శనివారం 23 జనవరి 2021
Nizamabad - Nov 10, 2020 , 02:00:46

గుండెల్లో పెట్టుకొని చూసుకుంటం..

గుండెల్లో పెట్టుకొని చూసుకుంటం..

మహేశ్‌ కుటుంబానికి అండగా ఉంటాం..

జవాను త్యాగం చిరస్మరణీయం

మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

ఉద్వేగానికి లోనై కంటతడి

వేల్పూర్‌ / కమ్మర్‌పల్లి : వీర జవాను ర్యాడ మహేశ్‌ త్యాగం చిరస్మరణీయమని, ఆయన కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని రాష్ట్ర హౌసింగ్‌, రోడ్లు-భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దేశ సరిహద్దులో ఆదివారం పాకిస్తాన్‌ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మహేశ్‌ వీరమరణం పొందారు. వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లిలోని ఆయన కుటుంబాన్ని సోమవారం మంత్రి పరామర్శించారు. కుటుంబసభ్యులను ఓదార్చి, సానుభూతి ప్రకటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మహేశ్‌ త్యాగం మరువలేమన్నారు. ఇతర ఉద్యోగావకాశాలు ఉన్నా దేశభక్తితో ఆర్మీలో చేరాడని తెలిపారు. 26 ఏండ్ల వయస్సులోనే దేశాన్ని శత్రువుల నుంచి రక్షించే బాధ్యతను పూర్తిగా నిర్వర్తించాడని, ముగ్గరు టెర్రరిస్టులను హతమార్చడంలో భాగస్వామి అయ్యాడని అన్నారు. వీరుడి కుటుంబానికి తన తరఫున, ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందుతాయని చెప్పారు. ఆయన త్యాగానికి వెలకట్టలేక పోయినా కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూర్తి అండగా ఉంటారని తెలిపారు. వేల్పూర్‌ వాసిగా తన వంతుగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానన్నారు. మహేశ్‌ త్యాగాన్ని చిరస్థాయిగా గుర్తించుకొని కుటుంబ సభ్యులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని గద్గద స్వరంతో ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం వరకు మహేశ్‌ భౌతికకాయం హైదరాబాద్‌కు చేరుకుంటుందని, కోమన్‌పల్లిలో అంతిమయాత్రను సగౌరవంగా నిర్వహించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని తెలిపారు. మంత్రితోపాటు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ మహేశ్‌ కుటుంబసభ్యులను పరామర్శించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

కన్నీటి పర్యంతమైన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

వీర జవాను మహేశ్‌ భార్య సుహాసిని, తల్లి రాజుబాయి, తండ్రి గంగమల్లు, కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. మహేశ్‌ కుటుంబ సభ్యులు రోదిస్తుంటే మంత్రి చలించిపోయారు. తానూ కంటతడి పెడుతూనే వారిని ఓదార్చారు. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకొని గద్గద స్వరంతోనే మంత్రి మీడియాతో మాట్లాడారు. మంత్రి వెంట ఆర్మూర్‌ ఏసీపీ రఘు, ఆర్టీవో శ్రీనివాసులు, రూరల్‌ సీఐ విజయ్‌, తహసీల్దార్‌ సతీశ్‌రెడ్డి, ఎంపీడీవో కరుణాకర్‌, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఎంపీపీ భీమ జమున, డీసీసీబీ డైరెక్టర్‌ శేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ బోదపల్లి సురేశ్‌, సర్పంచ్‌ పత్రి రాజేశ్వర్‌, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, మెరుగు శ్రీనివాస్‌ ఉన్నారు. 


logo