శనివారం 24 అక్టోబర్ 2020
Nizamabad - Oct 05, 2020 , 03:33:53

ఎస్సారెస్పీలో నిలకడగా నీటిమట్టం

ఎస్సారెస్పీలో నిలకడగా నీటిమట్టం

మెండోరా : ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీకి వరద తగ్గిపోవడంతో శనివారం రాత్రి 11 గంటలకు వరద గేట్లను మూసివేసినట్లు డీఈ జగదీశ్‌ ఆదివారం తెలిపారు. ఎస్సారెస్పీలోకి 12,303 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నదని చెప్పారు. ఎస్కేప్‌ గేట్ల నుంచి గోదావరిలోకి ఆరువేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని తెలిపారు. అలీసాగర్‌ ఎత్తిపోతలకు ఆదివారం ఉదయం నీటివిడుదలను ప్రారంభించామన్నారు. కాకతీయ కాలువకు నాలుగు వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 300 క్యూసెక్కుల నీటివిడుదల కొనసాగుతున్నదని వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి పూర్తిస్థాయి నీటి మట్టం కలిగి ఉందన్నారు. ఈ సీజన్‌లో ప్రాజెక్టులోకి వరద రూపంలో 268.75 టీఎంసీలు రాగా, దిగువన ఉన్న గోదావరిలోకి 151.88 టీఎంసీల నీటిని వదిలివేసినట్లు డీఈ తెలిపారు.

గోదావరిలో తగ్గిన వరద

రెంజల్‌ : మండలంలోని కందకుర్తి గోదావరినదిలో నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గోదావరిలో ఉన్న పురాతన శివాలయంపైన ఉన్న గోపురాలు ఒక్కొక్కటిగా  బయటపడుతున్నాయి. వారం రోజుల క్రితం నిండుగా ప్రవహించిన గోదావరి ఆదివారం నుం చి నీటి ప్రవాహం  క్రమంగా తగ్గుతున్నది. దీంతో జాలర్లు చేపల వేటకు నదిలోకి వెళ్తున్నారు.

తొమ్మిది టీఎంసీలు దాటిన ‘సాగర్‌'

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి రోజు రోజుకూ ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ఆదివారం సాయంత్రానికి తొమ్మిది టీఎంసీలు  దాటింది. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టినప్పటికీ 464  క్యూసెక్కుల ఇన్‌ఫ్లో  వస్తున్నట్లు డీఈఈ దత్తాద్రి తెలిపారు.  ప్రాజెక్టు నీటి మట్టం 1405. 00 అడుగులు(17.80 టీఎంసీలు) కాగా 1397.84 అడుగుల (9.17 టీఎంసీలు) వద్ద ఉందని చెప్పారు. సింగీతం, కళ్యాణి ప్రాజెక్టుల్లోకి సైతం ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. 


పర్యాటకుల సందడి

 నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో  పర్యాటకుల సందడి మొదలైంది. ఆదివారం సెలవు రోజు కావడంతో కామారెడ్డి జిల్లాతోపాటు హైదరాబాద్‌, కర్ణాటక, మహారాష్ట్ర, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రాజెక్టు వద్ద ఆహ్లాదంగా గడిపారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేశారు. 


logo