులను ఆదుకున్నారు. ముందుచూపుతో ఆర్టీసీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఆయన తీసుకున్న చర్యలే సంస్థను బతికిస్తున్నాయి. 

- కుసుమ కుమారి, కండక్టర్‌, కామారెడ్డి డిపో

సర్వీసులను 50 శాతం పెంచడం హర్షణీయం

విద్యానగర్‌ : 

ఆర్టీసీ సర్వీసులను 50 శాతానికి పెంచడం హర్షణీయం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కేసీఆర్‌ ఇచ్చిన వరాలు చరిత్రలో నిలిచిపోతాయి. గతంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాలు కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకుంటున్నది. ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

- దేవేందర్‌, డ్రైవర్‌, కామారెడ్డి డిపో

ఆర్టీసీకి మంచి రోజులు

ఖలీల్‌వాడి : 

ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. అనేక పథకాలు తీసుకురావడంతో ఆర్టీసీ లాభాల బాట పడుతున్నది. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నది. కొత్తగా తీసుకొచ్చిన కార్గో సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ పురోభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నారు.

-సుదర్శన్‌, డ్రైవర్‌, నిజామాబాద్‌ డిపో

ఆర్టీసీ లాభాలబాట

ఖలీల్‌వాడి : 

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్టీసీ సిబ్బంది పక్షాన నిలబడ్డారు. లాక్‌డౌన్‌ తర్వాత బస్సులను నడిపిస్తూనే ఆర్టీసీకి లాభాలు తెచ్చేందుకు వివిధ పథకాలు తీసుకొచ్చారు. కార్గో సేవలతో ఆర్టీసీ లాభాలబాట పట్టింది. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా మా సేవలు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.

- లింగన్న, డ్రైవర్‌, 

కామారెడ్డి డిపో