ఆదివారం 29 నవంబర్ 2020
Nizamabad - Oct 29, 2020 , 00:37:07

అభివృద్ధి పనులకు ఆమోదం

అభివృద్ధి పనులకు ఆమోదం

ఆర్మూర్‌ మున్సిపల్‌లో రూ.4 కోట్ల 71 లక్షలు

సిద్ధుల గుట్ట ఘాట్‌ రోడ్డుకు రూ.2కోట్ల 45 లక్షలు

ఆర్మూర్‌: పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మున్సిపల్‌ కార్యవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. బుధవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మొదటగా పట్టణ పరిధిలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపు వివరాలను కమిషనర్‌ శైలజ, సిబ్బంది చదివి వినిపించారు. 38 పనులకుగాను రూ.4కోట్ల 71 లక్షల పైచిలుకు నిధులకు మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలుపగా, నవనాథ సిద్ధుల గుట్టకు ఒకే పని కోసం రూ.2కోట్ల 45 లక్షల నిధులను కేటాయిస్తూ పాలకవర్గం ఆమోదం తెలిపింది. అనంతరం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్మూర్‌ మున్సిపల్‌ అభివృద్ధి కోసం మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకువస్తానని అన్నారు. సిద్ధుల గుట్ట అభివృద్ధి, ఘాట్‌ రోడ్డు నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని అసెంబ్లీలో మంత్రులను కోరినట్లు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత, వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, కమిషనర్‌ శైలజ, తహసీల్దార్‌ సంజీవ్‌రావు, ఏడీఏ హరికృష్ణ, మున్సిపల్‌ ఏఈ భూమేశ్వర్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు.