శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Nov 11, 2020 , 01:43:43

జోరుగా ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

జోరుగా ‘ధరణి’ రిజిస్ట్రేషన్లు

సిరికొండ: ధరణి పోర్టల్‌ ద్వారా జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న వెంటనే తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిచేసి పట్టాలను అందజేస్తుడడంతో భూములు అమ్మినవారు, కొన్నవారు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. కార్యాలయానికి వెళ్లిన అద్దగంటలోనే పని పూర్తిచేస్తున్నారని, గతంలో రోజుల తరబడి దళారులను పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని అప్పుడు పడిన కష్టాలను గుర్తుచేసుకుంటున్నారు. సిరికొండలో మంగళవారం నాలుగు సేల్‌ డీడ్‌లు పూర్తిచేసి పత్రాలను కొనుగోలు దారులకు అందజేసినట్లు తహసీల్దార్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. 

రూరల్‌ మండలంలో నాలుగు రిజిస్ట్రేషన్లు

నిజామాబాద్‌ రూరల్‌: రూరల్‌ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నలుగురు రైతులు తమ భూమి క్రయవిక్రయాలపై ఒప్పందం చేసుకున్న అనంతరం స్లాట్‌ బుక్‌ చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఒక్కో రిజిస్ట్రేషన్‌ను 20 నిమిషాల్లోనే పూర్తిచేసి పాస్‌పుస్తకాల కాపీలను రైతులకు అందజేశారు. త్వరగా పని పూర్తికావడంతో రైతులు ఆనందంతో వెనుదిరిగారు.  

20 నిమిషాల్లో గిఫ్ట్‌డీడ్‌..

మెండోరా : మండల కేంద్రానికి చెందిన కుమ్మరి గంగారాం తన భూమిని కుమారులు గంగారాం, దేవేందర్‌ పేరిట గిఫ్ట్‌డీడ్‌ చేయించారు. ఇందుకు సబంధించిన రిజిస్ట్రేషన్లను 20 నిమిషాల్లోనే పూర్తిచేసి వారికి గిఫ్ట్‌డీడ్‌ పత్రాలను జడ్పీటీసీ గంగాధర్‌, తహసీల్దార్‌ జనార్దన్‌ అందజేశారు. పని త్వరగా పూర్తికావడంపై గంగారాం, ఆయన కుమారులు సంతోషం వ్యక్తంచేశారు. 

సేవలను సద్వినియోగం చేసుకోవాలి..

రెంజల్‌: స్థానిక తహసీల్‌ కార్యాలయంలో కొనసా గుతున్న ధరణి సేవలను ఆర్డీవో రాజేశ్వర్‌ పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తిచేసిన రిజిస్ట్రేషన్ల వివరాలను తహసీల్దార్‌ గంగాసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ధర్పల్లి : భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు స్థాని తహసీల్‌ కార్యాలయంలో అందజేస్తున్న ధరణి పోర్టల్‌ సేవలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్‌ ఆనంద్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  


logo