బుధవారం 27 జనవరి 2021
Nizamabad - Nov 12, 2020 , 02:03:06

వీడని విషాదం సుహాసిని జీవితం

వీడని విషాదం సుహాసిని జీవితం

బాల్యంలోనే అమ్మానాన్నకు దూరం

ప్రేమించి పెండ్లాడిన ఏడాదిన్నరకే భర్త వీరమరణం

చిన్నతనం నుంచి వెంటాడుతున్న కష్టాలు

భర్త త్యాగనిరతిని గుర్తు చేసుకుంటున్న వైనం

కమ్మర్‌పల్లి : వీరజవాన్‌ ర్యాడ మహేశ్‌ సతీమణి సుహాసిని జీవితం విషాదాల పయనం. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన ఆమెను మరోసారి విధి వంచించింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న ఏడాదిన్నరకే భర్తను కోల్పోవడం తీరని శోకాన్ని మిగిల్చింది. బాబాయి, పిన్నిల ప్రేమకు కొదువ లేకపోయినా అమ్మానాన్నల అనురాగానికి నోచుకోకపోవడం ఆమెలో కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని నింపింది. తల్లిదండ్రుల నుంచి అందని ప్రేమను భర్త ద్వారా కడదాకా పొందాలనుకున్న ఆమె ఆశలు ఆవిరయ్యాయి. 

అమ్మానాన్నల ్రప్రేమకు దూరమై..

హైదరాబాద్‌లో ఉంటున్న పిన్ని, బాబాయిలు సుహాసినిని పెంచి పెద్దచేశారు. బాబాయి బీజీ నాయుడు ఆర్మీలో పని చేసే వారు. ఓ కమాండర్‌ ద్వారా నాయుడుకు మహేశ్‌తో పరిచయం ఏర్పడింది. నాయుడు వద్దకు మహేశ్‌ తరచూ వచ్చి వెళ్లేవాడు. మహేశ్‌ క్రమశిక్షణ, దేశభక్తి భావాలు నాయుడును బాగా ఆకర్షించాయి. ఆర్మీలో బాబాయి పని చేయడంతో సుహాసినికి సైతం దేశభక్తి, ఆర్మీ పట్ల గౌరవం అలవడ్డాయి. ఈ భావాలు మహేశ్‌, సుహాసినిల మధ్య ప్రేమకు బీజం వేశాయి. వారి ప్రేమను పెద్దలు ఆమోదించి పెండ్లి చేశారు. ప్రేమించిన వ్యక్తే భర్తగా రావడంతో సుహాసిని ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది. భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్నది. పైండ్లెన ఏడాదిన్నరకే భర్తను కోల్పోవాల్సి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. ఈ నెల 21న మహేశ్‌ పుట్టిన రోజు ఉంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘ఆ రోజు వరకు నీ దగ్గర ఉంటా..’అని మహేశ్‌ చెప్పడంతో సుహాసిని వేయికండ్లతో ఎదురుచూస్తోంది. కానీ అంతలోనే దుర్వార్త వినాల్సి వచ్చింది. ఈ నెల 8న దేశ సరిహద్దులో పాకిస్థాన్‌ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మహేశ్‌ అమరుడయ్యాడు. దీంతో మరోసారి సుహాసిని జీవితంలో అంతులేని విషాదం అలుముకొంది. ఈ వేదనతో ఆమె కంటి నుంచి కారే ప్రతి కన్నీటి బొట్టు ఆమె జీవితంలో నెలకొన్న అంతులేని విషాదానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భర్తను గుర్తుచేసుకుంటూ తనలో తాను కుమిలిపోతున్నది. తనకు తానే ధైర్యం చెప్పుకొని ఓదార్చుకుంటున్నది. మనోైస్థెర్యాన్ని నింపుకొంటున్నది. logo