శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Oct 15, 2020 , 02:02:32

రెండు రోజులుగా జోరుగా వానలు

రెండు రోజులుగా  జోరుగా వానలు

  • lకామారెడ్డి జిల్లాలో వరి, పత్తి పంటలకు భారీ నష్టం
  • lనిజామాబాద్‌ జిల్లాలో స్వల్పంగా దెబ్బతిన్న వరి
  • lఉభయ జిల్లాలో మత్తడి దుంకుతున్న 992 చెరువులు
  • lపొంగిపొర్లుతున్న వాగులు... గోదావరి నదిలో వరద ఉధృతి
  • lనిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సింగూరు నుంచి భారీ వరద

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉభయ జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం ప్రభావంతో ఏకధాటిగా కురిసిన వానలతో రెండు జిల్లాల్లో తటాకాలు పొంగి పొర్లుతున్నాయి. కోతకు వచ్చిన వరి పంట భారీగా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 282 గ్రామాల్లో 6,717 ఎకరాల్లో వరి, 7,344 ఎకరాల్లో పత్తి పంట, సోయాబీన్‌ పంట 160 ఎకరాల్లో పంటలకు ఈ వానలు చేటు చేశాయి. నిజామాబాద్‌ జిల్లాలో 60 గ్రామాల్లో 1,516 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 992 చెరువులు మరోమారు మత్తడి దుంకుతున్నాయి. శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టు రానున్న 24 గంటల్లో పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని నిండుకుండలా మారనుంది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం గేట్లు ఎత్తేందుకు సమాయత్తం అవుతున్నారు. రెండు జిల్లాల్లో వాగులు, వంకలు ఉరకలేత్తుతున్నాయి. భారీ వానలకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 38 తటాకాలకు సమస్యలు ఎదురవ్వగా జల వనరుల శాఖ అధికారులు హుటాహుటిన మరమ్మతులు చేపట్టారు.

వర్షపాతం వివరాలివీ...

అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్‌ జిల్లాలో గడిచిన రెండు రోజులుగా విస్తారంగా వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వానలు దంచి కొట్టాయి. నిజామాబాద్‌ జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. నిజామాబాద్‌ జిల్లాలోని సిరికొండలో 3.5 సెంటీ మీటర్లు, చందూర్‌లో 3.4, కోటగిరిలో 2.8, రుద్రూర్‌, వర్నిలో 2.6, మోపాల్‌లో 2.5, ఇందల్వాయిలో 2.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. బాల్కొండ నియోజకవర్గంలో స్వల్ప వర్షపాతం నమోదైంది. మెండోరాలో 2 మిల్లీ మీటర్లు, ముప్కాల్‌లో 3.5, ఏర్గట్లలో 4.8, బాల్కొండలో 7.7, వేల్పూర్‌లో 9.3 మిల్లీ మీటర్ల వాన కురిసింది. మొత్తం 29 మండలాల్లో ముప్కాల్‌ మండలంలో లోటు వర్షపాతం ఉండగా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా కామారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో 7.8 సెంటీ మీటర్లు, జుక్కల్‌లో 7.3, భిక్కనూరులో 7.1 సెంటీ మీటర్ల వర్షం పడింది. ఎల్లారెడ్డిలో 5.8 సెంటీమీటర్లు, పిట్లంలో 5.7, దోమకొండలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అతి తక్కువగా బాన్సువాడలో 2.8 సెంటీ మీటర్లు, బిచ్కుంద, మద్నూర్‌లో 3 సెంటీ మీటర్లు, గాంధారిలో 3.8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. 

హుటాహుటిన మరమ్మతులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వానలతో 38 చెరువులకు సమస్యలు ఏర్పడ్డాయి. లీకేజీలు, బుంగలు ఏర్పడడం, చెరువు కట్ట ప్రమాదకర స్థాయికి చేరడం వంటివి స్వల్పంగానే వెలుగు చూశాయి. ఎప్పటికప్పుడు జల వనరుల శాఖ అధికారులు సమస్యలను గుర్తించి హుటాహుటిన పరిష్కరించారు. బుంగలు ఏర్పడిన చోట రైతుల సహకారంతో యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన పనులతో భారీ నష్టాన్ని అధికారులు నివారించగలిగారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తం గా మొత్తం 2004 చెరువులున్నాయి. భారీ వానలకు అక్కడక్కడా కొన్ని చెరువులకు బుంగలు పడ్డాయి. జల వనరుల శాఖ అధికారులు హుటాహుటిన స్పందించి మరమ్మతులు చేస్తున్నారు. స్థానిక రైతుల నుంచి సమాచారం అందుకున్న వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి నష్ట నివారణ చర్యల్లో నిమగ్నం అవుతున్నారు. 14 చెరువులకు బుంగలు, 18 చెరువుల వద్ద ఇతర సమస్యలను గుర్తించారు. మొత్తం 32 చెరువుల్లో 29 పరిష్కరించారు. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 1202 చెరువులున్నాయి. ఇప్పటి వరకు కేవలం 6 చెరువుల వద్ద సమస్యలు గుర్తించారు. వీటిలో రెండు చోట్ల బుంగలు ఏర్పడగా పరిష్కరించారు. నాలుగు చోట్ల ఇతర ఇబ్బందులను గుర్తించి అప్పటికప్పుడే జల వనరుల శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూశారు.

వరి, పత్తి పంటలకు నష్టం

భారీ వానలతో చేతికొచ్చిన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో వేల ఎకరాలు వరద నీటిలో మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో స్వల్పంగా పంటలు దెబ్బతిన్నట్లుగా అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పంట నష్టం వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు సేకరించారు. కామారెడ్డి జిల్లాల్లో 284 గ్రామాల్లో 6,717 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 7,344 ఎకరాల్లో పత్తి పంట, 160 ఎకరాల్లో సోయాబీన్‌ పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలో 15,943 మంది రైతులకు చెందిన 14,261 ఎకరాల వ్యవసాయ పంట భూములు భారీ వానల ప్రభావానికి గురైనట్లుగా కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయాధికారి సునీత చెప్పారు. నిజామాబాద్‌ జిల్లాలో పంట నష్టం అంతగా వాటిల్లలేదు. నిజామాబాద్‌ జిల్లాలో మోర్తాడ్‌, కోటగిరి, ఆర్మూర్‌, చందూర్‌, వర్ని, మోస్రా, రుద్రూర్‌ మండలాల్లో 60 గ్రామాల్లో 1124 మంది రైతులకు చెందిన 1561 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి 1516 ఎకరాల్లో దెబ్బతిన్నదని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్‌ వెల్లడించారు.

గోదావరి ఉగ్రరూపం..  

జిల్లాతోపాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వానలకు గోదావరి నది ఉరకలెత్తుతోంది. గడిచిన వారం రోజులుగా ఎగువ నుంచి వేలాది క్యూసె క్కుల వరద కొనసాగుతుండగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు జీవనదిలో ప్రవాహం రెట్టింపు అయ్యింది. మెండోరాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టుకు 70 వేల క్యూసెక్కుల వరద కొనసాగింది. సాయంత్రానికి వరద తగ్గు ముఖం పట్టడంతో ఎస్సారెస్పీ వరద గేట్లను మూసేశారు. వరద కొనసాగితే తిరిగి గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని వదిలి పెట్టనున్నారు. కందకుర్తి వద్ద గోదావరి నదిలో నీటి ప్రవాహం ఉవ్వెత్తున సాగుతోంది. మరోవైపు పలు పుష్కర ఘాట్లలో స్నాన ఘట్టాలన్నీ గోదావరి ప్రవాహంలో మునిగిపోయాయి. కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టుకు 6వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, కళ్యాణి ప్రాజెక్టు 2 గేట్లను ఎత్తి దిగువకు 500 క్యూసెక్కుల నీటిని వదిలి పెట్టారు. సింగీతం ప్రాజెక్టు నిండు కుండలా తొణికిసలాడుతోంది. కౌలాస్‌నాలా ప్రాజెక్టు 6 గేట్లను జల వనరుల శాఖ అధికారులు ఎత్తి దిగువకు 10,736 క్యూసెక్కుల వరదను విడిచి పెట్టారు. చారిత్రక నిజాంసాగర్‌ ప్రాజెక్టు 24 గంటల్లో నిండుకుండలా దర్శనం ఇవ్వ నుంది. ఎగువన సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండడంతో గురువారం గేట్లను ఎత్తేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. మొత్తం 17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న నిజాంసాగర్‌ ప్రాజెక్టులో సగానికిపైగా నీళ్లు వచ్చి చేరాయి.


logo