ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Nov 14, 2020 , 00:58:32

పంట రుణాలపై అవగాహన శిబిరాలు ఏర్పాటుచేయాలి

పంట రుణాలపై అవగాహన శిబిరాలు ఏర్పాటుచేయాలి

కలెక్టర్‌ నారాయణరెడ్డి 

ఇందూరు : పంట రుణాల రెన్యూవల్‌, కొత్త రుణాలు తీసుకునేలా గ్రామాల్లో అవగాహన క్యాంపులు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో యాసంగి పంటరుణాలపై జిల్లాస్థాయి సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాసంగిలో రూ.1368 కోట్ల రుణ లక్ష్యం కాగా.. రైతులు అక్టోబర్‌ వరకు కేవలం 7.74 శాతం మాత్రమే రుణాలు తీసుకున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ, రెవెన్యూ, ఉద్యానవన శాఖలతో పాటు గ్రామపంచాయతీలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులకు అండగా ఉండి సహాయ సహకారాలు అందించాలన్నారు. వ్యవసాయ యంత్రాల కోసం రుణాల మంజూరుకు లబ్ధిదారులను గుర్తించాలన్నారు.  డెయిరీ, చేపల పెంపకం లబ్ధిదారులకు బ్యాంకర్లు ప్రాధాన్యమివ్వాలని, ఈ నెలాఖరులోగా దరఖాస్తులను పరిశీలించి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

వీధి వ్యాపారులకు రూ.10వేల రుణం మంజూరు పై తాత్సారం చేయడం సరికాదని, వీటిని మున్సిపల్‌ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. మహిళా సంఘాల రుణాలు నిర్ణీత సమయంలో మంజూరు చేయడంతోపాటు  తిరిగి చెల్లించేలా డీఆర్డీవో, మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నగర కమిషనర్‌ జితేశ్‌ వీ పాటిల్‌, ఎల్‌డీఎం జయ సంతోషి, నాబార్డు డీడీఎం నగేశ్‌, ఎస్‌బీఐ ఆర్‌ఎం ప్రతాప్‌రెడ్డి, డైరెక్టర్‌ సుధీంద్రబాబు, వ్యవసాయ, పశుసంవర్ధక, సంక్షేమ శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. 

బాలల హక్కుల పోస్టర్లు ఆవిష్కరణ ..

ఇందూరు : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని చైల్డ్‌లైన్‌ 1098 రూపొందించిన బాల ల హక్కుల పోస్టర్లను కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రగతిభవన్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జితేశ్‌ వి పాటిల్‌, జిల్లా శిశు సంక్షేమాధికారిణి ఝాన్సీలక్ష్మి, బీఆర్‌వీ కోఆర్డినేటర్‌ స్వర్ణలత, చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ జ్యోత్స్న పాల్గొన్నారు.