మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Oct 10, 2020 , 01:44:57

వార్‌ వన్‌సైడ్‌...!

వార్‌ వన్‌సైడ్‌...!

  •  ఉప ఎన్నికల్లో 99.64 శాతం పోలింగ్‌ నమోదు
  • బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన తీర్పు
  • ఓటేసిన స్పీకర్‌ పోచారం, మంత్రి వేముల, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా నమోదైంది. శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ ప్రక్రియలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫిషియో ఓట్లు వేశారు. టీఆర్‌ఎస్‌కు ఉన్న సంఖ్యాబలంతోపాటు పార్టీలకు అతీతంగా కల్వకుంట్ల కవితకు భారీగా ఓట్లు పోలైనట్లుగా ఉమ్మడి జిల్లాకు చెందిన నాయకులు చెబుతున్నారు. 

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 824 మంది ఓటర్లకుగాను, 821 మంది ఓటుహక్కును వినియోగించుకోగా, 99.64శాతం పోలింగ్‌ నమోదైంది. కామారెడ్డి జిల్లాలో 341 మంది ఓటర్లు ఉండగా, వందశాతం పోలింగ్‌ నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలో 483 ఓటర్లు ఉండగా, 480 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటెయ్యని ముగ్గురిలో బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఓ కౌన్సిలర్‌ కొద్ది రోజుల క్రితం మరణించారు. మరో ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి, బోధన్‌ పట్టణాల్లో పర్యటించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. కవిత అఖండ విజయం సాధిస్తారని మంత్రి వేముల ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు కవితకు ఓటేశారని చెప్పారు.

99.64శాతం పోలింగ్‌ నమోదు

పోలింగ్‌ కేంద్రాలకు స్థానిక ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, మొదటి రెండు గంటల్లోనే భారీ స్థాయిలో పోలింగ్‌ శాతం నమోదైంది.  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 99.64 శాతం పోలింగ్‌ నమోదైందని రిటర్నింగ్‌ అధికారి నారాయణరెడ్డి తెలిపారు. కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. వీరిలో ఇద్దరు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, బోధన్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఓ కౌన్సిలర్‌ మృతి చెందడంతో ఒక ఓటు నిర్వీర్యమైంది.

ఓటేసిన కరోనా బాధితులు

కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కరోనా సోకిన వారి ఇంటి నుంచి 108 అంబులెన్సు సౌకర్యం కల్పించడంతోపాటు పోలింగ్‌ బూత్‌లలో పీపీఈకిట్లను సైతం అందుబాటులో ఉంచడంతో స్వేచ్ఛగా ఓటు వేశారు. ఇందులో మహిళలు సైతం ఉన్నారు. మొత్తం ఓటర్లలో 24 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లుగా పోలింగ్‌కు ముం దు అధికారులు నిర్ధారించా రు. వీరిలో ముగ్గురు మినహా మిగిలిన వారంతా ఓటేశారు. కరోనా పేషెంట్లు సాయంత్రం 4 నుంచి 5గంటల మధ్య కేటాయించిన గంట సమయంలో నేరుగా పోలింగ్‌ బూత్‌లకు వచ్చి ఓటేశారు.

పోలింగ్‌ తీరు పరిశీలన

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత శుక్రవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించారు.  పలు పోలింగ్‌ బూత్‌లను సందర్శించి పోలింగ్‌తీరును పరిశీలించారు. ముందుగా కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌తో కలిసి సందర్శించారు. అక్కడి నుంచి నేరుగా బోధన్‌ మున్సిపాలిటీకి వెళ్లారు. ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి పోలింగ్‌ తీరును పరిశీలించారు. కామారెడ్డి, బోధన్‌లో స్థానిక ప్రజా ప్రతినిధులతో సరదాగా ముచ్చటించారు. పలువురు మహిళా ప్రజాప్రతినిధులు కవితతో సెల్ఫీలు, ఫొటోలు దిగి సంబురపడ్డారు. 

కవిత గెలుపు లాంఛనమే..!

టీఆర్‌ఎస్‌ విజయం లాంఛనమే అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఉభయ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌కు ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్యా బలంతో సునాయాస విజయాన్ని కల్వకుంట్ల కవిత దక్కించుకోనున్నారు.  ఎన్నికలకు రివైజ్డ్‌ నోటిఫికేషన్‌ వచ్చిన నాటి నుంచి నేటివరకు జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, షకీల్‌ ఆమేర్‌, సురేందర్‌, హన్మంత్‌ షిండే కృషికి తగ్గ ఫలితం సోమవారం వెలువడనుంది. ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులు తాము సమష్టిగా తీసుకున్న నిర్ణయాలను కింది స్థాయికి తీసుకెళ్లడం, పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవడం టీఆర్‌ఎస్‌కు కలిసి రానుంది.

కారుదే జోరు..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో కారు జోరు మరోమారు రుజువు కానుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచే సంఖ్యా బలంలేని కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ లో చేరేందుకు వరుసకట్టారు. మరోవైపు మాజీ ఎంపీ కవితకు భారీ మెజార్టీతో చారిత్రక విజయాన్ని అందించాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్యులు పనిచేయడంతో కాంగ్రెస్‌, బీజేపీలకు శృంగభంగం తప్పని పరిస్థితి ఎదురుకానుంది.

బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అర్విం ద్‌ కొద్దిమంది కార్పొరేటర్లను కాపాడుకునేందుకు నానాతంటాలు పడాల్సివచ్చింది. ఒకానొక దశలో ఎంపీకే సొంత పార్టీ నేతలు ఎదురుతిరిగిన సందర్భాలూ ఉన్నాయి!  ప్రజా ప్రతినిధులను కాపాడుకోలేక కాంగ్రెస్‌, బీజేపీలు విలవిల్లాడాల్సిన దుస్థితి ఏర్పడింది. స్వచ్ఛంద చేరికల పర్వంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు! ప్రచారం చేయలేక, ఉన్న వారిని కాపాడుకోలేక అడుగడుగునా సతమతమయ్యారు.


logo