మంగళవారం 19 జనవరి 2021
Nizamabad - Oct 20, 2020 , 06:16:17

‘కరోనా’.. హైరానా..

‘కరోనా’.. హైరానా..

సదాశివనగర్‌: కరోనా బాధితుడు ఉన్నాడనే భయంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సును రోడ్డుపై నిలిపివేసిన ఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో చోటుచేసుకుంది. బస్సు సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయింది. పోలీసుల రంగప్రవేశం చేసి కరోనా అనుమానితుడిని అంబులెన్స్‌లో తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..  హైదరాబాద్‌ నుంచి ఆర్మూర్‌కు ఆర్టీసీ బస్సు (ఏపీ29 జడ్‌ 3409)లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన పక్కన కూర్చోవద్దని, తనకు కరోనా లక్షణాలున్నాయని తోటి ప్రయాణికులకు చెప్పాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. బస్సును సదాశివనగర్‌ మండల కేంద్రంలోని సర్వీస్‌రోడ్డుపై నిలిపివేయించిన 50 మంది ప్రయాణికులు.. కిందికి దిగి మరో బస్సులో వెళ్లారు.  

బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ సదరు వ్యక్తిని 108 అంబులెన్సులో వెళ్లాలని సూచించినప్పటికీ అతడు వెళ్లకుండా మొండికేశాడు. బస్సులో నుంచి దిగకుండా ముందుసీట్లో కూర్చున్నాడు.  దీంతో డ్రైవర్‌, కండక్టర్‌ సదాశివనగర్‌ ఎస్సై నరేశ్‌కు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బస్సులో ఉన్న వ్యక్తితో మాట్లాడగా, తనకు కరోనా వచ్చి తగ్గిందని పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం తనకు కరోనా లేదని, ఆర్మూర్‌కు వెళ్తున్నానని సమాధానమిచ్చాడు. పోలీసులు అతడిని అంబులెన్స్‌లో స్థానిక పీహెచ్‌సీకి, అనంతరం ఆర్మూర్‌కు పంపించడంతో బస్సు ఆర్మూర్‌కు బయల్దేరింది.