శుక్రవారం 23 అక్టోబర్ 2020
Nizamabad - Oct 19, 2020 , 01:42:46

సిద్ధులగుట్ట అభివృద్ధికి కృషి

సిద్ధులగుట్ట అభివృద్ధికి కృషి

ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి 

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణానికే తలమానికమైన సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం నవనాథ సిద్ధుల గుట్ట అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, పాలకవర్గ సభ్యులతో సిద్ధుల గుట్టపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నవనాథుల సిద్ధుల గుట్టపై ఉన్న పుణ్యక్షేత్రాలకు ఘాట్‌ రోడ్డు నిర్మాణంపై ఇటీవల అసెంబ్లీలో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రి త్వరలోనే రూ. ఏడు కోట్ల నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అందించిన ఆర్మూర్‌ మున్సిపల్‌పాలక వర్గ, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినిత, వైస్‌చైర్మన్‌ షేక్‌ మున్నా, నవనాథ సిద్ధుల గుట్ట చైర్మన్‌ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మోత్కురి లింగాగౌడ్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. 

గగ్గుపల్లి నూతన జీపీ భవన ప్రారంభోత్సవం 

ఆర్మూర్‌ : మండలంలోని గగ్గుపల్లి గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  పరిపాలనా సౌలభ్యంతోపాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే నూతన భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉపాధి నిధులు రూ.16 లక్షలు, జీపీ నిధులు రూ.రెండు లక్షలు కలిసి  ఈ భవనాన్ని పూర్తిచేసినట్లు చెప్పారు. అనంతరం గ్రామానికి చెందిన మహిళలకు బతుకమ్మ చీరెలు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బూరోల్ల లీనాశ్రీ, ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్‌, ఎంపీటీసీ సభ్యురాలు లినీత, మాజీ సర్పంచ్‌ జగదీశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు బూరోల్ల ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo