సోమవారం 26 అక్టోబర్ 2020
Nizamabad - Oct 18, 2020 , 01:49:46

కొలువుదీరిన దుర్గామాత

కొలువుదీరిన దుర్గామాత

ఊరూరా మండపాలు

మోపాల్‌(ఖలీల్‌వాడి) /ఇందూరు / విద్యానగర్‌ : 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో మండపాలు ఏర్పాటు చేసి దుర్గామాతలను ప్రతిష్ఠించారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శనివారం అమ్మవారిని బాలత్రిపుర సుందరిదేవిగా అలంకరించారు. ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, కలశస్థాపన, అఖండదీపారాధన, ధ్వజారోహణం, అంకురారోహణ, పంచామృతాభిషేకం, నూతన వస్ర్తాలంకరణ నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం, దేవీ రోడ్డులోని దేవీ ఆలయం, వినాయక్‌నగర్‌లోని ఏడుపాయల ఆలయం, తుల్జాభవానీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీలో ఉన్న శారదాదేవీ ఆలయం, ఎన్‌జీవోస్‌ కాలనీలోని లలితా త్రిపురసుందరి దేవీ ఆలయాల్లో నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం గాయత్రీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శించుకున్నారు. మాస్కులు ధరించి భౌతికదూరం పాటించారు.

ఉత్సవాలకు భారీ బందోబస్తు

నిజామాబాద్‌ సిటీ : నవరాత్రులను పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుం డా జిల్లా వ్యాప్తంగా పోలీసుబందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలు మగిసేవరకు పోలీసు పెట్రోలింగ్‌ను ముమ్మరంగా నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన మండపాలను పోలీసులు సందర్శించి బందోబస్తును పర్యవేక్షించనున్నారు. నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని నిజామాబాద్‌, బోధన్‌, ఆర్మూర్‌ డివిజ న్‌ పరిధిలో ఏసీపీలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ పటిష్టంగా నిర్వహించాలని ఏసీపీలు ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రులను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, ఎక్కడైనా సమస్యలు ఎదురైనా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే 100 కాల్‌ చేయాలని, లేదా సమీప పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలని సీపీ కార్తికేయ తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు.logo