బుధవారం 25 నవంబర్ 2020
Nizamabad - Oct 21, 2020 , 01:17:44

ఠంచన్‌గా పింఛన్‌ ..

ఠంచన్‌గా పింఛన్‌ ..

కరోనా క్లిష్ట సమయంలోనూ లబ్ధిదారుల చేతికి డబ్బులు

ఉపాధి కరువైనా ఆదుకున్న పింఛన్‌

లబ్ధిదారులకు రంది లేకుండా నిరంతరాయంగా అందజేత

ఆనందం వ్యక్తం చేస్తున్న వితంతువులు, దివ్యాంగులు

వృద్ధులకు కొండంత అండగా నిలుస్తున్న ఆసరా పెన్షన్లు

ఉభయ జిల్లాల్లో 4.13లక్షల మంది లబ్ధిదారులు 

నెలకు రూ.87.22కోట్లు పంపిణీ

సుజాత ఓ వితంతువు. భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన పిల్లలతో కష్టంగా జీవనం సాగిస్తున్నది.  కూలీనాలీ చేసుకుంటూ బతుకీడుస్తోన్న సమయంలో కరోనా నాటి నుంచి కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఉపా ధి అంతంత మాత్రంగానే ఉండడంతో చాలీ చాలని సంపాదనతో నెట్టుకొస్తున్నది. అలాంటి సమయంలో వితంతు పింఛన్‌ డబ్బులు రూ.2016 సుజాతకు భారీ ఊరట కలిగిస్తున్నది. పిల్లల పోషణకు పింఛన్‌ ఎంతగానో సహాయకారిగా నిలుస్తుండడంతో  రాష్ట్ర ప్రభు త్వం అందిస్తున్న  సాయాన్ని ఆమె నిత్యం స్మరించుకుంటున్నది.

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, ఎయిడ్స్‌, బోదకాలు వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పింఛన్‌ డబ్బులు లాక్‌డౌన్‌ సమయంలో కష్ట కాలాన్ని ఎదురీదేందుకు ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం కరోనా మిగిల్చిన గడ్డు కాలంలోనూ నెలవారీగా వస్తున్న పింఛన్‌ అభాగ్యులెందరికో ఆపన్నహస్తమై నిలబడుతున్నది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి మార్కెట్లు కోలుకుంటున్నప్పటికీ కొంత మంది వ్యాపారులు ఇదే అదునుగా జీతాలు చెల్లించేందుకు వెనుకాడుతున్నారు. కోతలు పెట్టి ఏడ్పిస్తున్నారు. ప్రశ్నిస్తే ఉద్యోగం తీసేస్తామంటూ బెదిరించడం వంటి ధోరణితో అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న వారిలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు, మరీ ముఖ్యంగా వృద్ధులకు నెలవారీ పింఛన్‌ అవసరాలను తీరుస్తూ ఆదుకుంటున్నది. ఎంతటి గడ్డు కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొన్నప్పటికీ పింఛన్లను మాత్రం ఎక్కడా నిలిపివేయలేదు. మరీ ముఖ్యంగా నిరంతరాయంగా ఎలాంటి లోటు లేకుండానే ఆయా వర్గాలకు పింఛన్లు అందించడంతో చాలా మందికి మేలు జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంది.

కరోనా కష్టంలో ఎదురీత...

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వమైతే నేటికీ కరోనాను బూచీగా చూపించి నిధులను నిలిపేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడానికి ససేమిరా అంటున్నది.  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా సంక్షేమ పథకాలను మాత్రం ఆపలేదు. పింఛన్‌ పంపిణీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నది. నెలవారీగా పింఛన్లు పంపిణీ చేస్తూ పేదోళ్లకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నలా నిలుస్తున్నారు. వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఆఖరుకు వృద్ధాప్య పింఛన్‌ పొందే లబ్ధిదారులకు కోతల్లేని, సమయానుకూలంగా మంజూరవుతున్న పింఛన్‌ డబ్బులను అందుకుని మురిసిపోతున్నారు. మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా అమలైన లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. మే నెలాఖరుకు లాక్‌డౌన్‌ కాస్త అన్‌లాక్‌ అయినప్పటికీ ఇప్పుడిప్పుడే  సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.  అసంఘటిత వర్గాలకు పింఛన్‌ డబ్బులే చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. 

అభాగ్యులకు అండగా...

ఆసరా కోల్పోయిన అభాగ్యులకు కరోనా కష్టకాలంలోనూ పింఛన్లు నిరంతరాయంగా మంజూరవుతున్నాయి.  లక్షలాది మంది అభాగ్యులకు పింఛన్‌ డబ్బులు ఏకంగా రూ.2016కు చేరుతుండడంపై ఆనందం వ్యక్తం అవుతున్నది. ఇక దివ్యాంగుల పింఛన్లు రూ.3016కు చేతికొస్తుండడంతో వారంతా సంతోషం వెలిబుచ్చుతున్నారు. గతంలో వృద్ధాప్య పింఛన్లు దక్కాలంటే అదో ప్రహసనమే.. దరఖాస్తు చేసుకున్న లక్షలాది మందిలో కొద్ది మందికి మాత్రమే బొటాబొటిన ఇచ్చే రూ.200 పింఛన్‌ చేతికి అందేంది. అది కూడా దళారులు, మధ్యవర్తులు కమీషన్లు పుచ్చుకోగా నడవ చేతకాని వృద్ధులకు చేరడం గగనమే అయ్యేది. కానీ, రాష్ట్రంలో ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సీఎం కేసీఆర్‌ పింఛన్ల పంపిణీనిని మానవతా దృక్పథంతో చేపట్టారు. దళారులను నిలువరించడంతో పాటుగా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపికను చేపట్టారు. అర్హత ఉన్న వారందరికీ రూ.1000 నుంచి రూ.2016 పింఛన్‌ అందిస్తున్నారు. ప్రతి నెలా వృద్ధులకు పింఛన్‌ పంపిణీతో పాటుగా భరోసా కోల్పోయిన ఆయా వర్గాలకు సైతం పింఛన్‌ సౌకర్యం కల్పించారు. వితంతువులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు, బోధకాలు బాధితులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు సైతం పింఛన్లు మంజూరు చేస్తున్నారు. దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016 మంజూరు అవుతోంది.

ఒక నెలలో...

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఒక నెలలో అన్ని రకాల పింఛన్లు కలుపుకొంటే 4 లక్షల 13వేల 694 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ఒక్క నెలలోనే మొత్తం రూ.87.22 కోట్లు మంజూరవుతున్నాయి. కన్నవారి మమకారానికి దూరమై బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న చాలా మంది వృద్ధ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రూ.2016 పింఛన్‌ డబ్బులు కొండంత ఆసరాను కల్పించాయి. క్రమం తప్పకుండా రూ.2016కు చేరుతుండడంతో ఆసరా కోల్పోయిన బతుకుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో 2019, జూన్‌   నాటికి లక్షల 60వేల 4 మంది లబ్ధిదారులకు ఉండగా వీరికి నెలకు రూ.వేయి చొప్పున ప్రభుత్వం పింఛ న్లు అందించింది. ప్రతి నెలా రూ.26.98 కోట్లు వెచ్చించింది. రూ.2016కు పెరిగిన పింఛన్లతో   ప్రభుత్వంపై భారం పెరిగినప్పటికీ ఎక్కడా వెనుకడుగు వేయకుండానే పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం 2లక్షల 54వేల 232 మంది పింఛన్‌దారులున్నారు. వీరికి రూ.2016 చొప్పున పింఛన్‌ పంపిణీ జరుగుతున్నది.ప్రతి నెలా రూ.53.20 కోట్లు వెచ్చిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో లక్షా 59వేల 462 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రస్తుతం రూ.34.02 కోట్లు నెలవారీగా ప్రభుత్వం మంజూరు చేస్తున్నది.



నిజామాబాద్‌ జిల్లాలో పింఛన్ల వివరాలు 

లబ్ధిదారులు మొత్తం నిధులు 

వృద్ధాప్య 54679 రూ.11.02కోట్లు

దివ్యాంగులు 19449 రూ.5.87కోట్లు

వితంతు 70693 రూ.14.25కోట్లు

చేనేత 201 రూ.4 లక్షలు

గీత 1059 రూ.22 లక్షలు

ఒంటరి మహిళ 10016 రూ.2.02కోట్లు

బీడీ కార్మికులు 96144 రూ.19.38కోట్లు

ఎయిడ్స్‌ 1591 రూ.32లక్షలు

పైలేరియా 400 రూ.8 లక్షలు

మొత్తం 2,54,232 రూ.53.20కోట్లు

కామారెడ్డి జిల్లాలో.. 

లబ్ధిదారులు మొత్తం నిధులు

వృద్ధాప్య 46278 రూ.9.32కోట్లు

దివ్యాంగులు 18780 రూ.5.66కోట్లు

వితంతు 49726 రూ.10.02కోట్లు 

చేనేత 657 రూ.13.24లక్షలు

గీత 729 రూ.14.69లక్షలు

ఒంటరి మహిళ 4488 రూ.90.47లక్షలు

బీడీ కార్మికులు 37053 రూ.7.46కోట్లు

ఎయిడ్స్‌ 1222 రూ.24.63లక్షలు

పైలేరియా 529 రూ.10.66లక్షలు

మొత్తం 1,59,462 రూ.34.02 కోట్లు


పింఛన్‌ పైసలే ఆసరా అయినయ్‌

ఖలీల్‌వాడి : 70 ఏండ్లల గిప్పుడే పని లేక పరేషాన్‌ అయింది. కరోనా రోగమచ్చిందని పనులల్లకు రానీయలే..  అయినా మాకు తక్‌లీబ్‌ కాలే.. సీఎం సార్‌ ఇస్తున్న  రెండువేల పింఛన్‌ పైసల్‌ మాకు మస్తు ఆసరైనయి. గప్పట్ల రెండు నూర్లు ఇచ్చేటోళ్లు.. అవి ఏమిటికి సరిపోకపోతుండే.. 

- లక్ష్మి, నిజామాబాద్‌


బీడీ పింఛనే ఆధారమైంది..

లాక్‌డౌన్‌తో అందరూ ఇంట్లనే  ఉన్నరు. ప్రైవేటు జాబ్‌లు కూడా బంద్‌ అయినయి దీంతో బీడీ పెన్షన్‌ మాకు ఆధారం అయింది. బీడీ పెన్షన్‌ లేకుంటే ఇల్లు గడుసుడు కష్టం అయితుండే. సీఎం కేసీఆర్‌ సార్‌ జేసుట్ల బీడీ పెన్షన్‌ అస్తున్నది. 

-నాగమణి, నిజామాబాద్‌

పింఛన్‌తో కొండంత అండ..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరితో కుంటుబం అంతా చిన్నాభిన్నం అయింది. ఈ పరిస్థితుల్లో ఒంటరి మహిళా పెన్షన్‌ నాకు అండగా నిలిచింది. గతంలో ప్రైవేటు పాఠశాలలో పని చేసేదాన్ని కరోనా దెబ్బతో పని పోయింది. 

సునీత,నిజామాబాద్‌