అర్వింద్ అబద్ధాలకోరు!

మాధవనగర్ ఆర్వోబీలో రాష్ట్ర వాటా రూ.63 కోట్లు
కేంద్రం ద్వారా వచ్చే నిధులు కేవలం రూ.30 కోట్లే
ప్రజలను మోసం చేస్తున్న ఎంపీ
ఎంపీగా నిజామాబాద్ ప్రాంతానికి చేస్తున్న కృషి శూన్యం
సొంత పార్టీలోనే అర్వింద్ పట్ల ఈసడింపు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నిజామాబాద్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ
నిజామాబాద్ నగర శివారులోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు పచ్చి మోసపూరితమైనవని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆర్వోబీ విషయంలో ఎంపీగా అర్వింద్ చేసిన కృషి ఏమీ లేదని చెప్పారు. తాను ఏదో చేసినట్లుగా సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బాజిరెడ్డి ధ్వజమెత్తారు. ఆర్వోబీ నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా సగానికి ఎక్కువ అని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తం రూ.93 కోట్లలో రాష్ట్ర వాటా రూ.63 కోట్లు అని స్పష్టం చేశారు. ఇందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.30 కోట్లు మాత్రమేనని వివరించారు. ఇందుకు సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లేఖను బాజిరెడ్డి గోవర్ధన్ బయట పెట్టారు. అందులో దక్షిణ మధ్య రైల్వే జీఎంకు కేంద్రం స్పష్టంగా ఎవరి వాటా, ఎంత అన్నది పేర్కొన్నది. కేంద్రం చెప్పే విషయాలను సైతం ఎంపీ వక్రభాష్యం చెబుతుండడం సిగ్గు చేటని బాజిరెడ్డి చెప్పారు. నిజామాబాద్ ప్రజలకు దసరా కానుక కాదని మోసపూరిత ప్రకటనగా అభివర్ణించారు. పసుపు బోర్డు మాదిరిగానే మాధవనగర్ ఆర్వోబీ విషయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోమారు ప్రజలను మభ్యపెడుతున్నారని బాజిరెడ్డి వెల్లడించారు.
రైతుల విశ్వాసం కోల్పోయిన వ్యక్తి అర్వింద్
ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని ఎన్నికల్లో హామీలు ఇచ్చిన ధర్మపురి అర్వింద్... ఎంపీగా గెలిచిన తర్వాత ముఖం చాటెయ్యడంతో రైతుల్లో విశ్వాసం కోల్పోయాడని బాజిరెడ్డి దుయ్యబట్టారు. పూటకో అబద్ధం చెబుతూ కాలం గడుపుతున్న అర్వింద్‌పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని చెప్పుకొచ్చారు. ఒంటిపై నూనె రాసుకుని తిరిగే వ్యక్తి అని, పట్టుకుంటే జారిపోవడం అతని తత్వమని వివరించారు. ఇచ్చిన హామీలపై నిలదీద్దామంటే కనీసం జుట్టు కూడా చేతికి అందకుండా తిరుగుతాడంటూ వ్యంగ్యంగా స్పందించారు. ‘సిగ్గూ ఎగ్గూ లేకుండా నిత్యం పచ్చి అబద్ధాలు ఆడడం ఆయన నైజం. ఏదో ఒక వీడియోను వైరల్ చేయడం. దానిపై టీఆర్ఎస్ నుంచి వచ్చే విమర్శలకు కనీసం జవాబివ్వలేని అసమర్థుడు.’ అంటూ రూరల్ ఎమ్మెల్యే తనదైన శైలిలో మండిపడ్డారు. బిల్డప్ మనిషి తప్ప, పని చేసే తత్వం లేని వ్యక్తిగా అభివర్ణించారు. జిల్లా ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పనిని చేయడం లేదని, నిజామాబాద్ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ద్వారా ఏ మంచి పని తెచ్చినా స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. కానీ మాటలతో పబ్బం గడపడం తప్ప ప్రజలకు ఎంపీ అర్వింద్ ఉపయోగపడడం లేదని తెలిపారు. ఎంపీగా గౌరవ ప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిగా అర్వింద్ పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.
అర్వింద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ముఖ్యమంత్రి జీతం మేమే ఇస్తున్నామని దుబ్బాక ప్రచారంలో చెప్పుకోవడం చూస్తుంటే ఎంపీ అర్వింద్ దొంగ మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలని బాజిరెడ్డి సూచించారు. అర్వింద్ తండ్రి డీఎస్‌కు కేసీఆర్ ద్వారానే జీతం అందుతుందని వివరించారు. తమకు ప్రజలు జీతాలు ఇస్తున్నారని వివరించారు. ప్రజల్లో ఏదో హల్ చల్ చేయాలని తప్ప మంచి చేయాలనే ఉద్దేశమే ఎంపీకి లేదన్నారు. తండ్రి మాటలే వినని అర్వింద్‌కు బుద్ధి చెప్పేంత పెద్ద మనిషిని కాకపోయినప్పటికీ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని, అయినప్పటికీ తామెక్కడా డబ్బా కొట్టుకోవడం లేదని వివరించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో చేయని అనేక పనులు వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, రైతువేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఎంపీ మాటలు కోటలు దాటుతున్నాయని, పనులు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ మాట్లాడే తీరును చూస్తున్న వారంతా అర్వింద్‌ను జోకర్లా, పనికిరాని వ్యక్తిలా భావిస్తున్నారని చెప్పారు. మాధవనగర్ ఆర్వోబీ విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్పిన ఎంపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధర్మపురి అర్వింద్‌ను బీజేపీ నేతలే నమ్మడం లేదని, ఆయనపై విశ్వాసం లేకనే ఆ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొన్నటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలిపారని గుర్తుచేశారు.
తాజావార్తలు
- విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
- గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
- వ్యాక్సినేషన్‌పై అపోహలు వద్దు
- రూ.1,883 కోట్ల మద్యం తాగేశారు
- శివ నిస్వార్థ సేవలు అభినందనీయం
- ఆర్మీ ర్యాలీలో తెలంగాణ సత్తా చాటాలి
- పట్టణ వేదిక.. ప్రగతి కానుక
- లక్ష్యంపై గురి!
- దళిత రైతు కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు
- చంద్రబోస్ జయంతిని జయప్రదం చేయాలి