మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Oct 12, 2020 , 03:41:58

కవితకు భారీ మెజారిటీ ఖాయం

కవితకు భారీ మెజారిటీ ఖాయం

  • ఉమ్మడి జిల్లాకు మంచిరోజులు వచ్చాయ్‌.. 
  •  రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ 

నిజామాబాద్‌ రూరల్‌: స్థానిక సంస్థల ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. నిజామాబాద్‌లోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏజెంట్లు, టీఆర్‌ఎస్‌ నాయకులతో ఆయన ఆదివారం సమావేశమయ్యారు. నగరంలోని పాలిటెక్నిక్‌ కళాశాలలో సోమవారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అవలంబించనున్న పద్ధతులపై ఎమ్మెల్యే వారికి అవగాహన కల్పించారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు నిజామాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన ఘనత కేవలం కల్వకుంట్ల కవితకే దక్కిందని చెప్పారు. ఏడాది క్రితం జరిగిన ఎంపీ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాయమాటలు చెప్పి గెలిచాడని, ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు మంజూరు చేయిస్తానని కట్టుకథలు చెప్పి గెలుపొందిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీగా గెలిచిన అర్వింద్‌ జిల్లా అభివృద్ధిని విస్మరించారన్నారు. పసుపు పండించే రైతాంగం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న పసుపు బోర్డు మంజూరు హామీ నీటిమూటగానే మిగిలిందని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు, రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంపీ అర్వింద్‌ పనితీరుపై విసుగు చెందారని, అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడే కల్వకుంట్ల కవిత నాయకత్వం అవసరమని టీఆర్‌ఎస్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం గుర్తించి ఉమ్మడి జిల్లాల్లో ఖాళీగా ఏర్పడిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసే అవకాశం కల్వకుంట్ల కవితకు కల్పించారని ఎమ్మెల్యే వివరించారు. గతంలో ఐదేండ్లు ఎంపీగా ఉన్నప్పుడు జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపించిన కవితమ్మ ఎమ్మెల్సీగా విజయం సాధించనుండడంతో మళ్లీ ఆశించిన అభివృద్ధి జరుగనుందని పార్టీ నాయకులతో పాటు అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి స్పష్టం చేశారు. 

తగ్గుతున్న కరోనా కేసులు

  •  నిజామాబాద్‌లో 65 మందికి, కామారెడ్డిలో  ఆరుగురికి కరోనా పాజిటివ్‌ 

ఖలీల్‌వాడి/ విద్యానగర్‌ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం 65 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి సుదర్శనం తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 8,069 కేసులు నమోదయ్యాయన్నారు. కేసులు తగ్గుతున్నప్పటికీ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా నోడల్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 11,450 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సమూహాల వద్దకు వెళ్లవద్దని, అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావొద్దని అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ నివారణ సాధ్య మని వారు పేర్కొంటున్నారు. 


logo