గురువారం 22 అక్టోబర్ 2020
Nizamabad - Oct 08, 2020 , 06:38:17

రేపే ఉప ఎన్నిక..

రేపే ఉప ఎన్నిక..

  • ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ముగిసిన గడువు
  • కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్న యంత్రాంగం
  • పోస్టల్‌ బ్యాలెట్‌కు ఒకే ఒక్క దరఖాస్తు
  • పోటీలో నామమాత్రంగా  కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవితవిజయం ఖాయమే

రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఇంకా ఒక్కరోజే మిగిలింది. శుక్రవారం ఉదయం 9గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. బుధవారం సాయంత్రంతో రాజకీయ పక్షాల హడావిడికి తెరపడగా.. అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. కరోనా నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్‌-19 మార్గదర్శకాలను ప్రతి కేంద్రంలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆయా పార్టీల సంఖ్యాబలాన్నిబట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పరిమితసంఖ్యలో ఉండడమే అందుకు కారణమని వారంటున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాప్రతినిధులకు మార్గనిర్దేశనం చేయడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం రెట్టింపయ్యింది. 

 నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : 


ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి తెర పడింది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం ఐదు గంటలకే రాజకీయ పార్టీల హడావిడి సమాప్తమైంది. పోలింగ్‌ శుక్రవారమే కావడంతో జిల్లా ఎన్నికల యంత్రాంగం అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను చేస్తున్నది. కరోనా వైరస్‌ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి ప్రతి పోలింగ్‌ కేంద్రంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొదట్లో ఆరు పోలింగ్‌ కేంద్రాలు మాత్రమే నిర్ణయించగా కరోనా నేపథ్యంలో వీటి సంఖ్యను ఏకంగా 50కి పెంచారు. 

మండలానికో పోలింగ్‌ బూత్‌ నెలకొల్పడంతో ఓటర్లు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారత ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు రేపు జరిగే పోలింగ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత గెలుపు ఖాయమేనని రాజకీయ వర్గాలు కోడై కూస్తున్నాయి. గెలిచేందుకు సంఖ్యాబలం పుష్కలంగా ఉండడంతోపాటు కాంగ్రెస్‌, బీజేపీలకు కనీస మద్దతు కొరవడడం కారణాలుగా నిలుస్తున్నాయి. 12న వెలువడే ఉప ఎన్నిక ఫలితా ల్లో జాతీయ పార్టీలు మరోమారు గులాబీ పార్టీ చేతిలో పరరాజయాన్ని చవిచూసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ‘తారక’ మంత్రం.. 

హైదరాబాద్‌ నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడారు. దీంతో వారిలో ఉత్తేజం రెట్టింపు అయ్యింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లంతా కేటీఆర్‌ ప్రసంగం విని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. వీడియో కాన్ఫరెన్సులో కేటీఆర్‌ చెప్పిన అంశాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఏ విధంగా వెన్నుదన్నుగా నిలిచిందో వివరించిన తీరు వారిని ఆలోచింపజేసింది. కవిత గెలుపు చారిత్రక విజయంగా మిగిలిపోనుందని ఆయన చెప్పడం, త్వరలోనే స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యల పరిష్కారా నికి ఓ చక్కని రాచమార్గం ఉంటుందని కేటీఆర్‌ గుర్తు చేయడం కూడా అందరినీ కదిలించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లకే కాకుండా కేటీఆర్‌ చేసిన మార్గనిర్దేశనంతో నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొంగొత్త జోష్‌ కనిపిస్తున్నది. 

పోస్టల్‌ బ్యాలెట్‌కు ఒక దరఖాస్తు.. 

ఓటు హక్కు ఉన్నప్పటికీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉండే వారికి భారత ఎన్నికల సంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా విలువైన ఓటు హక్కు వృథా కాకుండా అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఈ ప్రక్రియ ఎక్కువగా సాధారణ ఎన్నికల్లో చూస్తూ ఉంటాం. గతానికి భిన్నంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఈ అవకాశాన్ని కల్పించడం విశేషం. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలతో కరోనా పాజిటివ్‌ సోకిన వారికి, వయో వృద్ధులకు కరోనా జాగ్రత్తల్లో భాగంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 824 మంది ఓటర్లలో 24 మంది ఓటర్లకు కరోనా నిర్ధారణ కాగా వీరిలో ఒకరు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కరోనా సోకిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కాకుండా నేరుగా పోలింగ్‌ బూత్‌కు వచ్చి కూడా ఓటు వేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు పీపీఈ కిట్లు ధరించాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పోలింగ్‌ కేంద్రం వరకు అంబులెన్సులో లేదంటే సొంత వాహనంలో రావాలని అధికారులు సూచిస్తున్నారు. పోలింగ్‌ రోజు సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఒక గంట సేపు కరోనా సోకిన వారికి సమయం కేటాయించారు. 

నామమాత్రపు పోటీ..

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్‌ పార్టీ నుంచి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి, బీజేపీ నుంచి పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ పోటీ లో ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గంప గుత్తగా సీట్లు కైవసం చేసుకున్నది. ఊరూరా ఎంపీటీసీలను ఇతర పార్టీలతో పోలిస్తే గణనీయమైన స్థానాలను దక్కించుకున్నది. మండల స్థాయి లో జడ్పీటీసీ సీట్లు సైతం అత్యధిక సీట్లు టీఆర్‌ఎస్‌కే ఉన్నాయి. పురపాలక, నగరపాలక సంస్థల్లోనూ గులాబీ పార్టీ జెండానే ఎగిరింది. ఇలా స్థానిక బలంతో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు ధీమాతో ఉప ఎన్నికల బరిలో దిగింది. కాంగ్రెస్‌, బీజేపీలకు గెలిచేందుకు అవకాశమే లేదు. మొత్తం సీట్లలో సగానికి సగం సీట్లు కూడా వీరికి దక్కలేదు. పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలిసినప్పటికీ బరిలో నిలిచి ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు నామమాత్రపు పోటీని ఇస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు మరోమారు పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

పోలింగ్‌ బూత్‌ల వారీగా ఓటర్ల సంఖ్య

నిజామాబాద్‌ జిల్లాలో..

నిజామాబాద్‌ రూరల్‌ 76

మోపాల్‌ 12

డిచ్‌పల్లి 18

ఇందల్వాయి 12

నవీపేట 17

ధర్పల్లి 12

మాక్లూర్‌ 15

సిరికొండ 13

ఆర్మూర్‌ 53

నందిపేట 21

బాల్కొండ 10

ముప్కాల్‌ 7

మెండోరా 9

మోర్తాడ్‌ 11

ఏర్గట్ల 6

కమ్మర్‌పల్లి 13

భీంగల్‌ 28

వేల్పూర్‌ 14

జక్రాన్‌పల్లి 14

బోధన్‌ 57

రెంజల్‌ 12

ఎడపల్లి 12

కోటగిరి 15

రుద్రూర్‌ 7

వర్ని 10

చందూర్‌ 4

మోస్రా 5

మొత్తం 483 logo