గురువారం 29 అక్టోబర్ 2020
Nizamabad - Oct 06, 2020 , 01:30:21

2020-21 యాసంగి సాగు ప్రణాళిక ఖరారు

2020-21 యాసంగి సాగు ప్రణాళిక ఖరారు

సాగుకు కాలం కలిసి వస్తోంది. సమృద్ధిగా కురిసిన వర్షాలు.. పుష్కల జలవనరులు.. ప్రభుత్వం చేయూత.. విస్తృతమైన సాగు అవకాశాలు.. అన్నదాతల్లో కొత్త హుషారును నింపుతున్నాయి. దీంతో కర్షకులు ఉత్సాహంతో యాసంగికి సన్నద్ధమవుతున్నారు. వానకాలం సీజన్‌ ముగింపునకు వచ్చిన నేపథ్యంలో యాసంగి సాగుపై అధికార యంత్రాంగం దృష్టిసారించింది. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో 2020-21 యాసంగి సాగు ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. నిజామాబాద్‌లో 4.86 లక్షల ఎకరాలు.. కామారెడ్డిలో 3.31లక్షల ఎకరాలు.. వెరసి ఉభయ జిల్లాల్లో 8.17లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. వానకాలం లాగే యాసంగిలోనూ భిన్న పంటలు సాగయ్యే అవకాశముంది. నీటి లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వరి, మక్కజొన్న, శనగ సాగు పెరుగవచ్చని భావిస్తున్నారు. 

ఎరువులుంటే... విత్తనాలుండవు. ఇవి రెండూ ఉంటే... కరెంట్‌ ఉండదు. పోనీ కరెంటు వచ్చినా... భూగర్భంలో నీళ్లుండవు. భూగర్భ జలాలు ఉంటే... సాగు చేసే స్థోమత రైతుకుండదు. ఇలా ఒకదానికోటి ముడిపడి ఉన్న సంకట స్థితి నుంచి తెలంగాణ వచ్చాక రైతులు బయట పడ్డారు. సమైక్యాంధ్ర సర్కార్‌ తీరుతో నిండుగా నష్టాల్లో మునిగిపోయి... అడుగడుగునా మోసపోయిన కర్షకులు స్వరాష్ట్రంలో ఏడాది పొడవునా పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడింది. బోసిపోయిన చెరువులకు ప్రాణం పోసిన మిషన్‌ కాకతీయతో రైతులకు సగం ఊరట లభించింది. ఉచిత విద్యుత్‌ సరఫరాతో కర్షక లోకానికి సగం బెంగ తీరినట్లు అయ్యింది. విత్తనాలు, ఎరువుల కొరత లేకపోవడంతో రైతుల్లో ధీమా రెట్టింపు అవుతోంది. వానకాలం 2020 సాగు విజయవంతంగా ముగింపునకు చేరుకుంటుండగా యాసంగి 2020-21 కాలానికి వ్యవసాయ శాఖ సన్నద్ధం అవుతోంది. ఈ మేరకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసింది. వానకాలం మాదిరిగానే యాసంగిలోనూ జోరుగా పంటలు సాగయ్యే అవకాశముంది. కామారెడ్డి జిల్లాలో 3,31,901 ఎకరాల్లో, నిజామాబాద్‌ జిల్లాలో 4,86,218 ఎకరాల్లో పంటలు సాగుకానున్నట్లు వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. 

వ్యవసాయ జిల్లా..

రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు ప్రత్యేకత ఉంది. ఒక్కో జిల్లాకు ఒక్కోవిధంగా ప్రాధాన్యత ఉన్నట్లే... వ్యవసాయ జిల్లాగా నిజామాబాద్‌ గుర్తింపును సాధించింది. నిజామాబాద్‌లోని 29 మండలాలు, కామారెడ్డిలోని 22 మండలాల్లో అత్యధిక శాతం పంటలు సాగవుతున్నాయి. పంటల సాగుకు అనువైన ప్రాంతం అందుబాటులో ఉండడంతో ప్రభుత్వం సైతం వ్యవసాయ సాగు పరంగా జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. జిల్లాలో సాగుకు అనుకూలమైన భూములు, పుష్కలమైన నీటి వనరులు సైతం పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నాయి. వానకాలం పంట నూర్పిళ్లు ప్రారంభం అవుతుండగా రైతులు, వ్యవసాయాధికారులు యాసంగి పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు. చాలా ఏండ్ల తరువాత భారీ వర్షాలు కురిసి జల వనరులన్నీ పూర్తిగా నిండడంతో గతంలో కన్నా యాసంగి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశముంది. గతంలో తీవ్ర కరువును ఎదుర్కొన్న రైతులు.. ప్రస్తుతం చెరువులు నిండుగా ఉండడంతో గంపెడాశతో యాసంగికి సిద్ధమవుతున్నారు. 

ఈసారి భిన్నమైన సాగు

సాధారణంగా నీటి లభ్యత తక్కువగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది రైతులు యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేసేవారు. నీటి కొరత, కరెంటు కోతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సైతం యాసంగిలో వరి వేయకుండా ఆరుతడి పంటలే సాగు చేయాలని రైతులకు సూచించేది. ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు కురిసి సాగు నీటి వనరుల నిండా నీరుండడంతో ఎక్కువ మంది రైతులు వరి పంట సాగుకు మొగ్గుచూపుతున్నారు. వ్యవసాయ శాఖ వరి పంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశం ఉందని గుర్తించింది. నిజామాబాద్‌ జిల్లాలో మొత్తం 4,86,218 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలున్నట్లుగా అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. వరి 3,13,106 ఎకరాల్లో, మక్కజొన్న 47,922 ఎకరాల్లో, శనగ 35,744 ఎకరాల్లో సాగు చేయనున్నారు. కామారెడ్డి జిల్లాలో 3,31,901 ఎకరాల సాగు భూముల్లో పంటలు వేయనుండగా ఇందులో వరి 1,85,500 ఎకరాలు, మక్కజొన్న 46,023 ఎకరాలు, శనగలు 76,154 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనాలు చెబుతున్నాయి. వీటితోపాటు అపరాల సాగు సైతం రెండు జిల్లాల్లో వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు.

ధైర్యంగా ముందడుగు

నాలుగైదు ఏండ్లుగా చెరువుల్లో నీళ్లు లేక వ్యవసాయ క్షేత్రాలన్నీ బీడు భూములుగా మారాయి. సాగు నీరు లేక ఏం చేయాలో తెలియక అన్నదాతలు ఖాళీగానే ఉండిపోయారు. అనధికారికంగా క్రాప్‌ హాలీడే పాటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరిగిన జల సంపదతో సాగు విస్తీర్ణం రెండింతలు పెరిగింది. యాసంగి సాగు అంటేనే భయపడే రైతులంతా ఇప్పుడు కొండంత ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండు నీటితో కళకళలాడుతుండడంతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. యాసంగి పంటకు ఢోకా లేదన్న ఆత్మవిశ్వాసంతో రైతులు కదులుతున్నారు. గతేడాది 2019-20 యాసంగిలో కామారెడ్డి జిల్లాలో 3,22,726 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. సాధారణ విస్తీర్ణం కేవలం 1,60,803 ఎకరాలు మాత్రమే. 2020-21 యాసంగిలో 3,31,901 ఎకరాలకు అంచనాలు సిద్ధమయ్యాయి. గతంతో పోలిస్తే గణనీయంగా బీడు భూములు సాగుకు నోచుకున్నాయి. యాసంగిలో వరి సాగు సైతం భారీగా పెరగనుంది. గతేడాది యాసంగిలో వరి పంట సాధారణ విస్తీర్ణం 63,097 ఎకరాలు కాగా 1,85,840 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి ఇంచు మించుగా 1,85,500 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముంది. నిజామాబాద్‌ జిల్లాలోనూ 2019-20 యాసంగి సాధారణ విస్తీర్ణం మొత్తం 2,73,910 ఎకరాలు కాగా 4,53,534 ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకున్నాయి. 2020-21 యాసంగిలో గతేడాది కన్నా మరింతగా విస్తీర్ణం పెరుగనున్నట్లుగా వ్యవసాయ శాఖ ప్రణాళికల్లో స్పష్టం అవుతోంది. ఈసారి 4,86,218 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయి.


logo