మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Oct 11, 2020 , 06:21:56

పాలన చేరువగా.. ప్రగతి వేగంగా..

పాలన చేరువగా.. ప్రగతి వేగంగా..

  • కొత్త జిల్లాలు కొలువుదీరి నేటితో నాలుగేండ్లు..
  •  వికేంద్రీకరణతోప్రజల చెంతకు పాలన
  • నూతన జిల్లాల ఆవిర్భావంతో మారిన స్థితిగతులు
  • పథకాల అమలులో పెరిగిన పారదర్శకత, పర్యవేక్షణ
  • సుపరిపాలన దిశగా పయనం
  • తలమానికంగా నిలువనున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాలు
  • రోల్‌మోడల్‌గా కామారెడ్డి జిల్లా పోలీస్‌ కార్యాలయం

కొత్త జిల్లాలు ఆవిర్భవించి నేటితో నాలుగేండ్లు పూర్తయ్యాయి. 2016లో ఇదే రోజున ఉమ్మడి జిల్లా.. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలుగా మారింది. గడిచిన నాలుగేండ్లలో పరిపాలన వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. సంక్షేమ పథకాల అమలు, క్షేత్రస్థాయిలో పెరిగిన పర్యవేక్షణ, లబ్ధిదారుల ఎంపికలో కచ్చితత్వం.. పాలనలో పారదర్శకత, ప్రగతిపనుల్లో వేగం.. సుస్పష్టంగా కనిపిస్తున్నది. గతంలో జిల్లాలు సువిశాలంగా ఉండడంతో ప్రభుత్వ పథకాల అమలు, పర్యవేక్షణ కష్టతరంగా ఉండేది. పరిపాలనా సౌలభ్యంతో ఇప్పుడు ప్రజల చెంతకు వేగంగా చేరుతున్నాయి. 22 మండలాలతో కామారెడ్డి, 29మండలాలతో నిజామాబాద్‌ జిల్లాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. కొత్త పంచాయతీలు, మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. జిల్లా కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులు విస్తృతంగా పర్యటించగలుగుతున్నారు. ప్రజాఫిర్యాదుల పరిష్కారం సులభతరమైంది. కరోనా, ఇతర సీజనల్‌ వ్యాధుల సమయంలో అధికారయంత్రాంగం వేగంగా చర్యలు తీసుకోగలుగుతున్నది. ఎరువుల పంపిణీ మొదలు ధాన్యం కొనుగోలు, పంటనష్టం సర్వేవంటివన్నీ సకాలంలో పూర్తిచేయగలుగుతున్నది. 

 

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్త జిల్లాలు ఆవిర్భవించి నేటితో నాలుగేండ్లు పూర్తయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలు ఆదివారంతో ఐదో వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాయి. అధికార వికేంద్రీకరణతో సంక్షేమ ఫలాలు అట్టడుగు స్థాయి వరకు చేరుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటోంది. అర్హులైన వారందరికీ పథకాలు అందుతున్నాయి. గతంలో జిల్లాల విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పథకాల అమలు, పర్యవేక్షణలో ఇబ్బందులు తలెత్తేవి. ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు పరిపాలన వ్యవహారాలు సాగించడం కాసింత కష్టతరంగానే ఉండేది. 33 జిల్లాల ఏర్పాటుతో అధికార వికేంద్రీకరణకు రాష్ట్రం మచ్చుతునకగా నిలుస్తోంది. 22 మండలాలతో పురుడు పోసుకున్న కామారెడ్డి జిల్లా, 29 మండలాలతో నిజామాబాద్‌ జిల్లా అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్ర రాజధానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డి జిల్లాగా ఏర్పడిన తర్వాత రోజురోజుకూ విస్తరిస్తోంది. నిజామాబాద్‌ జిల్లా సైతం అదే స్థాయిలో అభివృద్ధి చెందుతోంది.

ఐకాన్‌గా నూతన కలెక్టరేట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్‌ భవనాలు ఐకాన్‌గా నిలువనున్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనాల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. దసరా నాటికి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ జాతీయ రహదారి 44 పక్కనే ఠీవీగా దర్శనమిస్తోంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోటికి త్వరలోనే రానున్నాయి. ఒకే గొడుగు కింద అన్ని శాఖల కార్యకలాపాలు మొదలైతే సామాన్య ప్రజలకు ఇక్కట్లు తప్పనున్నాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ శాఖల కార్యాలయాలు చెట్టుకొకటి పుట్టకొకటి అన్నట్లు ఉన్నాయి. నూతన కలెక్టరేట్‌తో అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోటు నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. జిల్లా కలెక్టర్‌ సహా ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులంతా అందుబాటులో ఉండనున్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ను అడ్లూర్‌ గ్రామ శివారులో రూ.57 కోట్లతో నిర్మిస్తున్నారు. ఇందుకోసం 33 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. నిజామాబాద్‌ జిల్లాకు జీజీ కాలేజీ సమీపంలో కొత్త కలెక్టరేట్‌ను నిర్మిస్తున్నారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల సమీకృత కలెక్టరేట్‌ భవనాల నిర్మాణానికి అక్టోబర్‌ 11, 2017న పునాది రాయి పడగా పనులు పూర్తయ్యాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఆధునిక సొబగులతో కూడిన ఈ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. మొత్తం భవనం 1,59,307 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపదిద్దుకుంటోంది. ఇందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌ విస్తీర్ణం 53,940 చదరపు అడుగులు, మొదటి అంతస్తు విస్తీర్ణం 50,874 చదరపు అడుగులు, రెండో అంతస్తు 54,493 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.

జిల్లాల్లో నూతన జీపీలు


స్వరాష్ట్రం సిద్ధించిన అనంతరం వచ్చిన సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీల ఏర్పాటు అంశాన్ని చేర్చింది. ఆ హామీని నెరవేర్చి ప్రజలకిచ్చిన మాటను సీఎం కేసీఆర్‌ నిలబెట్టుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రెండోమారు అధికారంలోకి రాగానే 2019, జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలను నియమించింది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లో కేవలం 312 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉండేవి. 500 జనాభా కలిగిన తండాలు, ఇతర గ్రామాలన్నింటికీ పంచాయతీ హోదా కల్పించడంతో కొత్తగా 214 గ్రామ పంచాయతీలు పురుడు పోసుకున్నాయి. పాతవి 312 జీపీలు కలిపితే మొత్తం 526 గ్రామ పంచాయతీలతో కామారెడ్డి జిల్లా ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 36 మండలాలుండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుతో కామారెడ్డి జిల్లా 22 మండలాలతో ఆవిర్భవించింది. నిజామాబాద్‌ జిల్లాలో 29 మండలాలు ఉండగా 530 జీపీలు ఏర్పడ్డాయి. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్‌లో భీమ్‌గల్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.

ఆదర్శం.. రైతు వేదికలు


రైతులు, వ్యవసాయాధికారుల ప్రయోజనార్థం నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలు కేవలం నాలుగు నెలల కాలంలోనే కామారెడ్డి జిల్లాలో 100 శాతం పూర్తయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలోనూ మొత్తం లక్ష్యంలో అగ్రభాగం పూర్తవ్వగా ఐదారు రోజుల్లో వంద శాతం నిర్మాణాలు పూర్తికానున్నాయి. ఉభయ జిల్లాలకు వేర్వేరు ప్రభుత్వ యంత్రాంగాలు ఉండడంతో పర్యవేక్షణ, పరిశీలన పెరిగి రైతు వేదికల నిర్మాణాలు సీఎం కేసీఆర్‌ ఊహించిన విధంగానే గడువులో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. 2,045 చదరపు అడుగుల విస్తీర్ణంలో రైతు వేదిక భవనం అందుబాటులోకి రానుంది. 400 మంది రైతులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేలా వేదికలను తీర్చిదిద్దుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 104, నిజామాబాద్‌ జిల్లాలో 106 రైతు వేదికలు నిర్మిస్తున్నారు. 

ప్రజల్లోకి ప్రభుత్వ యంత్రాంగం


రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ తదితర పథకాలు అమలు చేయడం.. రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేయడం.. పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీ రుణాల కోసం లబ్ధిదారులను ఎంపిక చేయడం వంటి కార్యక్రమాలు సకాలంలో, సమర్థవంతంగా అమలవుతున్నాయంటే జిల్లాల ఏర్పాటే కారణం. ఉమ్మడి జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు కత్తిమీద సాములా ఉండేది. నియంత్రణ తప్పి అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయేది. ప్రస్తుతం జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ ఉండడంతో పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయి. ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సైతం కొత్త జిల్లాల్లో సత్ఫలితాలు ఇస్తోంది. ఉమ్మడి జిల్లాలో మూస పద్ధతిలో జరిగిన కార్యక్రమం ఇప్పుడు భిన్నంగా సమస్యల పరిష్కారానికి వేదికగా మారుతోంది. గతంలో తమ అర్జీలు ఏమయ్యాయో తెలియక, సమస్య పరిష్కారం అవుతుందో లేదో అర్థం కాక ఒకటికి పది సార్లు అర్జీలు చేతబట్టుకొని కలెక్టరేట్‌ వద్ద పడిగాపులు పడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ప్రతి అర్జీకి సంబంధించిన వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు.  


logo