గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 18, 2020 , 01:54:33

గోదావరి, మంజీరా జలపులకింత

గోదావరి, మంజీరా జలపులకింత

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరి, మంజీరా  నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మన రాష్ట్రంలో జీవనది అయిన గోదావరికి ముఖద్వారంగా నిజామాబాద్‌ జిల్లాకు పేరుంది. వందలాది కిలో మీటర్ల మేర విస్తరించిన గోదావరి మన జిల్లాతోపాటు జిల్లాను భౌగోళికంగా వేరు చేస్తూ తూర్పు దిశకు సాగుతున్నది. ఏటా చిన్నపాటి వానకు ఉప్పొంగే గోదావరి నది ఈసారి కనీవినీ ఎరుగని వరదతో పోటెత్తింది. శ్రీరాంసాగర్‌ వంటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు సైతం నిండు కుండలా మారి గేట్లు తెరుచుకుంది. నెల రోజులుగా వచ్చిన వరద వచ్చినట్లే దిగువకు పారుతుండడం విశేషం. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని చారిత్రక నిజాంసాగర్‌ ప్రాజెక్టు సైతం ఈసారి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నాలు గేండ్లుగా బోసిపోయిన ప్రాజెక్టుకు వరద పోటెత్తి గేట్లు తెర వడంతో మంజీరలోకి జలాలు ఉధృతంగా ప్రవహిస్తున్నా యి. ఫలితంగా మంజీరా  నది ఊహించని స్థాయిలో భారీ ప్రవా హంతో ముందుకు సాగుతూ గోదావరితో సంగమిస్తున్న ది. గోదావరి నది సైతం అనేక వాగులు, వంకలతో వచ్చిన వరదతో ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. ఉభయ జిల్లాల్లోని ప్రధానమైన మంజీర, గోదావరి నదులు, భారీ ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులతో సరికొత్త కళను సంతరించు కున్నాయి.

పరీవాహక ప్రాంతంలో జల పరవశం

మంజీరా  నది పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే ప్రాజెక్టులు సింగూరు, నిజాంసాగర్‌ ప్రాజెక్టులే. కొన్నేండ్లుగా వర్షం నీటి ప్రవాహం లేకపోవడంతో మంజీరా  నది రూపు కోల్పోయింది. ఈ నదిపై ఆధారపడిన ప్రాజెక్టులు సైతం వెలవెలబోయాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న వరదతో మంజీర ఉరకలేస్తూ ప్రవహిస్తున్నది. దీంతో పరీవాహక ప్రాంతంలోని ప్రజలు పరవశించిపోతున్నారు. స్థానిక రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంజీరా నది నేరుగా కందకుర్తి వద్ద గోదావరి నదితో సంగమిస్తుండడంతో అక్కడ సరికొత్త దృశ్యం ఆవిష్కృతమైంది.  నిత్యం మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రవాహమే తప్ప మంజీరా నదికి వచ్చే ప్రవాహం అంతంతమాత్రమే. ప్రస్తుతం మంజీర నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి గోదావరిలో కలుస్తుండడడంతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద నదీ జలా లు విశాలంగా ప్రవహిస్తుండడం కన్నుల విందుగా మారింది. 

పూర్వ జల వైభవం..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చారిత్రక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఏక కాలంలో నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడం, వరద నీరు దిగువకు పరుగులు తీస్తుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గడిచిన నాలుగేండ్లలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు కనీస నీటి మట్టానికి చేరుకోలేక వెలవెలబోయింది. ఎగువ ప్రాంతంలో వానలు లేకపోవడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ స్థితిలో సింగూర్‌ నుంచి వస్తున్న జోరు వరదతో ప్రాజెక్టు 24 గంటల సమయంలోనే 10 టీఎంసీలతో జలకళను సంతరించుకున్నది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు సైతం సెప్టెంబర్‌ మొదటి వారానికి నిండుకుండలా మారగా నెలన్నర రోజులుగా గేట్లు తెరుచుకుని దిగువకు జలాలు పరుగులు తీస్తున్నాయి. వందలాది టీఎంసీల నీరు దిగువకు వదలడంతో గోదావరి నది ఉప్పొంగుతోంది. మూడు రోజులుగా ఏక కాలంలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడం, గేట్లు తెరుచుకోవడం విశేషం. ఈ రెండు ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుం డడంతో ఉభయ జిల్లాల్లోని చారిత్రక ప్రాజెక్టులకు పూర్వ వైభవం సంతరించుకున్నట్లయ్యింది.

నీటి నిల్వ @ 112 టీఎంసీలు

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో చిన్నా, చితక నీటి పారుదల ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరొందిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఉండగా, కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఉంది. వీటికి తోడు కౌలాస్‌ వాగుపై నిర్మించిన కౌలాస్‌నాలా ప్రాజెక్టు, కళ్యాణి, సింగీతం, పోచారం ప్రాజెక్టులు సైతం కామారెడ్డి జిల్లాకు వెన్నుదన్ను గా నిలుస్తున్నాయి. సహజ సిద్ధంగా వాగులపై నిర్మించిన ఈ ప్రాజెక్టులతో వేలాది ఎకరాల ఆయకట్టుకు ఏటా యాసంగి పంటలకు ఊపిరి పోస్తున్నట్లు అవుతోంది. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో ఉభయ జిల్లాల్లోని ప్రాజెక్టులన్నీ జలకళతో కనిపిస్తున్నాయి. మొత్తం ఈ ప్రాజెక్టుల్లోని నీటి నిల్వ దాదాపుగా 112 టీఎంసీలుగా ఉంది. ప్రధానంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 90.31 టీఎంసీలు, నిజాంసాగర్‌ ప్రాజెక్టు 17.802 టీఎంసీలు, పోచారం 1.820 టీఎంసీలు, కౌలాస్‌ నాలా 1.237 టీఎంసీలు, సింగీతం 0.211 టీఎంసీలతో నిండుగా కనిపిస్తుండగా ఈ సీజన్‌లో ఇప్పటికై నాలుగైదు సార్లు మత్తడి పోస్తూ సందర్శకులకు  కనువిందు చేశాయి. కామారెడ్డి జిల్లాల్లో 2004 చెరువులు, నిజామాబాద్‌ జిల్లాలో 1202 చెరువులు మత్తడి దుంకుతుండడం విశేషం.logo