ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Nov 11, 2020 , 01:43:42

సలాం.. సైనికా...

సలాం.. సైనికా...

అమరజవాన్‌కు అడుగడుగునా జేజేలు.. స్వగ్రామానికి చేరుకున్న భౌతికకాయం

ఆర్మీ విమానంలో రాష్ర్టానికి చేరుకున్న మహేశ్‌ పార్థివదేహం

హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో కోమన్‌పల్లికి..

ఎయిర్‌పోర్టులో నివాళులు అర్పించిన గవర్నర్‌ , ఎమ్మెల్సీ కవిత

నేడు సైనిక లాంఛనాలతో ర్యాడ మహేశ్‌ అంత్యక్రియలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : దేశ సేవలో అమరుడైన ర్యాడ మహేశ్‌కు జిల్లా ప్రజానీకం వందనం పలుకుతోంది. జవాన్‌ మహేశ్‌ అంత్యక్రియలు బుధవారం స్వగ్రామం కోమన్‌పల్లిలో జరుగనున్నాయి.  మాచిల్‌ సెక్టార్‌లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల పార్థివ దేహాలను మంగళవారం రాత్రి 9.15 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టుకు ఆర్మీ అధికారులు తీసుకువచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన జవాన్‌ ప్రవీణ్‌కుమార్‌, ర్యాడ మహేశ్‌  పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేర్చారు. అంతకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో అమరవీరులకు త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులు గౌరవ వందనం సమ ర్పించారు. ఢిల్లీ  నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో బేగంపేటకు మృతదేహాలను తరలించారు. మహేశ్‌ భౌతిక కాయానికి గవర్నర్‌ తమిళిసై, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ఘన నివాళులు అర్పించారు. రాత్రి 9.45 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి మహేశ్‌ భౌతిక కాయాన్ని ప్రత్యేక అంబులెన్సులో స్వగ్రామానికి తరలించారు. పార్థివ దే హం వెంట మహేశ్‌ సోదరుడు భూమేశ్‌, మామ నాయుడు ఉ న్నారు.  వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నా రు. ఈ మేరకు పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  

కిక్కిరిసిన బేగంపేట ఎయిర్‌పోర్టు...

జవాన్ల భౌతిక కాయానికి ఆర్మీ, నేవీ అధికారులు ఘనంగా తుది వీడ్కోలు పలికారు. ప్రత్యేక దళాలు కవాతు నిర్వహిస్తూ మహేశ్‌, ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి (చిత్తూరు జిల్లా) పార్థివదేహాలకు గౌరవ వందనం సమర్పించారు. సైన్యానికి చెందిన పలు వాహనాలు వెంట రాగా  ప్రత్యేక అంబులెన్సులో మహేశ్‌ భౌతిక దేహాన్ని తరలించారు. ఆర్మీ బృందాలతో బేగంపేట ఎయిర్‌ పోర్టు కిక్కిరిసింది. పలువు రు అభిమానులు దారి వెంట జవాన్లకు జేజేలు పలుకుతూ వీడ్కోలు పలకడం కనిపించింది. మీ సేవలు వృథా కావు... అంటూ సైన్యం చేసిన గర్జన స్థానికంగా అందరిలోనూ ఉత్తేజాన్ని నింపింది. ప్రత్యేక వాహనాల్లో మహేశ్‌ భౌతిక దేహం తో పాటుగా ఆర్మీ బృందాలు కోమన్‌పల్లికి వెంట వచ్చాయి. వీరికి తోడుగా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన ఎస్కార్ట్‌ వాహనాన్ని గౌరవ సూచకంగా ఏర్పాటు చేయించారు.

నివాళులు అర్పించిన గవర్నర్‌, మంత్రి, ఎమ్మెల్సీ...

బేగంపేట ఎయిర్‌పోర్టుకు రాత్రి 9.15 గంటలకు చేరుకున్న అమర జవాన్ల భౌతిక కాయానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నివాళి అర్పించారు. పుష్పగుచ్ఛం ఉంచి వందనం సమర్పించారు. మహేశ్‌ భౌతిక కాయాన్ని రిసీవ్‌ చేసుకునేందుకు గంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మహేశ్‌ త్యాగాన్ని స్మరించుకుంటూ వీర సైనికుడికి  మంత్రి వేముల వందనం సమర్పించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైతం బేగంపేట ఎయిర్‌పోర్టులో మహేశ్‌ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి  జవాన్‌ అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వందనం సమర్పించారు.

కంటతడిపెట్టిన కోమన్‌పల్లికి...

భారత సరిహద్దులో ఉగ్ర మూకలతో జరిగిన పోరులో ప్రాణా లు వదిలిన అమర జవాన్‌ ర్యాడ మహేశ్‌ భౌతిక కాయం స్వగ్రామానికి చేరుకుంది. రాత్రి 9.45 గంటలకు హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన ప్రత్యేక వాహన శ్రేణి అర్ధరాత్రి కోమన్‌పల్లికి చేరుకుంది. మహేశ్‌ పార్థివ దేహం రాక సందర్భంగా స్వగ్రామంలో ముందస్తుగానే పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరుడి భౌతిక కాయం కోమన్‌పల్లి గ్రామ శివారుకు చేరుకోగానే గ్రామస్తులంతా బోరున విలపించారు. మహేశ్‌ను గుర్తు చేసుకుంటూ చిన్నా పెద్దా తేడా లేకుండా కన్నీటి పర్యంతమయ్యారు. స్వగ్రామానికి చేరిన అమరుడికి  గ్రామస్తులంతా ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. మహేశ్‌ సన్నిహితులు, స్నేహితులతో పాటుగా కుటుంబీకులు, బంధుగణం రోదనలతో కోమన్‌పల్లి గ్రామం చిన్నబోయింది.  గ్రామ శివారులోని హిందూ శ్మశాన వాటికలో మహేశ్‌ అంత్యక్రియలను ఆర్మీ, రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.