బుధవారం 20 జనవరి 2021
Nizamabad - Nov 04, 2020 , 01:14:10

దళారులు లేని ధరణి !

దళారులు లేని ధరణి !

ఏకకాలంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌

మండలాల్లో సాంకేతిక అడ్డంకులను అధిగమిస్తున్న తహసీల్దార్లు

రిజిస్ట్రేషన్లకు ఉభయ జిల్లాల్లో జోరుగా స్లాట్‌ బుకింగ్‌లు

దూరభారం, నిరీక్షణ వెతలు తప్పాయంటున్న సామాన్యులు

అనవసరపు భారం లేకపోవడంతో రైతులకు ఉపశమనం

పావు గంటలోనే భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ధరణి.. ఆసాధారణ ఫలితాలు ఇస్తున్నది. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విధానానికి ఎంతో ఆదరణ లభిస్తున్నది. మీసేవలో స్లాట్‌ బుకింగ్‌, తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ క్షణాల్లో జరిగిపోతుండడంతో గంటల తరబడి వేచి చూడాల్సిన తిప్పలు తప్పింది. తొలి రోజు ఉభయ జిల్లాల్లోని పలు మండలాల్లో ఒక్క స్లాట్‌ కూడా బుకింగ్‌ కాలేదు. కామారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లో ప్రజల నుంచి వినతులు లేకపోవడంతో ధరణి సేవలు నిర్వహించలేదు. నిజామాబాద్‌ జిల్లాలోనూ పలు మండలాల్లో ఇదే తీరు కనిపించింది. రెండో రోజు ధరణికి ఆదరణ పెరిగింది. స్లాట్‌ బుకింగ్‌ చేయడంలో మీసేవ కేంద్రాల్లో సులువుగా ప్రాసెస్‌ కొనసాగుతుండడంతో భూమిని బదలాయించుకునే వారు ఈజీగా స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్‌ కార్యాలయానికి వస్తున్నారు. అనుకున్న సమయానికి వెళ్లి కేవలం కొద్ది సేపట్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసుకొని ఇంటికి తిరుగు పయనం అవుతున్నారు. తహసీల్‌ కార్యాలయాల్లో రోజుకు 10 స్లాట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ధరణి పోర్టల్‌లోనే సాంకేతిక ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలు ఉండడంతో ఒక రోజు గరిష్ఠంగా 220 స్లాట్లకు అవకాశం ఉంటుంది. నిజామాబాద్‌ జిల్లాలో 29 మండలాలు ఉండడంతో 290 స్లాట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం డిజిటల్‌ సంతకం పూర్తైన భూముల వివరాలను ధరణిలో నమోదు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3,15,928 వన్‌బీ ఖాతాల్లో భూములు ఉండగా, 2,58,685 వ్యవసాయ ఖాతాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 2,73,770 వన్‌బీ ఖాతాలుండగా, 2,59,745 వ్యవసాయ ఖాతాలున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి డిజిటల్‌ సంతకాలు పూర్తైన భూములకు మాత్రమే ధరణి సేవలు అందుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం 23 స్లాట్‌లు బుక్‌ చేసుకోగా, 18 రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. మంగళవారం 34 స్లాట్‌లుబుక్‌ చేసుకోగా, 25 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో సోమ, మంగళవారాల్లో 83 స్లాట్‌లు బుక్‌ చేసుకోగా, 61 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 

మ్యుటేషన్‌ చిక్కులకు చెక్‌

భూముల రిజిస్ట్రేషన్‌ సమయంలో రైతులకు, ప్రజలకు అవినీతి వేధింపులు తగ్గించేందుకు పూర్తి స్థాయి పారదర్శకతతో కూడుకున్న వ్యవస్థను సీఎం కేసీఆర్‌ రూపొందించారు. ఇందులో భాగంగా వీఆర్వో వ్యవస్థను ఇప్పటికే రద్దు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం, మున్సిపల్‌ సవరణ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ధరణి వెబ్‌సైట్‌ ప్రజా బాహుళ్యంలోకి రావడంతో రెవెన్యూ శాఖలో అవినీతి అంతమై ప్రజలందరికీ భారీ ఊరట దక్కుతోంది. ముఖ్యంగా మ్యుటేషన్‌ పరిశీలనలో తీవ్రమైన జాప్యంతో దరఖాస్తుదారులు కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. రిజిస్ట్రేషన్‌ శాఖలో స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న సమయంలోనే మ్యుటేషన్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. అక్కడే చేయకుండా ఈ తంతును ఇన్నాళ్లు మున్సిపాలిటీలపై వదిలేశారు. దాంతో చెల్లించిన ఫీజు వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి వచ్చేంత వరకు ఇక్కడ వేచి చూడాల్సి వచ్చేది. నూతన చట్ట సవరణలో మ్యుటేషన్‌, ఆస్తి పన్ను మదింపు ప్రక్రియ అధికారాలను మున్సిపల్‌ కమిషనర్ల నుంచి తొలగిస్తూ ఆ అధికారాన్ని సబ్‌ రిజిస్ట్రార్లకు అప్పగించారు. రిజిస్ట్రేషన్‌ అయిన వెంటనే ఆస్తి పన్ను రికార్డులో కొన్నవారి పేరు నమోదు చేయనున్నారు. దాంతో ఆస్తులు కొనుగోలు చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అమ్మకం, దానం, తనఖా, విభజన, వారసత్వ విధానంతో బదిలీలన్నీ ఆన్‌లైన్‌లో ఏక కాలంలో రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ అయిపోతుంది. అక్కడే మ్యుటేషన్‌ సర్టిఫికేట్‌ సైతం జారీ అవుతుండడం విశేషం.

15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌.. 15 రోజుల్లో ఇంటికే పాస్‌బుక్కు

ధరణిలో రైతుల మెప్పుపొందుతోన్న సేవలు అనేకం ఉన్నాయి. గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఎదురు చూపులు, తమ రిజిస్ట్రేషన్‌ సమయం కోసం పడిగాపులు పడాల్సి వచ్చేది. దళారి ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పట్టాదారు మాటకు విలువే లేకపోయేది. సబ్‌ రిజిస్ట్రార్లు కేవలం దళారుల మాటలు మాత్రమే వినేవారు. వారికి మాత్రమే కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టుకునేవారు. అలాంటి అరాచకమైన సేవలకు ధరణితో పుల్‌స్టాప్‌ పడింది. ఇప్పుడు కోరుకున్న సమయానికి స్థానికంగా మండల కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ 15 నిమిషాల్లోనే పూర్తవ్వడంపై సామాన్యులు కేసీఆర్‌ తీసుకొచ్చిన ఈ అత్యుత్తమ విధానాన్ని కీర్తిస్తున్నారు. అంతేకాకుండా ఈ నూతన విధానంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకం కోసం ఎవరికీ డబ్బులు చెల్లించే అవసరమే లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకున్న వారి చిరునామాకే పోస్టాఫీస్‌ ద్వారా పాస్‌బుక్‌ పంపుతుండడం ఇందులో మరో విశిష్టత. ఇందుకు కేవలం పోస్టల్‌ చార్జీలను మాత్రమే ప్రభుత్వం వసూలు చేస్తున్నది. ఎవరికీ అదనంగా ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని సర్కారు స్పష్టం చేస్తోంది. భూమి కొనుగోలు చేసిన వ్యక్తికి పాస్‌బుక్కు ఇది వరకే ఉంటే తహసీల్‌ కార్యాలయంలోనే భూమి వివరాలను జత చేసి ఇచ్చేస్తారు.

భూ తగాదాలకు విరుగుడు

వ్యవసాయ, ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల విషయంలో నిబంధనలను తుంగలో తొక్కి సబ్‌ రిజిస్ట్రార్లు ఇష్టానుసారంగా అక్రమార్కులకు రిజిస్ట్రేషన్లు చేశారు. వందలాది ఎకరాల భూమి నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో దొంగ రిజిస్ట్రేషన్‌ కాగితాలతో ఎంతో మంది అనర్హులకు హక్కు పత్రాలు జారీ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్లు చేసిన తప్పిదాలతో భూముల పేరిట ఘర్షణలు కోకొల్లలుగా చెలరేగాయి. సామాన్యులు అనేక మంది రోడ్డున పడి తమ భూమి కోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ధరణి పోర్టల్‌తో ఇకపై ఇలాంటి అక్రమాలకు అవకాశమే లేదు. భూ తగాదాలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం సమస్త విషయాలను క్రోడీకరిస్తూ ధరణి వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. ఇది బ్యాంకింగ్‌ తరహాలో నిర్వహించే వెబ్‌సైట్‌గా అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఐటీ రంగ నిపుణుల పర్యవేక్షణలో ఈ వెబ్‌సైట్‌ పనిచేస్తుంది. గ్రామస్థాయిలో చిన్న చిన్న పనులు, పేర్ల మార్పులు వంటివి చేసినా రాష్ట్ర స్థాయి అధికారుల వరకు క్షణాల్లో తెలిసి పోతుంది. ప్రతి విషయంలో పారదర్శకత, జవాబుదారీ తనం ఉండేలా నూతన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా భూతగాదాల నివారణే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించింది.

ఏడాది సంది తిరిగినా పని కాలే

చందూర్‌ : మా అమ్మ పట్టా నుంచి గిఫ్ట్‌గా నా పేరుమీద చేసుకుందామని ఏడాది నుంచి తిరిగినా పనికాలేదు. ధరణితో నా పని క్షణాల్లో అయ్యిదంటే నమ్మలేక పోతున్నా. కేసీఆర్‌ సార్‌ రైతుల పక్షపాతి. రైతులకు బాధలు ఉండొద్దని ఈ ధరణి పెట్టినట్టు ఉన్నడు. గతంలో ఏ పని కావాలన్నా బోధన్‌కు వెళ్లేవాళ్లం. ఇప్పుడు మా ఊర్లనే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నరు. ఇంతకు ముందు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం చుట్టూ రోజులతరబడి తిరిగేవాళ్లం. 

- సుబ్బురు లక్ష్మణ్‌, రైతు, చందూర్‌

 భారం తగ్గింది..

 ఇందల్వాయి : సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ సేవలతో భారం తగ్గింది. సేవల ప్రారంభం రోజే మొదటి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడం... తక్కువ సమయంలో పూర్తి కావడం ఆనందంగా ఉంది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లే పని తగ్గింది. ధరణి సేవలు అందుబాటులోకి రావడంతో సమయం ఆదా కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందులు తప్పాయి. సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. 

- నోముల నితీశ్‌, ఇందల్వాయి

ఎదురు చూసే తిప్పలు తప్పాయి

రుద్రూర్‌ : ధరణితో భూముల రిజిస్ట్రేషన్‌ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. రిజిస్ట్రేషన్‌ కోసం గంటల తరబడి ఎదురుచూసే తిప్పలు తప్పింది. గతంలో ఆఫీసుల పొంటి తిరగాల్సి వచ్చేది. గంటల కొద్ది లైన్‌లో ఉండాల్సి వచ్చేది. షూరిటీని కార్యాలయానికి తీసుకెళ్తే వారు వేచి ఉండలేక మధ్యలోనే వెళ్లిపోయేవారు. మళ్లీ వారిని తీసుకురావడం పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకుని తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం చాలా సులభంగా అనిపిస్తుంది. కేసీఆర్‌ తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది. మా అమ్మ పేరున ఉన్న 30 గుంటల భూమి నేను, మా తమ్ముడి పేరున రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాం. మండలంలో మాదే మొదటి రిజిస్ట్రేషన్‌. 

- కౌలాస్‌ గంగాధర్‌, రైతు, రుద్రూర్‌

కేసీఆర్‌ సార్‌కు దండం పెట్టాలె

దోమకొండ : వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌కు గతంలో చాలా సేపు పట్టేది. మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న తరువాత పాస్‌పుస్తకం కోసం తహసీల్‌ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వచ్చేది. చేతులు తడిపినా పనయ్యేది కాదు. కానీ ఇయ్యాల అయిన పని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. నా భర్తపేరుమీద ఉన్న భూమిని నా పేర పట్టా చేసేందుకు మ్యుటేషన్‌ కోసం వచ్చిన. గంట సేపట్ల పనైంది. వెంటనే నా పేరు మీద భూ యాజమాన్య పత్రాలు ఇచ్చారు. ఇంతజల్ది పని కావడం నమ్మలేకపోతున్న.  

-సాప నర్సవ్వ, సంగేమేశ్వర్‌, దోమకొండ

ఇబ్బందులు తొలగిపోయాయి

మోపాల్‌ (ఖలీల్‌వాడి) :  రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో చేస్తున్నది. కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో మరింత మేలు చేకూరుతున్నది. రిజిస్ట్రేషన్ల పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేసే పద్ధతికి స్వస్తిపలికినైట్లెంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి అనడానికి ధరణి ఒక నిదర్శనం. ముదక్‌పల్లి గ్రామశివారులోని అనూషకు చెందిన వ్యవసాయభూమిని నా పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న. గంటలోపే పనైపోయింది. గతంలో దళారులదే రాజ్యమన్నట్లు ఉంటుండే. నెలల తరబడి తిరగాల్సి వచ్చేది.

25 నిమిషాల్లోనే పాస్‌బుక్‌

నిజామాబాద్‌ రూరల్‌ : ధరణి సేవలు బాగున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని తొందరగా అయిపోయింది. 25 నిమిషాల్లోనే పట్టా అందజేశారు. 10 గుంటల భూమికి సంబంధించిన కొత్త పాస్‌బుక్‌ అందుకోవడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్‌ సార్‌ కొత్తగా తెచ్చిన ధరణి సేవలో రిజిస్ట్రేషన్‌ మరింత సులువైంది. రైతులందరికీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. గతంలో రిజిస్ట్రేషన్‌ కోసం రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా పోయింది. 

- వన్నెల లక్ష్మి, పాల్ద

చాలా సులువుగా అయిపోయింది

ఎల్లారెడ్డి రూరల్‌ : ఇంతకుముందు రిజిస్ట్రేషన్‌ అంటే చాలా పెద్ద ప్రాసెస్‌ ఉంటుండె. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుణ్యమా అని ఇప్పుడు మస్తు ఈజీగా రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. సోమవారం మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకొని, ఈ రోజు ఎల్లారెడ్డి తహసీల్‌ కార్యాలయానికి వచ్చినం. అద్ద గంటల పని అయిపోయింది. తహసీల్దార్‌ సారు మాకు రిజిస్ట్రేషన్‌ కాయిదాలు ఇచ్చిండు. ఎక్కడా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా పని జల్దీ అయిపోయింది. సీఎం కేసీఆర్‌ సార్‌కు ధన్యవాదాలు.

 - సాతెల్లి లక్ష్మి, వెల్లుట్ల, ఎల్లారెడ్డి

కలలో కూడా ఊహించలేదు

నస్రుల్లాబాద్‌ : రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇంత త్వరగా పూర్తవుతుందని కలలో కూడా ఊహించలేదు. గతంలో కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు అయ్యేవి కావు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూములకు తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా అవకాశం కల్పించడంతో రైతుల ఇబ్బందులు దూరమైనట్లే. ఒకే రోజులో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది.

-ఎం.శ్రీకర్‌గౌడ్‌, నెమ్లి, నస్రుల్లాబాద్‌

సులువుగా రిజిస్ట్రేషన్‌

కోటగిరి : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ సులువుగా అయిపోయింది. కేవలం గంటలోపు పని పూర్తయింది. సోమవారం స్లాట్‌ బుక్‌ చేసుకున్నా. మంగళవారం రిజిస్ట్రేషన్‌ తేదీ వచ్చింది. కోటగిరి తహసీల్‌ కార్యాలయానికి వెళ్లగానే అధికారులు ధరణి ద్వారా అత్యంత సులువుగా తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేశారు. నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే అవస్థలు ధరణితో తీరిపోయాయి. ప్రభుత్వం రైతుల కోసం మంచి పని చేసింది.  

- మహేందర్‌రెడ్డి, రైతు, ఎత్తొండ, కోటగిరి

తిప్పలు లేకుండా జేసిండు 

రెంజల్‌ : గప్పట్ల రిజిస్ట్రేషన్‌ అంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్‌ కోసం బోధన్‌కు పోతే రోజంతా ఆన్నే గడిసిపోయేది. రైతుల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచి పనిజేసిండు. ఆయన సల్లంగ ఉండాలే. ఆపీసుకు పోంగానే ఫ్యాన్‌ కింద కూర్చోబెట్టి పని జేసిండ్రు. గప్పుడు ఇదే పని కోసం ఆఫీసుకు పోతే ‘సార్‌ లేడు.. మీటింగ్‌ పోయిండు.. మల్ల రా’ అని తిప్పి పంపేటోళ్లు. అందరి నోళ్లు మూపించి సర్కారు మంచి సౌలత్‌ జేసింది. 

 - దుంపాల సరస్వతి, కళ్యాపూర్‌, రెంజల్‌


logo