శుక్రవారం 30 అక్టోబర్ 2020
Nizamabad - Oct 12, 2020 , 03:42:00

గొలుసు చోరీ నిందితుల అరెస్టు

గొలుసు చోరీ నిందితుల అరెస్టు

  •  16 తులాల బంగారం, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం  
  •  వివరాలు వెల్లడించిన ఏసీపీ శ్రీనివాస్‌

నిజామాబాద్‌ సిటీ : నిజామాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో వరుసగా చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితులను పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను ఆయన వెల్లడించారు. నిజామాబాద్‌ నగరంలోని నాల్గో టౌన్‌ పరిధిలో ఉన్న పద్మనగర్‌ రోడ్డు నంబర్‌ -1లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో స్థానికులు డయల్‌-100కు సమాచారం ఇచ్చారని తెలిపారు. వెంటనే నాల్గో టౌన్‌ పోలీసులు అక్కడికి చేరుకొని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని పట్టుకొని విచారించారన్నారు.

బోధన్‌ మండలం రాకాసీపేట్‌కు చెందిన ఎలకంటి రాజేశ్‌, సయ్యద్‌ ఇక్బాల్‌ అహ్మద్‌ చేసిన నేరాలు ఒప్పుకున్నారని తెలిపారు. వీరిద్దరు మరో నలుగురు సయ్యద్‌ అజార్‌, పవన్‌, ప్రకాశ్‌, మహ్మద్‌ మతీన్‌తో కలిసి చైన్‌ స్నాచింగ్‌కు అలవాటు పడ్డారని చెప్పారు. వీరు డిచ్‌పల్లి, ఆర్మూర్‌ ప్రాంతాల్లో గొలుసు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. వీరి నుంచి 16.2 తులాల బంగారు గొలుసు లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులతో పాటు వారి నుంచి గొలుసులు కొన్న వసీం అలీ, బడా అజార్‌ను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ రి మాండ్‌కు తరలించామని చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి కృషి చేసిన నగర సీఐ సత్యనారాయణ, ఎస్సైలు లక్ష్మయ్య, సంతోష్‌కుమార్‌, కానిస్టేబుళ్లు అఫ్సర్‌, సుభాష్‌ను నిజామాబాద్‌ సీపీ కార్తికేయ అభినందించారని ఏసీపీ తెలిపారు.