ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Oct 24, 2020 , 00:58:45

ప్రత్యేక పూజలు.. కుంకుమార్చనలు..

ప్రత్యేక పూజలు.. కుంకుమార్చనలు..

వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

నమస్తే తెలంగాణ యంత్రాంగం: దేవీమాతకు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు కొనసాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. నగరంలోని  వివేకానంద నగర్‌లో దేవీమాతను శుక్రవారం కాళరాత్రి అమ్మవారిగా అలంకరించి పూజలు చేశారు. చెరుకు లక్ష్మణ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో మండపంలో కుంకుమార్చన నిర్వహించారు.  వినాయక్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీలో అమ్మవారిని రాజరాజేశ్వరీ మాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞం చేశారు. మోపాల్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండపంలో మహిళలు కుంకుమార్చన చేశారు. ఇందల్వాయి మండలం తిర్మన్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో సరస్వతీ విగ్రహానికి ఉపాధ్యాయ సిబ్బంది, ఎంపీపీ రమేశ్‌ నాయక్‌ ప్రత్యేక పూజలు చేశారు. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో దుర్గామాతకు పంచామృతంతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నదానం చేపట్టారు.  ధర్పల్లి  మండలం వాడి గ్రామంలో 20 ఏండ్లుగా ఏర్పాటు చేస్తున్న దేవీమాత మండపంలో విశేష పూజలు, హోమం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. కోటగిరి మండలం పొతంగల్‌ గ్రామంలో కుంకుమార్చన నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. వికేకానంద యూత్‌, కోటగిరి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రుద్రూర్‌ మండల కేంద్రంలోని నగరేశ్వర ఆలయంలో, రాణంపల్లిలో, మోర్తాడ్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, యజ్ఞాలు, అన్నదానాలు కొనసాగాయి.  నందిపేట్‌ మండలం కౌల్‌పూర్‌ భూమా యోగేశ్వర ఆశ్రమంలో ఆమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలశపూజ చేశారు. వెల్మల్‌లోని మున్నూరుకాపు సంఘంలో, డొంకేశ్వర్‌, మారంపల్లి గ్రామాల్లో పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బోధన్‌ మండలం ఎరాజ్‌పల్లి, రాజీవ్‌నగర్‌ తండా గ్రామాల్లో  హోమం,  అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. ఆర్మూర్‌ పట్టణంలోని విద్యానగర్‌లో అమ్మవారిని గాజులతో అలంకరించి పూజలు చేశారు.  హౌసింగ్‌ బోర్డు కాలనీలో మహిళలు కుంకుమార్చన నిర్వహించారు.   

రూరల్‌ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ పూజలు..

జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామంలో అమ్మవారికి రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ హరిత, సర్పంచ్‌ పద్మ, ఉప సర్పంచ్‌ రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భోజన్న, నాయకులు ఉన్నారు. నగర పరిధిలోని ముబారక్‌నగర్‌ పెద్దమ్మ ఆలయంలో  జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఆయన వెంట కేసీఆర్‌ సేవాదళ్‌ జిల్లా అధ్యక్షుడు రమణారావు, నాయకులు గోపాల్‌ నగేశ్‌, మనోహర్‌రావు, అంజయ్య, నాగారావు ఉన్నారు.