బుధవారం 25 నవంబర్ 2020
Nizamabad - Oct 21, 2020 , 01:06:38

‘నూనె గింజల సాగుపై దృష్టి సారించాలి’

‘నూనె గింజల సాగుపై దృష్టి సారించాలి’

కోటగిరి : జిల్లా రైతులు నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని, వాటికి మంచి డిమాండ్‌ ఉన్నదని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ తెలిపారు. మండల కేంద్రంలోని రైతువేదిక నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మక్కజొన్నకు డిమాండ్‌ లేదని, ఇప్పటికే 20 లక్షల టన్నుల మక్కజొన్న నిల్వలు ఉన్నాయన్నారు. రాబోవు రోజుల్లో వరి సాగు కూడా తగ్గించి నూనె గింజలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని సొసైటీల్లో శనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 40శాతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాని, మిగతావి రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రైతులకు ఇబ్బంది కలుగకుండా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 106 రైతు వేదికలకు గాను  60 పూర్తయ్యాయని, మిగతా భవనాలు చివరిదశలో ఉన్నట్లు తెలిపారు. డీఏవో వెంట వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ కిశోర్‌బాబు, ఏఈవోలు గౌస్‌, ఉమ, సుప్రియ, జీవన్‌,  గంగాసాగర్‌, ఆస్మా ఉన్నారు.

రైతువేదికల పరిశీలన

డిచ్‌పల్లి/చందూర్‌: డిచ్‌పల్లి మండలం యానంపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతువేదిక భవనాన్ని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్‌మోహన్‌, ఐడీసీఎంఎస్‌ చైర్మన్‌ సాంబారి మోహన్‌తో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దసరాలోగా రైతులకు భవనాలను అందుబాటులోకి తేవాలని సూచించారు. వారివెంట స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు. చందూర్‌లో నిర్మిస్తున్న రైతువేదికను తహసీల్దార్‌ ముజీబ్‌ పరిశీలించారు.  ఆయన వెంట పీఆర్‌ ఏఈ పవన్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు అశోక్‌ ఉన్నారు.