అమర పోలీసులకు సెల్యూట్

నిజామాబాద్ జిల్లాలో 19 మంది వీరమరణం
వారి త్యాగాలను స్మరించుకోనున్న పోలీసుశాఖ
పరేడ్ మైదానంలో ఏర్పాట్లు పూర్తి
రేపు ఆన్లైన్లో ఓపెన్‌హౌస్
నిజామాబాద్ సిటీ/ఆర్మూర్:
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. సంఘవిద్రోహశక్తులను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి అమరులయ్యారు. ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తుల సంరక్షణ కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు పోలీసులు. అరాచకశక్తుల ఆటకట్టిస్తూ శాంతిభద్రతలను నెలకొల్పుతున్నారు. నిరంతరం ప్రజారక్షణకు పాటుపడుతున్నారు. ఎలాంటి ఆపదలో ఉన్నా ఒక్క పిలుపుతో మేమున్నామంటూ కదిలివస్తారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు అమరులయ్యారు. వారి సేవలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు.
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా..
శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారు. 1959లో దేశ సరిహద్దును చైనా ఆక్రమించేందుకు కుట్రపన్నింది. అక్సాయిచిన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది చైనా దురాక్రమణను ఎదిరించి అమరులయ్యారు. అక్టోబర్ 21న జరిగిన ఈ సంఘటనకు గుర్తుగా ప్రతి ఏటా పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నారు. అసాంఘికశక్తులు, తీవ్రవాదుల దుశ్చర్యలు, మతోన్మాదుల దురాగతాలను ఎదిరించడంలో పోలీసుల పాత్ర ఎనలేనిది. జిల్లాకు పొరుగునే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులుగా ఉండడంతో శాంత్రిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పగలు, రాత్రి తేడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారు. 1980వ దశకంలో ఉన్న పరిస్థితుల్లో శాంత్రిభద్రతల పరిరక్షణ కోసం ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. మావోయిస్టుల ఉనికి ఎక్కువగా ఉన్న సమయంలో శాంతిభద్రతల పరిక్షణకు పోలీసుశాఖ విరామం లేకుండా పనిచేసింది.
జిల్లాలో 19 మంది వీరమరణం
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అవిచ్ఛిన్న శక్తులతో జరిగిన పోరాటంలో 19 మంది పోలీసులు అమరులయ్యారు. మతోన్మాద, వేర్పాటువాద, విధ్వంసకర శక్తులకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించారు. నిజామాబాద్ జిల్లాలో 1986 నుంచి 2019 వరకు 19 మంది పోలీసులు అమరులయ్యారు. వీరిలో ఒక సీఐ, ఒక ఎస్సై, ఇద్దరు ఏస్సైలు, 13 మంది కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక హోంగార్డు ఉన్నారు. అమరుల స్మృత్యర్థం బుధవారం పోలీసు హెడ్‌క్వార్టర్‌లో పోలీసు అమరుల సంస్మరణ దినాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
అమరులైన పోలీసులు వీరే..
సీఐ ఎం.లింగారెడ్డి, ఎస్సై విక్టర్, ఏఎస్సైలు రాంచందర్‌రావు, ఎంఏ గఫార్, హెచ్‌సీ గంగాధర్, కానిస్టేబుళ్లు ఎండీ కుతుబుద్దీన్, సోమరాజు, సత్తయ్య, సయ్యద్ సర్వర్, రామ్‌చందర్, బషీరుద్దీన్, సుబ్బారావు, ఎండీ గౌస్, గణేశ్, నర్సయ్య, అంజయ్య, గంగాధర్, ఎన్.శంకర్, హెచ్‌జీ సీతారాం విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. అమరుల సేవలను స్మరించుకుంటూ నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో నేటి నుంచి 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఆన్లైన్లో ఓపెన్‌హౌస్, ఆన్లైన్ వ్యాసరచన పోటీలు, రక్తాదానశిబిరాల నిర్వహణ, లఘు చిత్రాలు, పబ్లిక్ స్థలాల్లో పోలీసు అమరుల గురించి తెలియజేస్తూ పోలీస్ బ్యాండ్, కళాబృందంతో పాటల కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
పోలీసు అమరవీరుల త్యాగాలు మ రువలేనివి. ప్రతి సం వత్సరం అమరుల ను స్మరించుకోవడం కోసం వారోత్సవా లు నిర్వహిస్తున్నాం. అమర పోలీసు కుటుంబాలకు అండగా ఉంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నాం. పోలీసులు మనోధైర్యంతో విధులు నిర్వహిస్తూ, ప్రజాసేవ కోసం పరితపిస్తున్నారు. అమరుల స్ఫూర్తితో పోలీసు సిబ్బంది విధులు నిర్వహించాలి.
-కార్తికేయ, పోలీసు కమిషనర్, నిజామాబాద్
రేపు ఆన్లైన్లో ఓపెన్‌హౌస్..
పోలీసు అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని నగరంలోని నాలుగో టౌన్ పోలీసు స్టేషన్ నుంచి గురువారం ఆన్లైన్ ద్వారా ఓపెన్‌హౌస్ నిర్వహిస్తామని సీపీ కార్తికేయ తెలిపారు. ఈ ఓపెన్‌హౌస్‌లో పోలీసు స్టేషన్ల పనితీరు, రికార్డులు, సిబ్బంది విధులు, నేరాల నియంత్రణకు టెక్నాలజీ వినియోగం, ఆయుధాల వాడకం, కోర్టు సిబ్బంది తదితర విషయాలు వివరిస్తామని తెలిపారు. ఆన్లైన్లో ఓపెన్‌హౌస్‌ను చూసేందుకు ఆసక్తి ఉన్నవారు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు www.nizamabadpolice.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మిగతా వివరాలకు 94404 73404 సెల్ నంబర్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
తాజావార్తలు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?
- సంప్రదాయానికి స్వస్తి.. తైవాన్ జామతో దోస్తీ..!