శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Oct 14, 2020 , 01:46:42

ఉమ్మడి జిల్లాలో జోరుగా వర్షాలు

ఉమ్మడి జిల్లాలో జోరుగా వర్షాలు

కామారెడ్డి/ ఖలీల్‌వాడి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లా కేంద్రాలతోపాటు పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. మురికి కాలువలు నిండి రోడ్లపై ప్రవహించాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షాలకు కోతకు వచ్చిన పంట నేలకొరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు మండలాల్లో రోడ్లపై, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. నిజామాబాద్‌ జిల్లాలో 11.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా రెంజల్‌ మండలం 24.2 మిల్లీమీటర్లు, నవీపేట్‌లో 26.4, బోధన్‌లో 27.1, వేల్పూర్‌లో 28.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిజామాబాద్‌ జిల్లా వాతావరణ శాఖాధికారి నరేందర్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 11.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా సదాశివనగర్‌ మండలంలో 28.8 మిల్లీ మీటర్లు, అత్యల్పంగా మాచారెడ్డి మండలంలో 1.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. గాంధారిలో 7.2 మిల్లీమీటర్లు, నిజాంసాగర్‌లో 25.6, ఎల్లారెడ్డిలో 14.8, లింగంపేట్‌లో 8.4, పిట్లంలో 20.4, బాన్సువాడలో 2.4, బీర్కూర్‌లో 18.4, కామారెడ్డిలో 9.8, తాడ్వాయిలో 15.0, నాగిరెడ్డిపేట్‌లో 12.4, మద్నూర్‌లో 9.0, దోమకొండలో 1.4, భిక్కనూరులో 2.2, బిచ్కుందలో 8.0, జుక్కల్‌లో 3.0 వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.