శనివారం 31 అక్టోబర్ 2020
Nizamabad - Oct 09, 2020 , 05:35:14

ఆధునిక సాంకేతికతతో పోలీసులకు శిక్షణ

ఆధునిక సాంకేతికతతో పోలీసులకు శిక్షణ

  •  నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ 
  • ముగిసిన పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ శిబిరం 
  •  పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పోలీసుల గౌరవవందనం స్వీకరించిన సీపీ, కామారెడ్డి ఎస్పీ  

ఎడపల్లి (శక్కర్‌నగర్‌): నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్తగా చేరిన పోలీసులకు శిక్షణ ఇస్తున్నామని నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ అన్నారు. ఈ శిక్షణ నేర పరిశోధనలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సైబరాబాద్‌ నుంచి సివిల్‌ కేటగిరీలో ఎంపికైన స్టయిఫండరీ కానిస్టేబుళ్లకు ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌లో ఉన్న నిజామాబాద్‌ కమిషనరేట్‌ పోలీసు శిక్షణ కేంద్రంలో తొమ్మిది నెలలుగా కొనసాగిన శిక్షణ గురువారం పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ‘పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌'కు సీపీ కార్తికేయ ముఖ్య అతిథిగా హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమైందన్నారు. శిక్షణలో నేర్చుకున్న విషయాలను విధుల్లో ఆచరించాలని సూచించారు. మంచి నడవడిక, క్రమశిక్షణతో ట్రైనీ కానిస్టేబుళ్లు పోలీసు శాఖకు మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఒత్తిళ్లకు గురికాకుండా తమను తాము సంస్కరించుకోవాలన్నారు. పోలీసులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. శిక్షణ పొందిన 258 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లతో పోలీస్‌ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్‌ ఉషా విశ్వనాథ్‌ ప్రమాణం చేయించారు. 

కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ప్రతిభచూపిన ట్రైనీ కానిస్టేబుళ్లకు సీపీ కార్తికేయ, ఎస్పీ శ్వేతారెడ్డి, పలువురు పోలీస్‌ అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పోలీస్‌ శిక్షణ కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ సరళ, సీటీసీ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రావణ్‌కుమార్‌, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.

తాజావార్తలు