దసరాకు స్పెషల్ బస్సులు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపడానికి హైదరాబాద్ నగరంలోని వివిధ పాయింట్లను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి రంగారెడ్డి రీజినల్ మేనేజర్ బి.వరప్రసాద్ వివరాలను సోమవారం వెల్లడించారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేకంగా 2,034 బస్సులను నడుపనున్నారు. ఈ నెల 22న 657 బస్సులు, 23న 659 బస్సులు, 24న 614 బస్సులను పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనంగా నడుపనున్నారు. ఈ బస్సులే కాకుండా ప్రయాణికుల రద్దీని బట్టి అదనపు బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 22 నుంచి 24 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులను అడ్వాన్స్ రిజర్వేషన్ (www.tsrtconline.in) సౌకర్యం కల్పిస్తున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రయాణికులు అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకుని అసౌకర్యానికి గురికాకుండా సుఖవంతంగా ప్రయాణం చేయాలని ఆర్టీసీ అధికార యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.
ఇప్పటికే మూడు వేల అదనపు బస్సులు
ఇప్పటికే ఈ నెల 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ, హైదరాబాద్ నుంచి పొరుగు రాష్ర్టాల్లోని వివిధ ప్రాంతాలకు మూడు వేల అదనపు బస్సులను నడుపడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ బస్సులు జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు. 15వ తేదీ నుంచి 18 వరకు ఎంజీబీఎస్, జేబీఎస్‌ల నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అదనంగా 281 బస్సులను నడిపించినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. అయితే, ప్రత్యేక బస్సులను సమర్థవంతంగా నడిపించేందుకు, ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్, దిల్సుఖ్నగర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, టెలిఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్‌బీనగర్‌లతోపాటు జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో నివసించే వారికి ప్రధానమైన పాయింట్ల నుంచి, టికెట్ బుకింగ్ ఏజెంట్ల నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడుపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వరప్రసాద్ తెలిపారు.
ట్రాఫిక్‌తో అసౌకర్యం కలుగకుండా..
జంట నగరాల్లో వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే మార్గంలో ట్రాఫిక్ జామ్‌లను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీబీఎస్ లోపల, పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ లేకుండా ఉండడానికి ఈ నెల 22 నుంచి 24 వరకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులు, రెగ్యులర్ బస్సులను వివిధ రూట్లలో మార్పులు చేశారు.