మంగళవారం 27 అక్టోబర్ 2020
Nizamabad - Oct 05, 2020 , 03:33:56

సిద్ధులగుట్టను సుందరంగా తీర్చిదిద్దుతా

సిద్ధులగుట్టను సుందరంగా తీర్చిదిద్దుతా

ఆర్మూర్‌ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి 

ఆర్మూర్‌ : ఆర్మూర్‌ పట్టణానికే తలమానికమైన నవనాథ సిద్ధుల గుట్టను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్‌ ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పట్టణంలోని నవనాథ సిద్ధుల గుట్ట ఘాట్‌ రోడ్డు పనులను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. నవనాథ సిద్ధుల గుట్ట ఆధారంగానే ఆర్మూర్‌ అని పేరు వచ్చిందన్నారు.  గుట్టపై గతంలో నవసిద్ధులు తపస్సు చేశారన్నారు. కాలక్రమేణా తొమ్మిది మంది సిద్ధుల్లో ఆరుగురు, ముగ్గురుగా విడిపోయి వేర్వేరుగా తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారని వివరించారు. ఈ చారిత్రాత్మకమైన నవనాథ సిద్ధుల గుట్టను భవిష్యత్తులో ప్రజలు గుర్తుంచుకునేలా, పర్యాటక పరంగా అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్నామని వివరించారు.  ఇప్పటికే నవనాథ సిద్ధుల గుట్టపై నవ మందిరాల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్లు  చెప్పారు. వీటితోపాటు సిద్ధుల గుట్టపైకి వెళ్లే ఘాట్‌ రోడ్డు ఇదివరకు ఇరుకుగా ఉండేదని, దానిని విశాలంగా సుమారు 40 ఫీట్ల వెడల్పుతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.  ఘాట్‌ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి నిధులను వెంటనే విడుదల చేయాలని ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో  రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. ఎమ్మెల్యే వెంట ఆలయ కమిటీ చైర్మన్‌ ఏనుగు చంద్రశేఖర్‌రెడ్డి,  సభ్యులు భారత్‌గ్యాస్‌ సుమన్‌, పీసీ.గంగారెడ్డి, నక్కల లక్ష్మణ కె.మల్లయ్య, బొబిడె గంగాకిషన్‌ ఉన్నారు. logo