మంగళవారం 26 జనవరి 2021
Nizamabad - Oct 21, 2020 , 01:03:27

బీడు భూములు తడవాలన్నదే కేసీఆర్‌ ఆశయం

బీడు భూములు తడవాలన్నదే కేసీఆర్‌ ఆశయం

మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష

ఖలీల్‌వాడి : బాల్కొండ నియోజకవర్గంలోని గొలుసుకట్టు చెరువులను నింపడానికి పూర్తి ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని అధికారిక నివాసంలో సాగునీటిపారుదలపై ఆ శాఖ అధికారులతో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. వరదకాలువపై తొమ్మిది తూముల నిర్మాణం ద్వారా ఆరు చెరువుల్లోకి కాళేశ్వరం నీళ్లు చేరుతున్నాయని, మరో మూడు చెరువులను నింపేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఆరు చెరువుల ద్వారా మరో ఎనిమిది చెరువులకు లింక్‌ చేసి మొత్తంగా 17 చెరువులకు వరదకాలువ ద్వారా కాళేశ్వరం నీళ్లు అందేలా పనులు చేపట్టాలన్నారు. ఎస్సారెస్పీ లక్ష్మీ కెనాల్‌ మీద 14 పాత తూముల ద్వారా 14 ప్రధాన చెరువులు నింపుతున్నామని, మరో 12 కొత్త తూముల నిర్మాణం చేపట్టి అదనంగా తొమ్మిది చెరువులు నింపేందుకు కృషి యాలని చెప్పారు. అంతిమంగా ఈ 23 చెరువుల నుంచి మరో 40 చెరువులను లింక్‌ చేసి మొత్తం 63 చెరువులను నింపాలని అధికారులను ఆదేశించారు. పల్లికొండ లిఫ్ట్‌ ద్వారా ప్రస్తుతం పల్లికొండ, సిద్దపల్లి చెరువులు నింపుతున్నామని తెలిపారు. బాచన్‌పల్లి, పిప్రి, పురాణిపేట్‌, భీమ్‌గల్‌, ముచ్కూర్‌ చెరువులు సైతం నింపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించా రు. గట్టుపొడిచిన వాగు ద్వారా ప్రస్తుతం కోనాసముందర్‌, బషీరాబాద్‌, అమీర్‌నగర్‌ చెరువులు నింపుతున్నామని తెలిపారు. చౌట్‌పల్లి చెరువు నింపే పనులు ప్రారంభించాలని, ఇనాయత్‌నగర్‌, నర్సాపూర్‌ చెరువులు నింపేందుకు మార్గాలు అన్వేషించాలని తెలిపారు. గుత్ప లిఫ్ట్‌ ద్వారా చివరి ఆయకట్టు చెరువులకు నీరందేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని వాగులపై ఇప్పటికే మెజారిటీ చెక్‌డ్యాములు నిర్మించామని, గొలుసుకట్టు చెరువులు నింపుకోవడం ద్వారా రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. సమీక్షా సమావేశంలో ఎస్సారెస్పీ సీఈ శంకర్‌, ఈఈ రామారావు పాల్గొన్నారు.


logo