గురువారం 28 జనవరి 2021
Nizamabad - Nov 10, 2020 , 02:00:44

నిను మరువదు ఈ నేల..

నిను మరువదు ఈ నేల..

21 ఏండ్లకే ఆర్మీ జవాన్‌గా ఉద్యోగం.. ఐదేండ్లుగా సరిహద్దులో పహారా

ఏడాదిన్నర క్రితమే ఇష్టపడిన యువతినే మనువాడిన మహేశ్‌

నవంబర్‌ 21న పుట్టిన రోజుకు సర్‌ప్రైజ్‌ ఇద్దామనుకున్న సుహాసిని

శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబీకులతో ఫోన్‌ సంభాషణ

ఆర్మీ జవాన్‌ కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

మహేశ్‌ త్యాగాన్ని స్మరించుకున్న స్పీకర్‌ పోచారం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఫోన్‌లో పరామర్శ

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ / కమ్మర్‌పల్లి / వేల్పూర్‌

దేశ రక్షణ కోసం పాటుపడుతూ... ఉగ్ర మూకలతో తలపడుతూ... కన్న వారిని, కట్టుకున్న వారిని వదిలి సరిహద్దులో దేశ సేవ చేస్తున్న నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి నివాసి ర్యాడ మహేశ్‌(26) వీర మరణం పొందాడు. భరతమాత సేవలో ఐదేండ్లుగా తరించిన మహేశ్‌ ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయి వీరమరణం పొందాడు. 21 ఏండ్లకే ఆర్మీలో చేరిన మహేశ్‌ మాతృభూమి సేవకు అంకితమయ్యాడు. ఎముకలు కొరికే చలిలో బార్డర్‌లో ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో శ్రమిస్తూ శనివారం అర్ధరాత్రి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. వారం రోజుల్లో నేనొస్తానంటూ తల్లిదండ్రులకు, భార్య సుహాసినికి ఫోన్‌లో జవాన్‌ మహేశ్‌ చెప్పిన మాటలే చివరిగా మారాయి. ఈ నెల 21న భర్త పుట్టిన రోజును ఘనంగా చేసుకోవాలని... మహేశ్‌ను సర్‌ప్రైజ్‌ చేద్దామని కలలు కన్న వీరుడి భార్య కోరిక తీరకుండానే మిగిలి పోయింది. భారత్‌, పాకిస్థాన్‌ బార్డర్‌లో ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునే క్రమంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో అసువులు బాసిన వీర జవాన్‌ కుటుంబానికి బాసటగా ఉంటామని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రకటించారు. మహేశ్‌ తల్లిదండ్రులను పరామర్శించిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. వీర సైనికుడికి ఘనంగా నివాళులు అర్పించారు. వీరుడి ప్రాణత్యాగం పట్ల రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. జవాన్‌ ర్యాడ మహేశ్‌ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు హైదరాబాద్‌కు వీరుడి భౌతికకాయం చేరుకోనుంది. అక్కడి నుంచి ఆర్మీ అధికారుల ప్రొటోకాల్‌ ప్రకారం స్వగ్రామం కోమన్‌పల్లికి తీసుకురానున్నారు. ఆర్మీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నేను సేఫ్‌... మీరు సేఫ్‌గా ఉండండి...

ఉగ్ర మూకల దాడిలో వీర మరణం చెందడానికి ముందు జవాన్‌ మహేశ్‌ శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కుటుంబీకులకు ఫోన్‌ చేసి మాట్లాడారు. తల్లిదండ్రులతోపాటుగా సతీమణి సుహాసినితోనూ మాట్లాడారు. ‘నేనిక్కడ సేఫ్‌గా ఉన్నాను.. మీరు కూడా అక్కడ సేఫ్‌గా ఉండండి..’ అంటూ కుటుంబీకులకు మహేశ్‌ జాగ్రత్తలు సూచించాడు. కరోనా వైరస్‌ విస్తృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు. తండ్రి గంగమల్లుతో మహేశ్‌ మాట్లాడుతున్న సమయంలో... పొలం పనుల్లో భాగంగా తోటలో ఉన్నట్లు కొడుకు మహేశ్‌కు బదులిచ్చాడు. ఇంటికి ఫోన్‌కు చెయ్యమని తండ్రి సూ చించగా తల్లితోనూ మహేశ్‌ ముచ్చటించాడు. అదే రోజు రాత్రి ఉగ్రవాదులతో మద్రాస్‌ 18 సైనిక బృందం తలపడింది. నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన క్రమంలోనే ముగ్గురు భారత జవాన్లు వీర మరణం చెందారు. అందులో ఒకరు కెప్టెన్‌ కాగా మరొకరు చిత్తూర్‌ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌ సైతం ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ నుంచి మహేశ్‌ కుటుంబ సభ్యులకు ఫోన్‌ సమాచారం అందింది. మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయని అందులోని సారాంశం. కొద్ది సేపటి తర్వాత మహేశ్‌ ఇక లేరనే సమాచారం రావడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు.

2015లో జవాన్‌గా...

భారత్‌ - పాకిస్థాన్‌ సరిహద్దు భూభాగంలో ఉగ్రవాదులతో తలపడి వీర మరణం చెందిన ర్యాడ మహేశ్‌కు 26 ఏండ్లు. 2015లో ఆర్మీలో జవాన్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. మహేశ్‌ 6వ తరగతి వరకు నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలంలోని కుకునూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వేల్పూర్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో విద్యాభ్యాసం చేశాడు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదివాడు. ఇంటర్మీడియెట్‌ పూర్తి కాగానే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ కోసం ఎదురు చూశాడు. 21 ఏండ్లకే సైన్యంలో చేరాడు. తల్లిదండ్రులు గంగుమల్లు, రాజుబాయిలకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు భూమేశ్‌ గల్ఫ్‌లో ఉండగా, మహేశ్‌ ఆర్మీలో పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే సుహాసినితో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది క్రితం ఇంటికి వచ్చి నెల రోజులపాటు కుటుంబీకులతో గడిపాడు. 

ఏడాదిన్నర క్రితమే పెండ్లి

ఉగ్రమూకల పోరులో అమరుడైన ర్యాడ మహేశ్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన సుహాసినిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. అమ్మాయి తండ్రి సైతం ఆర్మీలోనే పని చేస్తుండగా ఓ సందర్భంలో సుహాసినితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. నాలుగేండ్ల తర్వాత పెద్దలు పెండ్లికి అంగీకరించడంతో అనుకున్నట్లే వైభవంగా ఇష్టపడిన యువతితో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యాడు. నవంబర్‌ 5న తన అర్ధాంగి సుహాసిని బర్త్‌ డే సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా శుభాకాంక్షలు చెప్పాడు. నవంబర్‌ 21న మహేశ్‌ బర్త్‌డే ఉండడంతో ఇంటి వద్దే సెలబ్రేషన్స్‌ చేసుకుందామని భార్యతో మాటిచ్చాడు. శనివారం మధ్యాహ్నం భార్యతో మాట్లాడిన సందర్భంలోనూ వారం రోజుల్లోనే వస్తా... దీపావళి పండుగను ఘనంగా జరుపుకొందామని చెప్పాడు. అంతలోనే శనివారం సాయంత్రమే ఉగ్రవాదులతో హోరాహోరీ పోరు జరగడంతో అందులో మహేశ్‌ వీర మరణం చెందాడు. భర్తతో రెండు రోజుల క్రితం వరకు మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ మహేశ్‌ భార్య సుహాసిని రోదించిన తీరు కోమన్‌పల్లిలోని స్వగృహంలో అందరినీ కంటతడి పెట్టించింది. మహేశ్‌ బర్త్‌ డేకు సర్‌ప్రైజ్‌ ఇద్దామని సుహాసిని ప్లాన్‌ చేసుకుంది. అంతలోనే తన భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో గుండె పగిలేలా రోధిస్తోంది.

ఏమైంది అక్కా.. చెప్పక్కా...

మహేశ్‌ మరణ వార్త భార్య సుహాసినికి కుటుంబీకులు ఆలస్యంగా చేరవేశారు. తీవ్రగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న సుహాసిని హుటాహుటిన అత్తామామల చెంతకు సోమవారం మధ్యాహ్నం వచ్చారు. స్వగ్రామానికి చేరుకోగానే బంధువులు, గ్రామస్తుల రద్దీతోపాటుగా అందరూ విలపిస్తుంటే సుహాసిని మాత్రం ఏమైందంటూ అందరినీ అడుగుతుండడం మనసులను కలిచి వేసింది. మహేశ్‌కు ఏమైంది అక్కా అంటూ తన తోటి కోడలును ప్రశ్నిస్తుంటే కుటుంబీకుల నోటి నుంచి మాటలే రాకుండా పోయాయి. కొద్ది సేపటికి మహేశ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి అందరూ నివాళులు అర్పిస్తుండడంతో సుహాసినికి విషయం అర్థమైంది. తన భర్తతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ వీర జవాన్‌ భార్య విలపించిన తీరును చుట్టూత ఉన్న వారిని కలిచి వేసింది. సుహాసినితోపాటు మహేశ్‌ తల్లిదండ్రులు సైతం కొడుకా అంటూ రోదించడం కన్నీళ్లు తెప్పించింది.

ఫోన్‌లో పరామర్శించిన హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌  

వేల్పూర్‌ : దేశ సరిహద్దులో వీర మరణం పొందిన జవాను ర్యాడ మహేశ్‌ కుటుంబ సభ్యులను సోమవారం హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఫోన్‌లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మహేశ్‌ ఉగ్రవాదులతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించి భరతమాత ఒడిలో ఒరిగాడని పేర్కొన్నారు. ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులను కోరారు.

పలువురి పరామర్శ

జవాన్‌ కుటుంబసభ్యులను సోమవారం పలువురు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు కోటపాటి నర్సింహనాయుడు, ప్రవాస భారతీయుల హక్కుల సంక్షేమ వేదిక దుబాయి శాఖ అధ్యక్షుడు ఎముల రమేశ్‌, పోల సుధాకర్‌ గుప్తా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, ఆ పార్టీ నాయుడు పెద్దోళ్ల గంగారెడ్డి, వేల్పూర్‌ ఎంపీపీ భీమ జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, వంశీగౌడ్‌, ప్రదీప్‌ తదితరులు ఉన్నారు.

యావత్‌ తెలంగాణ నివాళి అర్పిస్తోంది

జమ్ము కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్‌లో ఉగ్రదాడిలో వీర మరణం పొందిన నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన్‌పల్లి గ్రామానికి చెందిన మహేశ్‌కు ఘన నివాళి అర్పిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన మహేశ్‌కు చిన్నతనం నుంచే ఆర్మీ జవాన్‌ కావాలనే లక్ష్యంతో విద్యాభ్యాసం కొనసాగించారు. 2015లో ఆర్మీలో జవాన్‌గా విధులు చేపట్టారు. దేశం మీద ప్రేమతో సైన్యంలో చేరి భారతావని కోసం మహేశ్‌ తన ప్రాణాలను త్యాగం చేశాడు.  

- పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనసభాపతి

వీర జవాన్‌కు సెల్యూట్‌.. 

భారత్‌ - పాకిస్థాన్‌ సరిహద్దులో ఉగ్రవాదులతో పోరాటం చేస్తూ వీర మరణం పొందిన ర్యాడ మహేశ్‌ కుటుంబీకులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సానుభూతి తెలిపారు. మహేశ్‌ మరణ వార్త విషాదకరమైనప్పటికీ... దేశ సేవలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని, భారతీయులందరూ గర్వించదగ్గ విషయమని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లుగా ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఉగ్రవాదుల చొరబాటుని అడ్డుకుని అమరుడైన మహేశ్‌కు నివాళి అంటూ కవిత పేర్కొన్నారు. వీర జవాన్‌ కుటుంబానికి యావత్‌ తెలంగాణ సమాజం అండగా ఉంటుందని కవిత చెప్పారు.

- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ

ఊరూరా కొవ్వొత్తుల ర్యాలీలు

వేల్పూర్‌ : జమ్ము కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాను మహేశ్‌కు సంతపం తెలుపుతూ వేల్పూర్‌, రామన్నపేట్‌ గ్రామాల్లో సోమవారం రాత్రి వివిధ యుజన సంఘాల ఆధ్వర్యంలో కొవొత్తులతో ర్యాలీలు నిర్వహించారు. రామాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అబేంద్కర్‌ విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీలో వివిధ యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లిలో యువజన సంఘాల సభ్యులు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆర్మూర్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. 

తీరని శోకమే మిగిలింది

నా భర్త విధి నిర్వహణలో అంకితభావానికి నిలువెత్తు రూపం. దేశం గురించి, ఆర్మీ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నప్పుడు దేశంపట్ల ఆయనకున్న నిబద్ధత స్పష్టంగా కనిపించేది. దేశంపై రాజీలేని అభిమానం ఆయన సొంతం. ఆయన మృతి నాకు తీరని శోకాన్ని మిగిల్చింది.

-సుహాసిని, మహేశ్‌ భార్య 

కండ్ల ముందట ఉన్నట్లే ఉంది

నా కొడుకు వీరమరణం పొందిండని ఆర్మీ సార్లు ఫోన్‌ చేసి చెప్పంగనే నా గుండె ఆగినంత పనైంది. నా కాళ్లు చేతులు ఆడలే. నా బిడ్డ ఇంకా నా కండ్లముందట తిరుగుతున్నట్లే ఉంది. దేశం కోసం నా కొడుకు పానాలొదిలిండని బాధున్నా.. వీర మరణం పొందిండని గర్వ పడుతున్నా. ఉగ్రవాదులతో పోరాడి నా బిడ్డ అమరుడైండు. 

-గంగమల్లు, మహేశ్‌ తండ్రి

చిన్నప్పటి నుంచి దేశభక్తి ఎక్కువే 

నా కొడుక్కు చిన్నప్పటి నుంచి దేశ భక్తి ఎక్కువే. ఎప్పుడూ దేశం గురించే మాట్లాడుతుండే. ఆర్మీకి వోతా అని అంటుండే. కష్టపడి ఆర్మీలో నౌకిరి తెచ్చుకున్నడు. నా కొడుకు కోర్కె తీరిందని మస్తు సంబురవడ్డ. ఎప్పుడూ దేశం.. ఆర్మీ.. అంటుండే. దేశం కోసం పానాలు దారవోసిండు నా బిడ్డ.  

-రాజుబాయి, మహేశ్‌ తల్లి 

చాలా మంచి వ్యక్తి 

మహేశ్‌ ఎంతో మంచి వ్యక్తి. దేశంపైనే కాకుండా తోటి మనుషుల పట్ల నిష్కల్మషమైన ప్రేమ ఉండేది. ఉత్తమ ఆలోచనలతో ఉన్నతంగా ఆలోచించేవాడు. నేను 26 సంవత్సరాలు ఆర్మీలో పనిచేశా. ఆ అనుభవంతోనే మహేశ్‌లో దేశ భక్తి, సత్ప్రవర్తన మెండుగా ఉన్నాయని గుర్తించా. ఆయన మృతి మా కుటుంబానికి తీరని లోటు. 

-జీటీ నాయుడు, సుహాసిని బాబాయి 

గర్వంగా ఉంది

నా స్నేహితుడు మహేశ్‌ మృతి తీరని లోటే అయినా.. దేశం కోసం ప్రాణాలు అర్పించడం గర్వకారణంగా ఉంది. ఆయనలో దేశభక్తి ఎక్కువే. ఎప్పుడూ దేశం గురించే ఆలోచించేవాడు. మా మిత్రుడు మా మధ్య లేకపోయినా ప్రజలగుండెల్లో శాశ్వతంగా ఉండిపోతాడు. 

-నరేశ్‌, మహేశ్‌ స్నేహితుడు 

కన్నీటి నివాళి

ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మా గ్రామానికి చెందిన జవాన్‌ మహేశ్‌ మరణించడం బాధాకరం. దేశ రక్షణ కోసం ప్రాణాలు ఎదురొడ్డి నిలిచిన ఆయన త్యాగం అజరామరం. ప్రతి ఒక్కరూ ఆయన కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయమిది. 

-మెరుగు శ్రీనివాస్‌, కోమన్‌పల్లి 

త్యాగం వెలకట్టలేనిది..

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహేశ్‌ త్యాగం వెలకట్టలేనిది. అమరుడైనా మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాడు. చిన్నవయస్సులోనే జీవితాన్ని పణంగా పెట్టి ఉగ్రవాదుల నుంచి దేశాన్ని కాపాడాడు. మహేశ్‌ చేసిన త్యాగాన్ని ఎన్నటికీ మరువం. 

-పత్రి రాజేశ్వర్‌, సర్పంచ్‌, కోమన్‌పల్లి 

స్నేహాన్ని ఆస్వాదించేవాడు

మహేశ్‌ స్నేహ శీలి. స్నేహితులంటే ఎంతో ఇష్టపడేవాడు. తెలివైన విద్యార్థిగా క్లాసులో పేరుండేది. వాడికి ఇష్టమైన బాటలో నడవడం అలవాటు. అదే క్రమంలో తనకు ఇష్టమైన ఆర్మీ ఉద్యోగాన్ని సాధించుకున్నాడు. మంచి వ్యక్తిత్వం వాడిని ప్రత్యేకంగా నిలబెట్టేది.  

-అజయ్‌, మహేశ్‌ క్లాస్‌మేట్‌


logo