సోమవారం 19 అక్టోబర్ 2020
Nizamabad - Oct 19, 2020 , 01:36:49

వంకాయ సాగులో సస్యరక్షణ చర్యలు

వంకాయ సాగులో సస్యరక్షణ చర్యలు

రైతులకు వ్యవసాయ విద్యార్థుల సూచనలు

జక్రాన్‌పల్లి : పంటల సాగులో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన పద్ధతులను తీసుకురావడమే లక్ష్యంగా జగిత్యాల పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఒక అడుగు ముందుకు వేశారు. గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడానికి ఇటీవల జక్రాన్‌పల్లి మండలానికి వచ్చారు. జగిత్యాల జిల్లాలోని పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఒక సెమిస్టర్‌లో భాగంగా గ్రామాల్లో బస చేసి పంట కాలాన్ని స్వయంగా పరిశీలించి రైతుల అనుభవాలను తెలుసు కున్నారు. ఇందులో భాగంగా మండలంలోని అర్గుల్‌ గ్రామానికి చెందిన రైతు మంథని జైపాల్‌రెడ్డి సాగు చేస్తున్న వంకాయ పంటను సందర్శించారు. కొమ్మ, కాయ తొలుచు పురుగు సమగ్ర సస్యరక్షణ గురించి రైతులకు వివరించారు. వంకాయ ధర మార్కెట్‌లో పెరిగిన వేళ తోటలో కొమ్మ, కాయ తొలుచు పురుగు ఆశించి దిగుబడిపై ప్రభావం చూపి రైతుపై  భారం పడుతుంది. 

వంకాయలో కొమ్మ, కాయ తొలుచు పురుగు

వంకాయ చెట్టుపై ఆడ రెక్కల పురుగు లేత కొమ్మలపైన ఎదుగుతున్న కాయలపైన 80 నుంచి 120 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లను 3 నుంచి 5 రోజుల్లో పొదుగుతాయి. లద్దె(లార్వ) పురుగు మొక్క శాఖీయ దశలో ఆకు ఈనెలు, లేత కొమ్మలను ఆశిస్తుంది. కాయ దశలో కాయకు రంధ్రం చేసి లోపలి భాగాన్ని తింటుంది. మొదటి దశలో కాయపై రంధ్రం కనబడదు. తరువాత దశలో కాయపై పురుగు విసర్జకం కనిపిస్తుంది. పురుగు ఆశించిన కాయలు మార్కెట్‌కు అనుకూలం కాదు. ఈ పురుగు ఆశించడంతో 70 శాతం దిగుబడి తగ్గుతుంది. శీతాకాలంలో ఈ పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది.

పురుగు ఆశించిన మొక్క లక్షణాలు

శాఖీయ దశలో ఆకులు వడలిపోయి లేత కొమ్మలు రాలిపోతాయి.

కాయపై రంధ్రాలు విసర్జక పదార్థంతో నిండి ఉంటాయి.

నివారణ చర్యలు

పురుగు ఆశించిన లేత కొమ్మలను, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.

పంట మార్పిడి చేయాలి.

భాగ్యమతి వంటి పురుగును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి.

లింగాకర్షక బుట్టలను ఎకరాకు నాలుగు చొప్పున ఏర్పాటు చేయాలి.

100 కిలోల వేప పిండిని ఒక ఎకరాకు నాటిన 30 రోజుల తరువాత వేయాలి.

మైక్రోబ్రాకాన్‌ గ్రీని అనే మిత్ర పురుగులను తోటలో వదలాలి.

రసాయన పురుగు మందులు ప్రొఫెనోఫాన్‌ రెండు మిల్లీ లీటర్లు లేదా సైపర్‌మైత్రిన్‌ ఒక 

   మిల్లీ లీటరు ఒక లీటరు నీటితో కలిపి 10 రోజుల    తేడాతో మూడు వారాల తరువాత మూడు సార్లు పిచికారీ చేయాలి.

nక్లోరోథలోనిలిప్రోల్‌ 80 మిల్లీ లీటర్లు, 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకు పిచికారీ చేయాలి. పిచికారీ చేసిన మూడు రోజుల తరువాతే కాయలను తెంపాలి. ఈ విధంగా వంకాయ తోట సాగు చేసే రైతులు పాటిస్తే మంచి లాభాలను పొందవచ్చు. 


logo