శనివారం 05 డిసెంబర్ 2020
Nizamabad - Oct 22, 2020 , 01:52:33

బతుకమ్మ పూలలో ఔషధ గుణాలెన్నో..

బతుకమ్మ పూలలో ఔషధ గుణాలెన్నో..

బతుకమ్మ పండుగలో ప్రథమ స్థానం పూలదే. ఏటి గట్లు, పొలం గట్లపై విరబూసిన అచ్చమైన పల్లె పూలే బతుకమ్మలో అందంగా ఒదిగిపోతాయి. రంగుల హరివిల్లులా పరుచుకుంటాయి. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో.. తీరుతీరున బంగారు బతుకమ్మను అలంకరిస్తారు. తంగేడు, బంతి, గునుగు, పట్టుకుచ్చులు, కట్ల పూలు, మందారాలు, గన్నేరు, గుమ్మడి.. ఒకటేమిటి ఎన్నో రకాల పూలు బతుకమ్మలో కొలువవుతాయి. అందుకే ఈ పండుగ ప్రకృతిని ఆరాధించే వేడుకగా విలసిల్లుతున్నది. బతుకమ్మకు ఉపయోగించే పుష్పాల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తంగేడు, గుమ్మడి, మందారం, సీతజడ, కట్లపూవు, పొగడపూవు, రుద్రాక్ష, గునుగు, పట్నం బంతి, గోగుపూవు, చామంతి, గోరింటలో ఎక్కువ మోతాదులో ఔషధాలు గుణాలు ఉన్నాయి.

-కోటగిరి

కాశీరత్నం పూవు..

ఎరుపు రంగులో ఉండే కాశీరత్నం పువ్వు ఫంగస్‌ను అరికడుతుంది. మూత్రవ్యాధి, మలబద్ధకాన్ని అదుపులో ఉంచుతుంది. నొప్పి, వాపు, గడ్డలకు చక్కని మందు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టడంలో ఈ పూలు ఉపయోగపడుతాయి.

రుద్రాక్ష..

రుద్రాక్ష పుష్పాల శాస్త్రీయ నామం ‘మికాబిలిస్‌ జలపా’ ఈ ఆకు రసం గాయాలకు, చర్మవ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. దుంపలను బెల్లంలో దంచి మాత్రలుగా చేసి తీసుకుంటే ఛాతికండరాల నొప్పులను నివారిస్తుంది.

కట్ల పూవ..

కట్ల పూల శాస్త్రీయ నామం ‘ఐసోమియా టర్బినేటా’ విత్తనాల పొడిని జ్వరం నివారిణిగా, ఆకుల రసాన్ని కీటకనాశనిగా వాడుతారు.

గోగు పూవు..

గోగుపువ్వు శాస్త్రీయ నామం ‘హైబిస్కస్‌గకన్నా బినస్‌' ఈ పుష్పాల రసాన్ని పంచదార, నల్ల మిరియాలతో 

కలిపి మలబద్ధకం, ఎసిడిటీ నివారణకు ఉపయోగిస్తారు.

గడ్డిపూలు..

బతుకమ్మలో ఉపయోగించే మరో పూలు గడ్డిపూలు. ఉబ్బసం, కోరింత దగ్గు, విరేచనాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పసి పిల్లల్లో జ్వరం, కళ్ల మంటలు, పిల్లలు నిద్రలో ఏడుపుకి మంచి మందుగా సహకరిస్తుంది. గొంతు, కాళ్ల నొప్పులను ఇట్టే తగ్గిస్తాయి. జీర్ణక్రియను పెంచి ఆకలిని కలిగిస్తుంది. 

పట్టు కుచ్చు..

బతుకమ్మలో కుచ్చులాంటి పూలను పట్టుకుచ్చు అంటారు. అందంతోపాటు వెలకట్టలేని ఔషధ గుణాలు వీటిలో ఉన్నాయి. ఆకులు కాండం పుండ్లు, తెగిన చర్మానికి మంచి మందుగా ఉపయోగపడుతుంది. గింజలు జీర్ణకోశ వ్యాధులు పేగు సంబంధ వ్యాధులను నివారిస్తాయి. జ్వరం, కాలేయ వ్యాధులను దరిచేరనీయదు. పాము విషానికి చక్కని విరుగుడు పట్టుకుచ్చు.

బీరపూవు..

బీరపువ్వు శాస్త్రీయ నామం ‘ల్యూఫా ఆక్యు టాంగూలా’ ఇది చర్మవ్యాధులు, మలబద్ధాకాన్ని నివారిస్తుంది.

కలువ పూవు..

కలువ పువ్వు శాస్త్రీయ నామం ‘నింఫియాప్యుబిసెస్‌' విత్తనాలు, పత్రాలు, రొమ్ము అనేక జీర్ణాశయ, మూత్రాశయ సంబంధవ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.

తంగేడు..

తంగేడు పూవు శాస్త్రీయ నామం ‘కేసీయూ అరిక్యూలేటా’ ఇది కంటి సంబంధ వ్యాధులు, మధుమేహం, మూత్రాశయ వ్యాధులకు ఉపయుక్తం. ఏలికపాములు, చర్మవ్యాధుల నివారణకు దీని ఆకులు, వేర్లు ఔషధంగా పనిచేస్తాయి.

మందారం..

మందార శాస్త్రీయ నామం ‘హైబిస్కస్‌ కోసాసైన్బిస్‌' ఈ పుష్పాల నూనె తల వెంట్రుకలు నల్లగా ఉండడానికి ఉపయోగపడతాయి.

సీత జడ..

సీత జడ పూల శాస్త్రీయ నామం ‘సికోషియా క్రిస్టేటా’ దీని విత్తనాల నుంచి నూనె తీస్తారు. దీనిని దగ్గు నివారణకు ఉపయోగిస్తారు.

కనకాంబరం..

కనకాంబరాల్లో లెక్కకు మించిన ఔషధగుణాలున్నాయి. దీని ఆకులు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. సూక్ష్మజీవులు, బాక్టీరియా, ఫంగస్‌లను నివారిస్తాయి.

గునుగు ..

గునుగు పూవు శాస్త్రీయ నామం ‘సీటోయా అర్జెంషియా’ గునుగు విత్తనాల్లో డయేరియా, రక్తవ్యాధుల నివారణ, నోటి పూత నివారణకు సంబంధించిన ఔషధ గుణాలున్నాయి.

పట్నం బంతి..

పట్నం బంతి శాస్త్రీయ నామం ‘కాస్మస్‌ బైసిన్నేటన్‌' ఈ పుష్పాల నుంచి రంగులను తీసి ఉపయోగిస్తారు.

చామంతి..

చామంతి శాస్త్రీయ నామం ‘క్రై సాంథిమమ్‌ ఇండికమ్‌' ఆకులను మైగ్రేన్‌ నివారణకు ఉపయోగిస్తారు. ఈ పూల ఆకులతో తయారు చేసే టీ జలుబు, గొంతునొప్పిని తగ్గిస్తుంది. మొటిమలను తగ్గించడం, శరీరాన్ని చల్లబర్చడంలో చామంతి కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయ సంబంధవ్యాధులకు చామంతి దివ్య ఔషధం. ఒత్తిడి, కోపం లాంటి భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది.

గుమ్మడి..

గుమ్మడి శాస్త్రీయ నామం కుకుర్సిటా మాక్సిమా’ గుమ్మడి గుజ్జు కాలిన గాయాలకు, బొబ్బల నివారణలో యాంటీ హెల్మింథిక్‌గా ఉపయోగపడుతుంది.

తామర..

తామర శాస్త్రీయ నామం ‘నిలంబో న్యూసిఫెరా,. తామర తొడిమల నుంచి స్రవించే జిగురు పదార్థాన్ని డయేరియా నివారణకు, కొమ్మను అజీర్తి నివారణకు ఉపయోగిస్తారు.