సోమవారం 18 జనవరి 2021
Nizamabad - Nov 02, 2020 , 00:15:48

రైతు ముంగిట్లో ధాన్యపు రాశులు

రైతు ముంగిట్లో ధాన్యపు రాశులు

జోరుగా ధాన్యం కొనుగోళ్లు

ఉమ్మడి జిల్లాలో 785 కేంద్రాలు ఏర్పాటు

12 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

మద్దతు ధరకు కొనుగోళ్లతో రైతుల హర్షాతిరేకాలు 

ధాన్యలక్ష్మితో కళకళలాడుతున్న పల్లెలు

‘ఏ’ గ్రేడ్‌ పరిధిలోకి సన్నరకాలు 

నియంత్రిత సాగువిధానంతో ఇబ్బడిముబ్బడిగా దిగుబడులు 

బోధన్‌ / బాన్సువాడ 

తెలంగాణ అన్నపూర్ణగా పేరొందిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా మరోసారి ధాన్యలక్ష్మితో కళకళలాడుతోంది. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్‌ తదితర పథకాల అమలుతోపాటు సాగుకు అన్ని రకాల ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. దీనికితోడు వర్షాలు కురవడం, ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సకాలంలో అందుబాటులో ఉంచడంతో ఈ వానకాలం సీజన్‌లో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటలు పండించారు. నియంత్రిత సాగు విధానాన్ని పాటిస్తూ పుష్కలంగా దిగుబడులు రాబట్టారు. కేసీఆర్‌ పిలుపుమేరకు సన్నరకం వరిని ఎక్కువ విస్తీర్ణంలో  సాగుచేశారు. ధాన్యం దిగుబడులు గణనీయంగా వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 785 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 12 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ధాన్యం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ

కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం వచ్చేలా.. తద్వారా  మద్దతుధరలను పూర్తిస్థాయిలో రైతులు పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. కోతలకు ముందే వ్యవసాయశాఖ, సహకారశాఖల ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వరి కోతల హార్వెస్టర్లకు బ్రోవర్లను అమర్చాలని, తద్వారా కోతల సమయంలోనే తాలు, పొట్టు తొలగించాలని సూచించారు. అలాగే మార్కెట్‌యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోతకు, చెత్తాచెదారం తొలగించేందుకు చెన్నీ యంత్రాలను ఏర్పాటుచేశారు. ఎఫ్‌సీఐ ప్రమాణాల మేరకు 17 శాతం కన్నా ఎక్కువ తేమలేకుండా ధాన్యం తీసుకురావాలన్న విషయంలో కసరత్తు జరుగుతోంది. తద్వారా రైస్‌మిల్లర్లు తరుగు, కడ్తా పేరిట తూకంలో కోతలు చేయకుండా నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషిచేస్తోంది.  

నిజామాబాద్‌లో 445.. కామారెడ్డిలో.. 340 కేంద్రాలు

ఉమ్మడి జిల్లాలో మొత్తం 785 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. నిజామాబాద్‌లో 445 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 247 రైసుమిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 340 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని సహకార సంఘాలు, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

‘ఏ’ గ్రేడ్‌గా సన్నరకం ధాన్యం

సన్నరకం ధాన్యాన్ని కామన్‌ గ్రేడ్‌గా కాకుండా వాటిని ‘ఏ’ గ్రేడ్‌గా పరిగణించి కొనుగోళ్లు చేయాలని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి ఇటీవల రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సెల్‌కాన్ఫరెన్సులో సూచించారు. వాస్తవానికి నిబంధనల మేరకు సన్నరకం ధాన్యం ఇప్పటివరకు కామన్‌ గ్రేడ్‌ పరిధిలో ఉంది. దొడ్డురకం ధాన్యంలో చాలా రకాలు ‘ఏ’గ్రేడ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యం మద్దతు ధర క్వింటాలుకు రూ. 1.888 గా ఉండగా, కామన్‌ గ్రేడ్‌ ధాన్యాన్ని రూ.1,868 మద్దతు ధర చెల్లిస్తున్నారు. వాస్తవానికి సన్నరకాలను పండించేందుకు పెట్టుబడులు ఎక్కువగా ఉండడమే కాకుండా, వాటి సాగుకు చాలా కష్టపడాల్సివస్తోంది. అయితే, రాష్ట్రంలో పండే సన్నరకాలకు మద్దతు ధరలను కామన్‌గ్రేడ్‌ కిందే చెల్లిస్తూ వచ్చారు. కేసీఆర్‌ పిలుపుమేరకు నిర్ణీత సాగు విధానంలో రైతులు సన్నరకాలను సాగుచేశారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం నిజామాబాద్‌ జిల్లాలో మాత్రం సన్నాలకు ‘ఏ’ గ్రేడ్‌ కింద మద్దతు ధర ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

సకాలంలో పంట కొనుగోళ్లు

వరి పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు చోట్ల పంటలు నీటమునిగాయి. మరికొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. వరుసగా కురిసిన వర్షాలతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వరుణుడు శాంతించగానే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. మార్కెట్‌లోకి ధాన్యం రాకముందే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో రైతులు ఊరట చెందారు. అప్పటికే కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యాన్ని కేంద్రాలకు తరలించారు. మిగతా రైతులు సైతం కోతలు వేగవంతం చేసి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే పనిలోపడ్డారు. వరికోతలు జోరందుకోవడంతో ఉమ్మడి జిల్లాలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. 

ఎటు చూసినా ధాన్యపు రాశులే..

గతంతో పోల్చితే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఈ సారి పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఎటు చూసినా ధాన్యపు రాశులే కనిపిస్తున్నాయి. వానకాలం సీజన్‌లో నిజామాబాద్‌ జిల్లాలో 9 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 7 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కామారెడ్డి జిల్లాలో 6 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ఈ సీజన్‌లో 2 లక్షల 43 వేల 394 ఎకరాల్లో వరి పంటలను సాగు చేశారు. సన్నరకాన్ని లక్షా 16 వేల 673 ఎకరాల్లో, దొడ్డురకం వరిని లక్షా 26 వేల 721 ఎకరాల్లో సాగు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 3.79 లక్షల ఎకరాల్లో సాగుచేశారు. ఇందులో 2.53 లక్షల ఎకరాల్లో సన్నరకాలను పండించారు. మిగిలిన 1.26 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం వరి వంగడాలను సాగుచేశారు. 

 భయం పోయింది..

గ్రామాల్లో కాంటాలు నడువడంతో భయం పోయింది. ఎక్కడ సూసినా వడ్ల కుప్పలే కనిపిస్తున్నయ్‌. ఎట్లనో అనుకన్నాం. కానీ ప్రభుత్వం రైతులకు మంచి చేస్తున్నది. పంట పెట్టుబడి ఇచ్చింది. మంచి విత్తనాలు ఇవ్వడంతో పాటు, ఎరువులు అందుబాటులో ఉంచింది. అన్ని రకాలుగా రైతులకు మేలు చేస్తున్నది. సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు.

- కల్లూరి హన్మాండ్లు, రైతు, కొల్లూర్‌, బాన్సువాడ